నవ భారత ప్రణాళిక | Every state in India is like a unique nation in its own way. | Sakshi
Sakshi News home page

నవ భారత ప్రణాళిక

Mar 11 2025 3:49 AM | Updated on Mar 11 2025 3:54 AM

Every state in India is like a unique nation in its own way.

ఒక సమాఖ్య దేశంగా భారత్‌ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశంలోని భిన్నత్వాలన్నింటినీ కలిపి ఉంచే లక్ష్యంతో ఏర్పాటు చేసు కున్న రాజ్యాంగానికి పెను సవాలు ఎదురవు తోంది. భిన్న జాతులు, సంస్కృతులు, భాషల సమ్మేళనంతో కూడిన భిన్నత్వమే దీని ప్రత్యేకత. జనాభా కూర్పు కూడా ఈ దేశం హిందీ భాష, హిందుత్వ భావజాలంతోనిండి పోయేందుకు అవకాశం కల్పించదు.

విద్యను రాష్ట్ర జాబితాలో చేర్చాలి!
ఈ దేశంలో ప్రతి రాష్ట్రమూ తనదైన రీతిలో ఒక ప్రత్యేక జాతి లాంటిది. అందుకే రాజకీయ, ఆర్థిక విషయాల్లో వీటి మధ్య సమ తౌల్యతను కాపాడాల్సిన అవసరముంది. 2026లో ప్రభుత్వం ప్రారంభించ తలపెట్టిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పార్లమెంటులో కొన్ని రాష్ట్రాల శక్తిని తగ్గించేదిగా ఉంటుంది. జనాభా నియంత్రణ ద్వారా ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను ఇచ్చేందుకు ఆ రాష్ట్రాలు చేసిన కృషికి లభించనున్న ప్రతిఫలమా ఇది!

జనాభా నియంత్రణలో మంచి ఫలితాలు సాధించని రాష్ట్రాలకు మరిన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలను సృష్టించటం ద్వారా ప్రోత్సాహ కాలు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్క విషయమైతే స్పష్టం చేయాలి. ఈ పునర్విభజన ప్రకియను తక్షణం నిలిపివేయాలి. ప్రస్తుతం ఉన్న పార్లమెంటరీ నియోజకవర్గాలను మార్చడంపై శాశ్వత నిషేధం విధించాలి.ఇది సాంకేతిక పరిజ్ఞాన యుగం. నాణ్యమైన విద్య ఉన్న వారే సామాజిక ఫలాలను నిర్ణయిస్తారు. నియంత్రణ మొత్తం కేంద్రం చేతుల్లో ఉన్నప్పటికీ ఉన్నత విద్యారంగం ఇప్పటివరకూ ఆశించిన ఫలితాలనైతే ఇవ్వలేదు. 

ఉన్నత విద్య నాణ్యత కూడా ఆశించిన ప్రమాణాల మేరకు లేదు. కాబట్టి విద్య మొత్తాన్ని రాష్ట్రాల జాబి తాలోకి చేర్చడం మంచిది. రాష్ట్రాలపై ఏఐసీటీఈ (ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌), యూజీసీ (యూనివర్సిటీగ్రాంట్స్‌ కమిషన్‌) వంటి సంస్థల పెత్తనానికి ఫుల్‌స్టాప్‌ పడాలి. దేశానికి నాణ్యమైన ఆధునిక వైద్య, న్యాయ, సామాజిక శాస్త్రాల విద్య అవసరం. నాణ్యమైన విద్యను అందించే విషయంలో రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడేలా చేయాలి కానీ, పరిపాలన పేరిటకేంద్రం పెత్తనం చలాయించ కూడదు.

పన్నుల వాటా 66 శాతానికి చేరాలి!
రాష్ట్రాలు ఆర్థికంగా స్వావలంబన, స్వతంత్రత సాధించినప్పుడే సమాఖ్య స్ఫూర్తి వర్ధిల్లుతుంది. ఆర్థిక వనరుల విషయంలో రాష్ట్రాలకు మరిన్ని మార్గాలు అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం ఫైనాన్స్‌ కమిషన్  సిఫారసుల మేరకు రాష్ట్రాలకు పన్నుల ఆదాయంలో 42 శాతం మాత్రమే లభిస్తోంది. పైగా ఇటీవలి కాలంలో కేంద్రం వద్దనే వనరులను కేంద్రీకరించే ధోరణి కనపడుతోంది. ఈ పరిస్థితి మారాలి. రాష్ట్రాలకు దక్కాల్సిన పన్నుల వాటా క్రమేపీ 66 శాతానికి చేరాలి. కేటాయింపులు కూడా జనాభా, తీసుకొచ్చిన ఆదాయం, సగటు కంటే ఎంత ఎక్కువ ఉంది అనే అంశాలతో కూడిన సూచీ ఆధారంగా జరగాలి. 

