
ఇంటి పనుల్లో భర్త భాగస్వామ్యం అవసరం
ఇద్దరి మధ్య బలమైన బంధానికి పునాది
వర్క్ షేరింగ్.. హ్యాపీనెస్ లోడింగ్ అంటున్న మానసిక నిపుణులు
రోజంతా బండెడు చాకిరీ చేసే భార్యకు ఇంటి పనిలో భర్త చేసే చిన్నపాటి సాయం ఎంతో ఉపశమనాన్నిస్తుంది. లేచింది మొదలు పడుకునే వరకు అలుపెరుగని ఆమె శ్రమకు వారంలో ఒక్కరోజైనా విరామం అవసరం. ఆదివారం (Sunday) భర్త ఇంటి పనులు చక్కబెడుతూ ఆమెను మురిపిస్తే వారి సంసార బంధం మరింత బలపడుతుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.
సాక్షి, భీమవరం: తెల్లారి లేచింది మొదలు ఆడవాళ్ల చేతులు పనులకు ముడిపడతాయి. ఇంటిని శుభ్రం చేయడం, పిల్లలకు స్నానాలు చేయించడం, భర్త, పిల్లలు రెడీ అయ్యేసరికి టిఫిన్లు సిద్ధం చేసి పెట్టడం. అవి పూర్తయ్యేలోగా లంచ్ బాక్స్‌లు ప్యాకింగ్. ఇలా.. ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు క్షణక్షణం ఉరుకులు పరుగుల జీవితం.
భర్తను ఉద్యోగానికి, పిల్లల్ని బడికి సాగనంపాక బండెడు గిన్నులు తోముకుని, ఇంటిల్లపాదివి మాసిన దుస్తులు ఉతుక్కుని, స్నానం చేసి దేవుడికి దణ్ణం పెట్టుకుని.. హమ్మయ్యా అనుకునేసరికి టైం 11 అయిపోతుంది. చాలామంది గృహిణులు ప్రశాంతంగా కూర్చుని టిఫిన్ చేసేది అప్పుడే. సాయంత్రం పిల్లలు, భర్త ఇంటికి తిరిగి వచ్చే వరకు ఏదో పనిలో ఈదుతూనే ఉంటారు. పిల్లలతో హోం వర్క్ చేయించి రాత్రి అందరూ పడుకున్నాక ఉదయానికి అన్నీ సర్దుకుని అలసిసొలసి అప్పుడు నిద్రలోకి జారుకుంటుంటారు.
కుటుంబానికి చేదోడుగా..
భర్త, పిల్లల్ని సాగనంపి కుటుంబ పోషణకు చేదోడుగా ఉద్యోగాలు, పనులు చేస్తున్న మహిళలు ఎందరో ఉన్నారు. వీరిపై పనిభారం మరింత ఎక్కువగా ఉంటుంది. దాదాపు ప్రతి ఇంటిలో తొలి మేలుకొలుపు భార్యదే. రాత్రి బాగా పొద్దిపోయాక నిద్రపోయేది ఆమెనే. పనుల సుడిగుండంలో తనను తాను మరిచిపోయి ఎల్లప్పుడూ కుటుంబ క్షేమం కోరే వ్యక్తి ఇల్లాలు. అలాంటి అర్ధాంగికి ఉపశమనం (Relief) కలిగించేలా వారాంతాలు, ముఖ్యంగా ఆదివారం ఇంటి పనుల్లో భర్త సహాయం చేయడం ద్వారా గృహిణుల మానసిక, శారీరక స్థితులు మ రింత దృఢమవుతాయని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. గృహ సంబంధ బాధ్యతలు పంచుకోవడం మేలని, ఈ దిశగా అందరూ ముందుండాలని అంటున్నారు.
ఏమేం చేయాలంటే..
→ఉదయం లేవగానే గదులను తుడవడం, దుమ్ములు దులిపి ఇంటిని శుభ్రం చేయడం. ఇంటి ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలు తొలగించడం, మొక్కలకు నీరు పెట్టడం. గిన్నెలు తోమడం, కూరగాయలు కోయడం, వంట చేయడం. దుస్తులు ఉతికి ఆరబెట్టడం, ఐరెన్ చేయడం
→ పిల్లలు ఇంటి వద్దనే ఉంటారు కాబట్టి వారికి స్నానాలు చేయించడం, హోంవర్క్‌లో సాయం చేయడం, వారితో కలిసి సరాదాగా ఆడుకోవడం వంటివి భర్తలు చేస్తుండాలి.
ప్రయోజనాలెన్నో..
