జీవితపు తాళంచెవి | Sakshi Editorial On Life Questions | Sakshi

జీవితపు తాళంచెవి

Jan 6 2025 12:04 AM | Updated on Jan 6 2025 12:04 AM

Sakshi Editorial On Life Questions

‘‘ఉదయం నాలుగు కాళ్లతో, మధ్యాహ్నం రెండు కాళ్లతో, సాయంత్రం మూడు కాళ్లతో నడిచేది ఏమిటి?’’ క్రీస్తు పూర్వ కాలపు గ్రీకు విషాదాంత నాటక రచయిత సోఫోక్లిస్‌ రాసిన ‘ఈడిపస్‌ రెక్స్‌’ నాటకంలో ‘స్ఫింక్స్‌’ అడిగే ఈ చిక్కుప్రశ్న పాశ్చాత్య సాహిత్యంలో శ్రేష్ఠమైనది. థీబ్స్‌ నగరంలోకి ప్రవేశించాలంటే– మనిషి ముఖం, సింహం శరీరం, గద్ద రెక్కలుండే స్ఫింక్స్‌ ప్రశ్నలకు సమాధానం చెప్పే తీరాలి. లేదంటే మరణం తప్పదు. 

చివరకు రాజు ఈడిపస్‌ వాటికి జవాబు చెప్పి, ఆ విచిత్ర జీవి పీడను వదిలిస్తాడు. పాకే బాలుడిగా నాలుగు కాళ్లతో, నిటారుగా నిలబడే యువకుడిగా రెండు కాళ్లతో, వృద్ధుడిగా కర్ర ఊతంగా మూడు కాళ్లతో నడిచే ‘మనిషి’ దీనికి సమాధానం. ఇందులోదే మరో ప్రశ్న. ఇద్దరు అక్కాచెల్లెళ్లు. అక్క చెల్లికి జన్మనిస్తే, తిరిగి చెల్లి అక్కకు జన్మనిస్తుంది. ఏమిటి ఇందులోని మర్మం? ఆ అక్కాచెల్లెళ్లు రాత్రీ పగలూ అని తెలిస్తే, ఆ రోజు ఎంత బాగుంటుంది!

ఇలాంటి చిక్కు ప్రశ్నలు సాహిత్యంలో లెక్కకు మిక్కిలిగా కనబడతాయి. కూట ప్రశ్న, పొడుపు కథ, ప్రహేళికగా అర్థం ఉన్న ‘రిడిల్స్‌’ ఆబాలగోపాలాన్నీ అలరిస్తాయి. ‘పొడుపు కథల’ రూపంలో చెప్పినప్పుడు పిల్లలు వాటికోసం చెవులు అప్పగిస్తారు; పెద్దలకు జ్ఞానచక్షువులు తెరుచుకుంటాయి. ఏ స్థాయిలో వారికి ఆ స్థాయి కఠినత్వం, విస్తృతి వీటిల్లో కలగలిసి ఉంటాయి. అందుకే ఇవి సాహిత్యంలో ఒక మనోహరమైన అంశంగా ప్రత్యేకంగా కనబడతాయి. జీవితంలోని సంక్లిష్టతలను తేలిగ్గా విడమరిచి చెప్పడానికి పనికొస్తాయి.

నాలుగు వేల ఏళ్ల క్రితం నుంచే జనం తమ మేధాశక్తిని, విశ్లేషణా సామర్థ్యాలను చిక్కుప్రశ్నలతో సాన పట్టుకున్నారు. ప్రపంచానికి తెలిసిన తొట్టతొలి చిక్కుప్రశ్నల్లో ఒకటి ఒకప్పటి సుమేరియన్‌ (ఇప్పటి ఇరాక్‌ ప్రాంతం) నాగరికతా సాహిత్యంలో కనిపిస్తుంది. ‘అక్కడొక ఇల్లుంది. అందులోకి ఒకరు గుడ్డివాడిగా ప్రవేశించి, చూపుతో బయటికి వస్తారు. 

ఏమిటది?’ ప్రపంచానికి రాత రూప పలకలను పరిచయం చేసిన సుమేరియన్‌ నాగరికత మనిషి విజ్ఞానానికి అమితమైన ప్రాధాన్యతను ఇచ్చింది. అందుకే పై ప్రశ్నకు ‘బడి’ సమాధానం కావడంలో ఆశ్చర్యం లేదు. అజ్ఞానం అనేది అంధత్వమే కదా! చదువుతో వచ్చే జ్ఞానం మనిషికి ఒక కొత్త చూపునిస్తుంది కదా! 

