యాపిల్‌ డీఈఐ కార్యక్రమాలు రద్దు చేసుకోవాలని ప్రతిపాదనలు | NCPPR drafted a proposal urging Apple to abandon its DEI initiatives | Sakshi

యాపిల్‌ డీఈఐ కార్యక్రమాలు రద్దు చేసుకోవాలని ప్రతిపాదనలు

Feb 26 2025 1:09 PM | Updated on Feb 26 2025 2:22 PM

NCPPR drafted a proposal urging Apple to abandon its DEI initiatives

అమెరికాలోని నేషనల్ సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ రీసెర్చ్ (ఎన్సీపీపీఆర్‌) యాపిల్ తన డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్‌(డీఈఐ) కార్యక్రమాలను రద్దు చేసుకోవాలని కోరుతూ ఇటీవల ఒక ప్రతిపాదనను రూపొందించింది. దీనికి స్పందించిన యాపిల్‌ వాటాదారులు ఎన్సీపీపీఆర్‌ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. డీఈఐ కార్యక్రమాలకు కట్టుబడి ఉంటానని యాపిల్‌ స్పష్టం చేసింది.

అమెరికాలోని ప్రజా విధాన సమస్యలకు స్వేచ్ఛా మార్కెట్ పరిష్కారాలను ప్రోత్సహించడంపై ఎన్సీపీపీఆర్‌ దృష్టి సారిస్తుంది. అయితే యాపిల్‌ అనుసరిస్తున్న డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్‌(డీఈఐ) కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఎన్సీపీపీఆర్‌ ప్రతిపాదనలు సిద్ధం చేయడం చర్చనీయాంశమైంది. ఫెడరల్ ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో డీఈఐ కార్యక్రమాలను నిర్వీర్యం చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విస్తృతంగా ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన వస్తున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.

డీఈఐపై చట్టపరమైన, ఆర్థిక ఆందోళనలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డీఈఐ కార్యక్రమాలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. తన ప్రమాణ స్వీకారం తరువాత ఫెడరల్ ఏజెన్సీలను అన్ని డీఈఐ కార్యక్రమాలను నిలిపివేయాలని ఆదేశిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వు(ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌)ను జారీ చేశారు. వాటిని ‘ప్రజా వ్యర్థాలు’గా అభివర్ణించారు. ఈ ఉత్తర్వులు ప్రైవేట్ కంపెనీలను కూడా వర్తింపజేయాలని చెప్పారు. డీఈఐ ప్రోగ్రామ్‌లతో ముడిపడి ఉన్న చట్టపరమైన ప్రమాదాల గురించి కొన్ని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇవి వివక్షకు సంబంధించిన కేసులకు దారితీస్తాయని భయపడుతున్నాయి. డీఈఐ కార్యక్రమాలు ఆర్థిక ప్రమాదాలను కలిగిస్తాయనే నమ్మకం కొంతమంది వ్యాపార నాయకుల్లో ఉంది.

ఇప్పటికే డీఈఐ కార్యక్రమాల నుంచి వైదొలిగిన కొన్ని హైప్రొఫైల్ కంపెనీల బాటలోనే యాపిల్ కూడా నడవాలని ఎన్సీపీపీఆర్ ప్రతిపాదన కోరుతోంది. డీఈఐ కార్యక్రమాలు కంపెనీలకు, వాటి వాటాదారులకు గణనీయమైన ఆర్థిక ప్రమాదాలను కలిగిస్తాయని వాదిస్తుంది. డీఈఐ విధానాలు ఇటీవలి కోర్టు తీర్పులకు అనుగుణంగా లేవని సూచిస్తుంది.

ఇదీ చదవండి: ఇన్ఫోసిస్‌లో 20 శాతం వరకు వేతన పెంపు

యాపిల్ స్పందన..

ఎన్సీపీపీఆర్ నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ యాపిల్ తన డీఈఐ కార్యక్రమాలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేసింది. కంపెనీ వైవిధ్య కార్యక్రమాలు తన సంస్కృతి, విధానాల్లో భాగమని తెలిపింది. డీఈఐ ప్రయత్నాలు మరింత సమ్మిళిత, సృజనాత్మక పనివాతావరణాన్ని సృష్టిస్తాయని నొక్కి చెప్పింది. ఇటీవల జరిగిన వాటాదారుల సమావేశంలో యాపిల్ యాజమాన్యం దాని డీఈఐ కార్యక్రమాలను సమర్థించుకుంది. వాటాదారులు ఎన్సీపీపీఆర్‌ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటు వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement