
రెండు టెండర్లను అధిక ధరలకు ఆమోదించిన సీఆర్‌డీఏ
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ గ్రీన్ సిగ్నల్
రివర్స్ టెండరింగ్ నిర్వహించి ఉంటే రూ.67.74 కోట్లు ఆదా
సాక్షి, అమరావతి: అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణ టెండర్లను అధిక ధరలతో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. హైకోర్టు భవన నిర్మాణానికి రూ.752,06,25,211ను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) టెండర్లు పిలిచింది. ఈ టెండర్‌లో 4.52 శాతం అధిక (ఎక్సెస్) ధరకు అంటే రూ.786,05,57,470.54 కోట్ చేసిన ఎన్‌సీసీ లిమిటెడ్ సంస్థ ఎల్–1గా నిలిచింది. అసెంబ్లీ భవన నిర్మాణానికి రూ.590,86,61,979ను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది.
ఈ టెండర్‌లో 4.48 శాతం అధిక ధరకు అంటే రూ.617,33,70,035.66 కోట్ చేసిన ఎల్ అండ్ టీ లిమిటెడ్ సంస్థ ఎల్–1గా నిలిచింది. ఈ టెండర్లను ఈనెల 5న జరిగిన సమావేశంలో సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదిస్తూ తీర్మానం చేసింది. అసెంబ్లీ భవన నిర్మాణ పనులను ఎల్ అండ్ టీకి, హైకోర్టు భవన నిర్మాణ పనులను ఎన్‌సీసీ సంస్థకు అప్పగించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈనెల 7న సీఆర్‌డీఏ కమిషనర్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు పంపారు.
వాటిని పరిశీలించిన ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్ ఆమోదిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఆర్‌డీఏ అథారిటీ చేసిన తీర్మానం మేరకు అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణ పనులను ఆ సంస్థలకు అప్పగించడానికి చర్యలు తీసుకోవాలని సీఆర్‌డీఏ కమిషనర్‌ను ఆదేశించారు. కాగా, ఈ రెండు టెండర్లలో అధిక ధరలకు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.60.46 కోట్ల భారం పడింది.
గత ప్రభుత్వం తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం ప్రకారం టెండర్లు నిర్వహించి ఉంటే కనీసం 4.5 నుంచి 5 శాతం తక్కువ ధరకే పనులు చేయడానికి కాంట్రాక్టర్లకు ముందుకొచ్చేవారు. దీని వల్ల ఖజానాకు రూ.67.74 కోట్ల మేర ఆదా అయ్యేదని ఇంజినీరింగ్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.