‘‘పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, చెట్టు పైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘రాజా, శ్రమ తెలియకుండా ఉండటానికి’’ అంటూ ప్రారంభించి ఒక కథ చెప్పడమూ, ఆ కథ చివర పలు ప్రశ్నలు సంధించడమూ, ఆ కథలోని ప్రశ్నలకు ‘సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల వేయి ముక్కలుగా పగిలిపోతుంది’ అని షరతు విధించడమూ, విక్రమార్కుడు జవాబు చెప్పి ‘మౌనభంగం కాగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తిరిగి చెట్టెక్క’డమూ తెలుగు బాల కథా సాహిత్యంలో ఒక అరుదైన ధారావాహిక వేడుక. 

మూలంలోని భట్టి విక్రమార్క కథల్లో బేతాళుడు అడిగిన 23 ప్రహేళిక ప్రశ్నల నమూనాలోనే ‘చందమామ’ పత్రిక ఎన్నో ప్రశ్నలను సంధించింది. అయితే, అసలు మూలంలో విక్రమార్కుడంతటివాడు కూడా జవాబు ఇవ్వలేని ప్రశ్న ఏమిటి? ఇరువురికీ భార్యలు లేని ఓ తండ్రి కొడుకులు తోవలో పాదముద్రలను చూసి, పెద్ద పాదాలావిడను తండ్రీ, చిన్న పాదాలావిడను కొడుకూ పెళ్లాడాలనుకుంటారు. 

తీరా పెద్ద పాదాలావిడ కూతురుగానూ, చిన్న పాదాలావిడ తల్లిగానూ తేలుతుంది. అయినా ఇచ్చుకున్న మాట ప్రకారమే వాళ్లు పెళ్లి చేసుకుంటారు. అప్పుడు ఆ ఇద్దరికీ చెరొక కొడుకు పుడితే, వాళ్లు వరుసకు ఏమవుతారు? బేతాళుడు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం లేక, విక్రమార్కుడు సహేతుక మౌనం వహించడంతో బేతాళుడు ఆయన వశమవుతాడు. కాలగమనంలో సడలనున్న నైతిక నియమావళికి ఈ ప్రశ్నొక ముందుచూపు. 

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ‘వడ్లగింజలు’ కథలోని ఇతివృత్తం ఒక ప్రశ్న కాకపోయినా చిక్కుతో ముడిపడినదే. ‘‘చదరంగానికి అరవై నాలుగు గదులు. మొదటి గదిలో వొక వడ్లగింజ వుంపించండి. తరవాత రెండో గదిలో రెండు, మూడో గదిలో నాలుగు, నాలుగో గదిలో యెనిమిది– యిలాగా వెళ్లినకొద్దీ రెట్టింపు చేయిస్తూ నాకు వడ్లగింజలు దయచేయించండి మహాప్రభూ’’ అంటూ తాను చదరంగంలో గెలిస్తే ఏమివ్వాలో తన ప్రత్యర్థి అయిన ‘శ్రీ వత్సవాయి చతుర్భజ తిమ్మజగపతి మహారాజులు’ గారికి తంగిరాల శంకరప్ప సవినయంగా విన్నవించుకుంటాడు. 

తీరా ఆటలో మహారాజును కట్టడి చేశాక, ‘‘మహాప్రభూ! వారి కోరిక తీర్చాలంటే పెద్దాపురం రాజ్యంలోనే కాదు, త్రిలింగ దేశం అంతటా వరాసగా నూరు సంవత్సరాలు పండిన ధాన్యం అయినా చాలదు’’ అని తేలినప్పుడు అందరూ నోరెళ్లబెట్టవలసి వస్తుంది. 

సాహిత్యంలో ఇలాంటి చిక్కుప్రశ్నలు మాటల ఎత్తుగడలను, భాషాపటిమను చాటుతాయి. పాత్ర లక్షణాలను బహిర్గతం చేయడానికీ, వాటి తెలివితేటలను తెలియజెప్పడానికీ, కథను ముందుకు నడపడానికీ కూడా రచయితలు వాటిని ఉపయోగించుకున్నారు. 

ఈ చిక్కుప్రశ్నలు తరచుగా జ్ఞానం, అవగాహన కోసం మానవుడు చేసే అన్వేషణను సూచిస్తాయి. జీవితం అనేది ఒక తాళం అయితే, దాన్ని తెరిచే తాళంచెవి ఒక కూటప్రశ్న. అదే సమయంలో అది ఒక మనోవ్యాయామం, ఒక భాషావినోదం, ఒక తాత్విక పరిమళం, ఒక జీవిత రహస్యం కూడా! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement