
అపారమైన మంచు నిల్వలకు గ్రీన్‌లాండ్ ఆలవాలం. ప్రపంచంలోని మొత్తం మంచినీటిలో 8 శాతం అక్కడే ఉందని అంచనా. అలాంటి గ్రీన్‌లాండ్‌లో మంచు శరవేగంగా కరిగిపోతోంది. ఎంతగా అంటే ఏటా సగటున 5,500 కోట్ల టన్నుల మేరకు! 1992లో మొదలైన ఈ ధోరణి ఏటా అంతకంతకూ పెరుగుతూనే వస్తోందట. ఆ లెక్కన గత 28 ఏళ్లలో అక్కడ ఏకంగా 5 లక్షల టన్నుల మంచు మాయమైపోయిందట!
గ్రీన్‌లాండ్‌పై గ్లోబల్ వార్మింగ్ ప్రభావంపై చేపట్టిన అధ్యయనంలో సైంటిస్టులు ఈ మేరకు తేల్చారు. ఇది ఒక్క గ్రీన్‌లాండ్‌కే పరిమితం కాదని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌ఓఏఏ) తెలిపింది. ‘‘మొత్తమ్మీద ధ్రువాల వద్ద మంచు కరుగుదల ప్రమాదకర స్థాయిలో ఉంది. ఇది చాలా ఆందోళనకర పరిణామం’’అని ఆందోళన వెలిబుచి్చంది. అక్కడ మంచు ఈ స్థాయిలో కరిగిపోవడానికి నిర్దిష్ట కారణాలేమిటో తేల్చే పనిలో పడింది.
అక్కడినుంచి ఆవిరవుతున్న నీరు ఎటు వెళ్తోందో తెలియడం లేదని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మిస్టరీని ఛేదించేందుకు అక్కడి నీటి ఆవిరిని డ్రోన్ల సాయంతో సేకరించి పరిశోధిస్తున్నారు. ఇందుకోసం భూ ఉపరితలం నుంచి 5,000 అడుగుల ఎత్తు దాకా వివిధ స్థాయిల్లో నీటి ఆవిరిని పలు దఫాలుగా సేకరించారు. ‘‘ఆవిరయ్యే నీటిలో ఎంతోకొంత తిరిగి మంచుగా మారి అక్కడే పడుతుంది. కానీ చాలావరకు మాత్రం గ్రీన్‌లాండ్ జలవ్యవస్థకు శాశ్వతంగా దూరంగా వెళ్లిపోతోంది. ఇదే ఆందోళన కలిగించే విషయం’’అని అధ్యయనానికి సారథ్యం వహించిన కెవిన్ రోజి్మయారెక్ వివరించారు.
– సాక్షి, నేషనల్ డెస్క్