బాబాయ్ గెలిచేశారు!
లక్నో: ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ-కాంగ్రెస్ కూటమి ఘోర పరాజయ దిశగా పయనిస్తున్న క్రమంలో బాబాయ్ గెలుపు కిరీటం ఎగురవేశారు. జస్వంత్ నగర్ నుంచి పోటీ చేస్తున్న ఎస్పీ నేత, ములాయం సింగ్ తమ్ముడు శివ్ పాల్ సింగ్ యాదవ్ భారీ ఆధిక్యంలో గెలుపొందారు. ఏకంగా 1,26,834 ఓట్లతో ఆయన ఆధిక్యం సాధించగా.. ఆయనపై పోటీకి దిగిన బీజేపీ మనీష్ యాదవ్ పాత్రే 74,218 ఓట్లతో శివ్ పాల్ తర్వాత స్థానంలో ఉన్నారు. ఏకంగా 52వేల పైచిలుకు ఓట్లు తేడాతో శివ్ పాల్ విజయభావుటా ఎగురవేశారు. తనకి ఓటు వేసిన జస్వంత్ నగర్ ప్రజలకు శివ్ పాల్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ నియోజకవర్గంలో మొత్తం 3.65 లక్షల ఓటర్లున్నారు. వీటిలో 1.15 లక్షల ఓట్లు యాదవ్ లవే. మరోవైపు యూపీలో బీజేపీ భారీ ఆధిక్య దిశగా కొనసాగుతోంది. 15 ఏళ్ల తర్వాత తొలిసారి బీజేపీ ఆ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించబోతుంది. కులం, మతం ప్రాతిపదికను పక్కనపెట్టి, యూపీ ప్రజలు అభివృద్ధికి ఓటు వేశారని బీజేపీ నేతలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకున్న ఎస్పీ మాత్రం భారీగా చతికిల పడిపోయింది. ఎన్నికలకు ముందు పార్టీలో నెలకొన్న అంతర్గత రాజకీయ పోరులో పార్టీ కంట్రోల్ ను శివ్ పాల్ కోల్పోయారు. పార్టీ బాధ్యతలన్నీ అబ్బాయి అఖిలేష్ యాదవ్ తన చేతుల మీదుగా నడిపించారు. కానీ కాంగ్రెస్ తో పొత్తు బెడిసికొట్టి, ఓటమి దిశగా ఈ కూటమి పయనిస్తోంది.