
బాగ్లిహార్, కిషన్ గంగ, సలాల్ ప్రాజెక్టుల నుంచి నీటి నిలిపివేత
నిలిచిపోయిన ఆరు ప్రాజెక్ట్‌ల నిర్మాణ పనుల పునరుద్ధరణ
సింధూ, దాని పరీవాహక నదుల నుంచి పాకిస్తాన్‌కు ఇకపై చుక్క నీరు కూడా వదిలేది లేదన్న భారత్, ఆ దిశగా పూర్తిస్థాయి కార్యాచరణకు రంగంలోకి దిగింది. ఆ నదులపై అన్ని జలాశయాల సామర్థ్యాలను పూర్తిస్థాయిలో పెంచే దిశగా చర్యలు తీసుకుంటోంది. వాటిలో పేరుకుపోయిన మట్టి, ఇసుక తదితరాలను పూర్తిగా తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. తద్వారా అన్ని ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వ సామర్థ్యం గరిష్ట స్థాయికి చేరేలా చూడాలని అధికారులకు సూచించింది.
జమ్మూ కశ్మీర్‌లో చినాబ్ నదిపై ఉన్న కీలక బాగ్లిహార్, సలాల్ జల విద్యుత్కేంద్రాల్లో ఆ దిశగా గురువారం లాంఛనంగా మొదలైన పూడికతీత పనులు సోమవారం పూర్తిస్థాయికి చేరాయి. పనుల్లో భాగంగా రెండు డ్యాముల్లో అవసరమైన గేట్లను గురువారం నుంచి శనివారం దాకా పాక్షికంగా ఎత్తడంతో పాక్‌లోని సరిహద్దు ప్రాంతాలు నీటమునిగాయి. సింధూ జల ఒప్పందం నిలిపివేత నేపథ్యంలో ఈ విషయమై పాక్‌కు ముందస్తు సమాచారం ఇవ్వలేదు.
1960ల్లో ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇలా జరగడం ఇదే తొలిసారి. ఒప్పందాన్ని బూచిగా చూపుతూ పూడిక పనులను పాక్ ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వచ్చింది. ఇప్పుడిక ఆ ప్రాజెక్టుల్లోని పూడిక మొత్తాన్నీ తొలగించి పూర్తిస్థాయిలో నీటిని నింపనున్నారు. అప్పటిదాకా చినాబ్ నదీజలాలు పాక్‌కు పూర్తిగా నిలిచిపోయినట్టే!. సింధూ ఒప్పందం ప్రకారం చినాబ్ జలాలు పాక్‌కే చెందుతాయి. వాటి ప్రవాహాన్ని భారత్ అడ్డుకోవడానికి వీల్లేదు.
మూడింటి నుంచి నీళ్లు బంద్
జమ్మూ కశ్మీర్‌లో సింధూ, దాని పరీవాహక నదులపై ఆరుకు పైగా జలాశయాల్లో పూడికతీతను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్న ఆదేశాల నేపథ్యంలో స్థానిక ప్రభుత్వ విభాగాలు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాయి. ప్రభుత్వరంగ ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్ సారథ్యంలో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. బాగ్లిహార్, సలాల్‌తో పాటు జీలం నది మీది కిషన్‌గంగ జలాశయాల నుంచి పాక్‌కు నీటి విడుదలను ఆదివారం నుంచి నిలిపేశారు.
దాంతో పాక్‌లోని పంజాబ్ తదితర ప్రాంతాలకు సాగునీరు నిలిచిపోయింది. సలాల్ ప్రాజెక్టును 1987లో, బాగ్లిహార్‌ను 2008లో నిర్మించారు. అప్పటినుంచీ వాటిలో పూడికతీత చేపట్టడం ఇదే తొలిసారి. సలాల్ 690 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. బాగ్లీహార్ సామర్థ్యం 900 మెగావాట్లు. పూడిక నేపథ్యంలో వాటిలో విద్యుదుత్పాదన చాలాకాలంగా సామర్థ్యం కంటే తక్కువగా జరుగుతూ వస్తోంది.
10 వేల మెగావాట్ల విద్యుత్
జమ్మూ కశ్మీర్‌లో సింధూ, ఉప నదులపై మొదలు పెట్టిన ఆరు ప్రాజెక్టులు పాక్ అభ్యంతరాల నేపథ్యంలో చాన్నాళ్లుగా నిలిచిపోయాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో వాటి నిర్మాణాన్ని తక్షణం పునఃప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. సవాల్‌కోట్ (1,856 మెగావాట్లు), కిర్తాయ్ 1, 2 (1,320 ఎంవీ), పాకాల్‌దుల్ (1,000 ఎంవీ)తో పాటు 2,224 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన మరో ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి.
ఇవన్నీ పూర్తయితే ఏకంగా 10 వేల మెగావాట్ల అదనపు విద్యుత్‌తో పాటు సాగు, తాగునీటి అవసరాలకు మరిన్ని జలవనరులు అందుబాటులోకి వస్తాయి. సింధూ ఒప్పందం కింద ఇలాంటి పనులకు పాక్‌కు ఆర్నెల్ల నోటీసు ఇవ్వాల్సి ఉండేది. దాన్ని నిలిపివేసిన నేపథ్యంలో భారత్ తాజా చర్యలను అడ్డుకునేందుకు పాక్‌కు పెద్దగా మార్గాలేమీ లేవు. మధ్యవర్తి అయిన ప్రపంచబ్యాంకు కూడా పెద్దగా చేసేదేమీ లేదు. ఇరు దేశాలనూ చర్చలకు ప్రోత్సహించడం తప్ప ఒప్పందం అమలుకు ఆదేశించడం వంటి అధికారాలేవీ దానికి లేవు.
– సాక్షి, నేషనల్ డెస్క్