రాష్ట్రాలకు అందాల్సిన మొత్తాల విడుదలల్లోనూ అనవసరమైన జాప్యాన్ని చూస్తున్నాం. రాష్ట్రాల ఆదాయాలను కేంద్ర పథకాలకు ఉపయోగిస్తున్నారు. రాష్ట్రాలు తమ ప్రణాళికలు, హామీ లను నెరవేర్చుకునేందుకు వీలుగా ఆదాయం ఎక్కడికక్కడ పంపిణీ జరిగేలా ఒక వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉంది. కేంద్రం ద్వారా నిధుల విడుదలల్లో ఆలస్యం జరిగితే ఆర్‌బీఐ ప్రైమ్‌ లెండింగ్‌ రేట్లతో రాష్ట్రాలకు వడ్డీ చేర్చి ఇవ్వాలి. 

దేశాద్యంతం చరిత్ర, సంస్కృతులు ఒక్క తీరున లేవు. ప్రతి ప్రాంతంలోనూ తనదైన ప్రత్యేకత కలిగిన చారిత్రక, సాంస్కృతికకేంద్రాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వపు ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ) వీటి నిర్వహణ, సంరక్షణల్లో ఘోరంగా విఫల మైంది. 

ఆకతాయిలు పలు స్మారకాలను ధ్వంసం చేశారు. అన్ని రాష్ట్రాల్లో, ప్రాంతాల్లోనూ ప్రత్యేకమైన సంస్కృతి, చరిత్ర ఉన్న నేపథ్యంలో వాటి సంరక్షణ, నిర్వహణ బాధ్యతలు ఆయా రాష్ట్రాలకే అప్పగించాలి. ఆయా వనరులపై కేంద్రం పెత్తనం చలాయించకుండా వెంటనే రాష్ట్రాలకు బదలాయించాలి. సంకుచిత సైద్ధాంతిక భావ జాలం కారణంగా ఏఎస్‌ఐ, కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టే ధోరణి కనిపిస్తోంది. 

సహజ వనరులపై హక్కు
రైతుల నుంచి సేకరించే పంటలకు మద్దతు ధర ఇవ్వడం ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు, ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉంది. ఈ సేకరణ ఒక రకమైన సబ్సిడీనే కాబట్టి... ఆయా నిధులను వ్యవసాయ భూమి విస్తీర్ణం ఆధారంగా రాష్ట్రాలకే కేటాయించాలి. దేశాద్యంతం పండే పంటల్లో ధాన్యమే ఎక్కువ కాబట్టి అన్ని రాష్ట్రాల్లోనూ ధాన్యం సేకరణకు కనీస మద్దతు ధర అందించాలి. ఒకవేళ అన్ని రాష్ట్రాలకూ ఈ పద్ధతి అనువుగా ఉండదనుకుంటే... ఆయా రాష్ట్రాలకు గ్రాంట్ల రూపంలో నష్టపరిహారాన్నైనా అందించాలి.

వాయు కాలుష్యంలో శిలాజ ఇంధనాల వాటా దాదాపు 20 శాతం. చౌక ప్లాస్టిక్‌ విచ్చలవిడి వినియోగం (ప్యాకేజింగ్, ఒకసారి వాడి పారేయడం) వల్ల జల వనరులకు తీవ్ర నష్టం జరుగుతోంది. దీన్ని అరికట్టేందుకు వాడి పారేసే ప్లాస్టిక్‌ తయారీకి ఉపయోగించే ముడి సరుకులపై సుంకాలు విధించాలి. విద్యుత్తుతో, హైడ్రోజెన్  ఫ్యూయెల్‌ సెల్స్‌తో నడిచే వ్యక్తిగత, రవాణా వాహనాల వాడకాన్ని ప్రోత్సహించాలి. 

వీటిపై పన్నులు ఎత్తివేయడం, వాడుతున్నందుకు ప్రోత్సాహకాలు అందించడం చేయాలి. గంగా పరీవాహక ప్రాంతాన్ని మినహా మిగిలిన చోట్ల బొగ్గు, ఇనుము, అల్యూమినియం, రాగి,జింక్, నికెల్‌ వంటి ఖనిజ నిక్షేపాలు బోలెడున్నాయి. ఈ ప్రకృతి వనరులపై సహజంగానే ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రజలకు హక్కు ఉంటుంది. కాబట్టి ఖనిజాన్వేషణ, వెలికితీత హక్కులు, ఆదాయం కూడా ఆయా రాష్ట్రాలకే చెందాలి.