→ ఇంటిపనిలో చేదోడువాదోడుగా ఉండే భర్తని ఇల్లాలు చాలా ఎక్కువగా ప్రేమిస్తుందని నిపుణులు అంటున్నారు. భర్త తనను ఎంత ప్రేమగా, బాధ్యతగా చూసుకుంటున్నాడో అర్థం చేసుకుంటుంది. ఇద్దరి మధ్య ఏమైనా మనస్పర్థలు, అపార్థాలు ఉంటే తొలగిపోతాయి. ఆదివారం వర్క్ షేరింగ్‌తో ఆ ఇంట హ్యాపీనెస్ (Happiness) లోడింగ్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
→ ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటేనే ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటారు. విశ్రాంతి వలన ఆమె శారీరక, మానసిక స్థితి మెరుగుపడుతుంది.
→ ఇంటి పనులు త్వరగా పూర్తయితే ఇద్దరూ కూర్చుని కబుర్లు చెప్పుకునేందుకు సమయం పెరుగుతుంది.
→ సెలవురోజున పని అయ్యాక ఇల్లాలని సరదాగా బయటకు తీసుకువెళ్లడం వలన వారికి రీఫ్రెష్ అయిన భావన కలిగి వారమంతా ఉత్సాహంగా ఉండే వీలుంటుంది.
→ ఇల్లాలు భర్త నుంచి కొంత సమయం కోరుకుంటుంది. అది కూడా స్నేహపూర్వక వాతావరణంలో ఉండాలని భావిస్తుంది. ప్రేమగా వారి పనుల్లో పాలుపంచుకోవడం వలన ఇది సాధ్యపడుతుంది.
→ ఇంటి పని మహిళలే చేయాలన్న భావన నుంచి బయటపడొచ్చు.
చదవండి: పిల్లలు స్కూల్ నుంచి రాగానే వారికి ఏం నేర్పిస్తున్నారు?
భార్యకు విశ్రాంతి అవసరం
భార్యకు ఒక్కరోజు విశ్రాంతినివ్వడం ఎంతో అవసరం. పని ఒత్తిడి నుంచి వారికి ఉపశమనం కలుగుతుంది. వారిని పట్టించుకోనట్టు ఉంటేనే ఆడవారికి అలకలు, కోపాలు వస్తాయి. భర్త ఇంటి పనుల్లో కలుగజేసుకుని భార్యకు చేసే సాయం వారి బంధానికి మరింత బలమవుతుంది. కౌన్సెలింగ్‌లో భార్యాభర్తలకు ఈ విషయాన్ని చెబుతుంటాం.
– చల్లా భారతిదేవి, సైకియాట్రిస్ట్, పాలకొల్లు
ఆయనకు సెలవొస్తే..
మా వారు పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగి. ఆదివారం, సెలవు రోజుల్లో ఇంటి వద్ద వంట పని, ఇంటి పనుల్లో సాయం చేస్తుంటారు. నా కష్టాన్ని అర్థం చేసుకునే మనస్తత్వం ఆయనకు ఉందని సంతోషం, సంతృప్తి కలుగుతుంటాయి. నేను ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటానికి నా భర్త సహకారమే కారణం.
– అంబటి అరుణ సూర్యకుమారి, గృహిణి, నరసాపురం
తప్పనిసరిగా సహకరించాలి
ఇంటి, వంట పనుల్లో భార్యకు తప్పనిసరిగా సహకరించాలి. నేను వ్యాపారరీత్యా ఆరు రోజులు షాపులో ఉన్నా ఆదివారం తప్పనిసరిగా ఇంటి పనుల్లో నా భార్య లక్ష్మీకుమారికి సహాయపడతాను. ఇతర రోజుల్లోనూ ఇతర పనుల్లో సహాయం చేస్తా. భా ర్యలకు సాయం చేయడం బాధ్యతగా భావించాలి తప్ప నామోషిగా ఫీల్ కాకూడదు.
– కారుమూరి నర్సింహమూర్తి (బాబు), భీమవరం
ఇంటి పనుల్లో సాయపడతాను
నేను ప్రభుత్వ హైస్కూల్ ఉపాధ్యాయుడిని. ఉదయం నుంచి రాత్రి వరకూ ఇంటి కోసం కష్టపడే నా సతీమణి కోసం ఆదివారం ఇంటి పనుల్లో సాయపడతాను. అప్పుడు తెలుస్తుంది ఇంటిని చక్కబెట్టేందుకు ఆవిడ ఎంత కష్టపడుతుందోనని. పొద్దస్తమాను పనిచేసే మహిళలకు వారంలో ఒక రోజు విశ్రాంతి అవసరం.
– పొద్దోకు గజేంద్ర గడ్కర్, ఉపాధ్యాయుడు, రాయకుదురు