తండ్రితో అమీతుమీనా.. రాజీనా!
సైఫై: ఉత్తరప్రదేశ్లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. క్షణక్షణం ఏం జరుగుతుందా అని అటు రాష్ట్ర ప్రజలతోపాటు దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఆరాటం(అఖిలేశ్ యాదవ్), అనుభవం(శివపాల్ యాదవ్) పోటీ పడుతుండగా వారిద్దరిని తిరిగి సమన్వయ పరిచేందుకు సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోపక్క, తాను కీలక నిర్ణయం తీసుకున్న వెంటనే అనూహ్య నిర్ణయం తీసుకొని తనకు ఝలక్ ఇచ్చిన తండ్రి ములాయం సింగ్ యాదవ్ తో తేల్చుకునేందుకు యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఢిల్లీకి పయనమవుతున్నాడు.
అందులో భాగంగానే నేడు రాష్ట్రంలో ఆయనకు ఉన్న అధికారిక కార్యకలాపాలన్ని ఇప్పటికే రద్దు చేసుకున్నారు. స్వయంగా బాబాయ్ అయిన శివపాల్ యాదవ్ కు ఉన్న ప్రముఖ శాఖలన్నింటిని తొలగించి కేవలం సంక్షేమ శాఖ మాత్రమే ఉంచిన అనంతరం తీవ్ర అసంతృప్తికి లోనయిన శివపాల్ తన కేబినెట్ హోదాకు రాజీనామా చేస్తారని ఊహాగానాలు వచ్చిన విషయం తెలిసిందే. అవి అలా ఊపందుకున్నాయో లేదో వెంటనే సమాజ్ వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షత బాధ్యతల నుంచి అఖిలేశ్ ను తప్పించి ఆ బాధ్యతలు శివపాల్ కు ఇచ్చి ములాయం గట్టి ఝలక్ ఇచ్చారు.
దీంతో తండ్రి కొడుకుల మధ్య పరస్పర యుద్ధ పరిస్థితి మొదలైంది. తన దూకుడుకు ప్రతి క్షణం కళ్లెం వేస్తున్నాడని తండ్రిపై అఖిలేశ్ తీవ్ర అసంతృప్తితో ఉండగా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన ములాయం తమ్ముడు శివపాల్ మాత్రం తన సోదరుడు ఏది చెప్తే అదే చేస్తానని, ఆయన మాటను తూచ తప్పబోనని ప్రకటించాడు. ఈ రోజంతా ఆయనతో సమావేశం అయిన తర్వాతే తన రాజీనామా అంశం, పార్టీలో పరిస్థితులపై మాట్లాడతానని చెప్పాడు. ప్రస్తుతం ములాయం ఢిల్లీలో ఉన్నారు.
ఆయనను కలిసి బాబాయ్, అబ్బాయ్లు ఫిర్యాదులు చేయనున్నట్లు తెలిసింది. వారిద్దరిని ఢిల్లీకి రమ్మని ములాయం ఇప్పటికే పిలిచారని కూడా సమాచారం. మరోపక్క, అఖిలేశ్ యాదవ్ చేసిన ఆవేశ పూరిత పనికి సోదరుడు ఎక్కడ చేజారిపోయి చీలిక తీసుకొస్తాడోనన్న భయంతోనే ములాయం అతడికి రాష్ట్ర పగ్గాలు అప్పజెప్పి ఉంటారని కొందరు అంటుండగా.. ప్రజల దృష్టిని ఒకసారి తమవైపు మళ్లించే వ్యూహంలో భాగంగానే వారే కావాలని ఈ హైప్ క్రియేట్ చేస్తున్నారని ఇంకొందరు చెవులు కొరుక్కుంటున్నారు.