ఆర్మీలో కొన్ని ప్రాంతాలకేనా అవకాశం?
సాయుధ దళాలు, పారామిలిటరీ దళాల్లో నియామకాలు కొన్ని ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. దేశంలోనే అతి పురాతనమైన పదాతిదళ రెజిమెంట్‌... మద్రాస్‌ రెజిమెంట్‌. నీలగిరి కొండల్లోని వెల్లింగ్టన్‌లో దీని ప్రధాన కేంద్రం ఉంది. దీంట్లో మొత్తం 29 బెటా లియన్లు ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలు మొత్తం అంటే సుమారు 27 కోట్లు లేదా దేశ జనాభాలో 22 శాతం మంది దీని పరిధిలోకి వస్తారు. మరోవైపు సిఖ్‌ రెజిమెంట్‌కు నియామకాలు 80 లక్షల జనాభానుంచి జరుగుతూంటాయి. 

ఈ రెజిమెంట్‌లో 24 పదాతిదళ బెటాలి యన్లున్నాయి. పంజాబ్‌ కేంద్రంగా ఉండే అన్ని రెజిమెంట్స్‌ను కలుపు కొంటే మొత్తం 74 బెటాలియన్లు ఉన్నాయి. మూడు కోట్ల మందినుంచి ఈ నియామకాలు జరుగుతాయి. దేశ రక్షణ కోసం ఏర్పాటైన వ్యవస్థలో ఈ రకమైన ప్రాతినిధ్యం ఎంత వరకూ సబబు? గ్రామీణ ప్రాంత యువతకు మేలైన ఉద్యోగావకాశం కల్పించే మిలిటరీలో అన్ని ప్రాంతాలకూ తగిన ప్రాతినిధ్యం కల్పించాలి. 

పెట్టుబడులు ఎక్కువ అవసరమయ్యే ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాలు రెండూ కేంద్రం నియంత్రణలోనే ఉండటంతో పాటు ఈ రంగంలోకి అడుగుపెట్టడం పెద్ద వ్యాపారవేత్తలకే సాధ్యమయ్యే పరిస్థితి. జనాభాలో ఎక్కువమందికి చేరువ కాగల అవకాశమున్న రేడియోపై కూడా పెత్తనం కేంద్రానిదే. ఇలా కాకుండా ఎఫ్‌ఎంబ్యాండ్లపై రేడియో ఛానళ్లు ఏర్పాటు చేసే అవకాశాన్ని స్థానికులకు కల్పించాలి. ప్రైవేట్, ప్రభుత్వ ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాలు పని చేస్తున్నప్పుడు... సమాచారం కోసం అత్యధికులు ఆధారపడే రేడియో ప్రైవేటు, రాష్ట్ర ప్రభుత్వ వనరులతో ఎందుకు నడవకూడదు? 

భారతదేశ ఏకత్వం అందరికీ సముచిత గౌరవమన్న దానిపై ఆధారపడి ఉండాలి. రాజకీయ భేదాలు ఎలా ఉన్నప్పటికీ రాష్ట్రాల న్నిటినీ భారత రాజ్యాంగం ఒక్కటిగా ఉంచుతోంది. అందరూ తమ గొంతు వినిపించేందుకు అవకాశం లభిస్తోంది. ఒక కేంద్రీకృత వ్యవస్థగా, ఏకస్వామ్యంగా మార్చేందుకు చేసే ఏ ప్రయత్నమైనా... అసలు ఉద్దేశాన్ని, సమాఖ్యను ముక్కలు చేస్తుంది.

» కొన్ని రాష్ట్రాల శక్తిని తగ్గించేదిగా ఉన్న పునర్విభజన ప్రకియను నిలిపివేయాలి. ప్రస్తుత పార్లమెంటరీ నియోజక వర్గాలను మార్చడంపై శాశ్వత నిషేధం విధించాలి.
» ప్రస్తుతం రాష్ట్రాలకు పన్నుల ఆదాయంలో 42 శాతం మాత్రమే లభిస్తోంది. ఈ పరిస్థితి మారాలి. వాటా క్రమేపీ 66 శాతానికి చేరాలి.
» విద్య మొత్తాన్ని రాష్ట్రాల జాబితాలోకి చేర్చడం మంచిది. రాష్ట్రాలపై ఏఐసీటీఈ, యూజీసీ వంటి సంస్థల పెత్తనానికి ఫుల్‌స్టాప్‌ పడాలి.

- వ్యాసకర్త ఫ్రీలాన్స్‌ కామెంటేటర్, రచయిత
mohanguru@gmail.com
-మోహన్  గురుస్వామి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement