శివపాల్ శాఖలు మళ్లీ వెనక్కి!
శివపాల్ శాఖలు మళ్లీ వెనక్కి!
Published Fri, Sep 16 2016 9:19 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
ఉత్తరప్రదేశ్ సర్కారులోను, యాదవ్ కుటుంబంలోను నెలకొన్న సంక్షోభానికి 'నేతాజీ' ములాయం సింగ్ యాదవ్ నాలుగు పాయింట్ల ఫార్ములాతో ఓ పరిష్కారం కనుగొన్నారు. ప్రధానంగా.. తీవ్రంగా మనస్తాపానికి గురై, మంత్రి పదవికి, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తమ్ముడు శివపాల్ యాదవ్ ను అన్ని రకాలుగా బుజ్జగించడం ఇందులో ప్రధానంశంగా కనిపిస్తోంది. ఇంతకుముందు ఆయన నుంచి తీసేసిన మంత్రిత్వ శాఖలను మళ్లీ ఇవ్వడం సహా అన్నీ శివపాల్ మెప్పుకోసమే చేసినట్లు కనిపిస్తున్నాయి. ములాయం ప్రతిపాదించిన ఫార్ములా ప్రకారం శివపాల్ యాదవ్కు ఆయన మంత్రిత్వశాఖలన్నింటినీ తిరిగి ఇవ్వడం, ఇంతకుముందు అవినీతి ఆరోపణలతో తొలగించిన గాయత్రీ ప్రజాపతిని వేరే శాఖ అప్పగించి మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకోవడం ప్రధానమైనవి.
ఇవి కాక.. రాబోయే ఎన్నికల నాటికి కూడా శివపాల్ యాదవ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటారు. కానీ టికెట్ల కేటాయింపులో మాత్రం ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్కు కూడా సమాన ప్రాధాన్యం ఉంటుంది. దాంతోపాటు.. ప్రధానంగా 'బయటి' వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలన్నది సైతం ఇందులో ప్రధానాంశంగా కనిపిస్తోంది. పార్టీలో గొడవలన్నింటికీ ఇటీవలే మళ్లీ పార్టీలోకి వచ్చిన సీనియర్ నాయకుడు అమర్ సింగ్ ప్రధాన కారణం అన్నది ములాయం సింగ్ భావన. అందుకే త్వరలోనే అమర్ సింగ్ మీద సైతం చర్యలు తప్పకపోవచ్చని అంటున్నారు. అయితే పైకి మాత్రం అమర్ సహా ఎవరి పేరునూ ప్రకటించలేదు.
Advertisement