కాసే చెట్టుకే... రాళ్ల దెబ్బలా! | AP Govt Employees IR And PRC Guest Column By Kommineni Srinivasa Rao | Sakshi
Sakshi News home page

కాసే చెట్టుకే... రాళ్ల దెబ్బలా!

Jan 26 2022 4:04 AM | Updated on Jan 26 2022 4:27 AM

AP Govt Employees IR And PRC Guest Column By Kommineni Srinivasa Rao - Sakshi

ఒక పక్క కరోనా సమస్యతో ఆర్థిక సంక్షోభం. మరో వైపు ఉద్యోగులు తమ జీతాలు మరింత పెంచాల్సిందేనన్న డిమాండ్‌తో ఆందోళన. గత కొద్ది దశాబ్దాలలో ఇంత చిత్రమైన సమ్మె ఆలోచన జరిగి ఉండకపోవచ్చని అనుభవజ్ఞుల వ్యాఖ్య. కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం హెచ్‌ఆర్‌ఎ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయిస్తే, దానిపై సమ్మెకు వెళ్లడమా? ప్రస్తుత ప్రభుత్వం హామీ మేరకు ఇంటరిమ్‌ రిలీఫ్‌ ఇచ్చిందనీ, దేశంలో బాగా జీతాలు ఇచ్చే రాష్ట్రాలలో ఏపీ ఒకటి అనీ ఇదే ఎన్జీవో నేతలు అంగీకరిస్తూనే సమ్మె చేస్తామనడం విడ్డూరం. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు డిమాండ్లు ఉండ వచ్చు. వేతన సవరణలో తమకు నష్టం జరిగిందని లెక్కలు వేసుకుని ఉండవచ్చు. ఉద్యోగులకు జీతాలు ఇరవైశాతం పెరుగుతాయని చీఫ్‌ సెక్రటరీతో సహా ఆర్థిక శాఖ ఉన్నతా ధికారులు చెబుతున్నారు. అయినా ఉద్యోగ సంఘాల నేతలు కన్విన్స్‌ కాలేదు. ఏకంగా సమ్మె నోటీసు ఇచ్చారు.

పీఆర్సీ జీఓలు రద్దు చేసేవరకు తాము మంత్రుల కమిటీతో చర్చలు జరపబోమని వారు అంటున్నారు. వాళ్ల సమస్యలను ప్రభుత్వానికి చెప్పవచ్చు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమే. వారి సహకారం లేకుండా ఏ ప్రభుత్వం తాను అనుకున్న పనులు సజావుగా పూర్తి చేయ లేదు. ఇంటి అద్దె అలవెన్స్‌లో కొంత తగ్గిందన్నది వారి భావన. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దీని వల్ల ఉద్యోగులకు ఏడాదికి ఇరవై, ముప్పై వేల నష్టం కలిగి ఉండవచ్చు. అదే సమయంలో వీరికి రెండేళ్ల రిటైర్‌మెంట్‌ వయసు పెంచడం వల్ల ఇరవై లక్షల నుంచి పాతిక లక్షల ప్రయోజనం కలుగుతుంది. దీని గురించి ఆలోచించరా!

ఇప్పుడు రిటైరయ్యే ఉద్యోగులు తప్ప మిగిలినవారు తాము ప్రమోషన్లు కోల్పోతామని బాధ పడుతున్నారని కొందరు చెబుతున్నారు. రెండేళ్ల తర్వాతైనా ప్రమోషన్లు వస్తాయి కదా! అదే సమయంలో లక్షల రూపాయల అద నపు జీతం లభిస్తుంది కదా! కొందరు ఎన్జీవో నేతలు మరికొద్ది నెలల్లో రిటైర్‌ కావాల్సి ఉంది. వారు ప్రభుత్వం ఇచ్చిన రెండేళ్ల పొడిగింపును వాడుకోకుండా వదిలేస్తారా? 

ముఖ్యమంత్రి జగన్‌ ఉద్యోగుల పట్ల అభిమానంతో ఇరవై శాతం తాత్కాలిక భృతిని ఇరవై ఏడు శాతం చేశారు. గతంలో మాదిరి కాకుండా ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు వారి పని వారు చేసుకుని టైమ్‌ ప్రకారం ఇళ్లకు వెళ్లిపోవచ్చు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత పనిభారం తగ్గింది. టీడీపీ ప్రభుత్వ కాలంలో జన్మభూమి, ఇతర కార్యక్రమాల పేరుతో ఒక టైమ్‌ లేకుండా ఉద్యోగులను ఇబ్బంది పెట్టిన విషయాలను కొందరు గుర్తు చేస్తున్నారు.

