లక్నో: తాను బతికున్నంత వరకు పార్టీని ముక్కలు కానివ్వనని సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అన్నారు. తమ పార్టీ అతిపెద్ద కుటుంబం అని కొన్నిసార్లు తీసుకునే నిర్ణయాలు ఇబ్బందులు కలిగిస్తున్నాయని, అయితే వాటిని ఒక్కొక్కటిగా తాము పరిష్కరించుకుంటున్నామని ఆయన చెప్పారు. తన నిర్ణయాలు అటు సోదరుడు శివ్పాల్గానీ, ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ గానీ తిరస్కరించబోరని అన్నారు. తాను బతికున్నవరక పార్టీని ముక్కలు కానివ్వనని ములాయం చెప్పగానే అక్కడ ఉన్నవారంతా గట్టిగా అరుస్తూ చప్పట్లు కొట్టారు.
పార్టీలో, కుటుంబంలో విభేదాలు ఉన్నాయని వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టి పారేశారు. ఎవరూ ఎలాంటి తప్పు చేయలేదని, తాను మాత్రమే పెద్ద తప్పు చేశానని అన్నారు. తన సోదరుడు శివ్ పాల్ పార్టీ కోసం ఎంతో పనిచేశారని, కష్టపడి పని చేసే స్వభావం తనదని, కానీ ఏ ఒక్కరోజు తనకు ఇది కావాలని అడగడంగానీ, తాను తీసుకున్న నిర్ణయాలు కాదని చెప్పడంగానీ చేయలేదని తెలిపారు.
అఖిలేశ్ కూడా అలాగే ఉండేవాడని, మరి సమస్య ఎక్కడ వచ్చిందో క్షేత్రస్థాయిలో ఆలోచించి గుర్తిస్తామని చెప్పారు. ఏదైనా సమస్యలు ఉంటే పార్టీలోనే చర్చించుకోవాలని, వచ్చేది ఎన్నికల సమయం అయినందున ప్రతి ఒక్కరు అప్రమత్తమై మరోసారి సంపూర్ణ మెజార్టీతో విజయం సాధించాలని సూచించారు. సమస్య పరిష్కారం అయిందని, ప్రతి ఒక్కరు పార్టీ ఉన్నతికి కృషి చేయాలని అన్నారు. సీఎం అఖిలేశ్, ములాయం సోదరుడు శివ్ పాల్ మధ్య కొద్ది రోజులుగా తీవ్ర విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే.
'నేను బతికుండగా అలా జరగనివ్వను'
Published Sat, Sep 17 2016 9:17 AM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM
Advertisement