సమ్మెకు వెళితే మీ సంగతి చూడవలసి వస్తుందని కూడా అప్పటి ప్రభుత్వ పెద్దలు హెచ్చరించిన ఘట్టాలు ఉన్నాయి. చంద్రబాబు ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు రాసిన ‘మనసులో మాట’ పుస్త కంలో లక్ష మంది ఉద్యోగులు అదనంగా ఉన్నారనీ, వారిని ప్రూన్‌ చేయాలనీ రాసిన విషయాన్ని తెలంగాణ మంత్రి హరీష్‌ రావు అసెంబ్లీలో చదివి వినిపించారు. 

చంద్రబాబు యాభైకి పైగా ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేశారు. పైగా అది గొప్ప సంస్కరణగా ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా మాట్లాడు తుండవచ్చు. ఇక తెలుగుదేశానికి మద్దతిచ్చే మీడియా వీలైనంతగా ఉద్యోగులను రెచ్చగొడుతోంది. ఇవే పత్రికలు తమ సంపాదకీయాలలో ఉద్యోగ వ్యయం తగ్గించాలని రాసిన విషయం మర్చిపోకూడదు. అప్పుడు చంద్రబాబు నాయుడు కార్మిక సంఘాలను రద్దు చేస్తామని హెచ్చరిం చినా, ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేస్తామని అన్నా  ఆయనలోని సంస్కరణలు ఈ పత్రికలకు కనిపించేవి. ఇప్పుడు జీతాలు పెరుగుతున్నా, పెద్ద సంఖ్యలో ఉద్యో గాలు ఇచ్చినా ఈ ప్రభుత్వాన్ని ఉద్యోగ వ్యతిరేక ప్రభు త్వంగా చిత్రీకరించే యత్నం చేస్తున్నాయి. 

కరోనా కాలంలో ఆర్థిక పరిస్థితి క్షీణించింది. సుమారు ముప్పైవేల కోట్ల ఆదాయం తగ్గిందనీ, అయినా ఉద్యోగు లకు ఇరవై శాతం జీతాలు పెరుగుతున్నాయనీ అధికారులు చెబుతున్నారు. ఈ నెలలో కొత్త  జీతాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత తమకు జీతాలు ఇంకా  పెంచాలని అడిగితే బాగుంటుంది. అదే సమ యంలో సంక్షేమ కార్యక్రమాలను అప్పు చేసి అమలు చేయడం లేదా అని ప్రశ్నించవచ్చు. రెక్కాడితే గానీ డొక్కా డని బడుగు జీవులతో వీరిని పోల్చరాదు. కరోనాలో ఉపాధి కోల్పోయి, నానా తంటాలు పడుతున్న పేదలకు ప్రభుత్వ స్కీములు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నది వాస్తవం.

గ్రామ, సచివాలయ వ్యవస్థల ద్వారా లక్షన్నర మందికి జగన్‌ ఉపాధి కల్పించారు. వారికి కూడా స్కేల్‌ వర్తింపజేయవలసి ఉంది. ఆ వ్యయాన్ని కూడా పరిగణన లోకి తీసుకోవాలి. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా జీతాలు పెంచారు. ఉద్యోగులకు పెరిగిన జీతాల వల్ల 10,700 కోట్ల అదనపు భారం పడనుండగా, అవుట్‌ సోర్సింగ్‌ వారికి వేతనాలు పెంచడంతో మరో 780 కోట్ల అదనపు వ్యయం అవుతుందని లెక్కగట్టారు.

ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూసేవారికి ఉద్యోగులు సహకరిస్తే అంతిమంగా వీరికే నష్టం జరుగుతుంది. వీటన్నిటి గురించి, ప్రస్తుత పరిస్థితుల గురించి కూడా ఉద్యోగులు ఆలోచించాలి. తెలుగుదేశం, బీజేపీ, వామపక్షాలు డబుల్‌ గేమ్‌ ఆడుతూ ఉద్యోగులకు మద్దతు ఇస్తున్నట్లు నటించ వచ్చు. కానీ ఉద్యోగులు భ్రమలలోకి వెళ్లకుండా ఉండాలి. అంతిమంగా ఒక మాట చెప్పాలి. లక్ష ఉద్యోగాలు తొలగిం చాలని చెప్పినవారికి మద్దతు ఇస్తారా? లక్ష ఉద్యోగాలు ఇచ్చినవారికి మద్దతు ఇస్తారా అన్నది ఉద్యోగ సంఘాలు తేల్చుకోవాలి.

-కొమ్మినేని శ్రీనివాసరావు
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement