బాంబులు, తూటాల నడుమ... శాంతి చర్చలు సాగవు: ప్రధాని మోదీ | India Modi meets Putin in Russia | Sakshi
Sakshi News home page

బాంబులు, తూటాల నడుమ... శాంతి చర్చలు సాగవు: ప్రధాని మోదీ

Jul 10 2024 2:02 AM | Updated on Jul 10 2024 5:20 AM

India Modi meets Putin in Russia

పుతిన్‌కు మోదీ స్పష్టీకరణ 

ఉక్రెయిన్‌ యుద్ధంపై చర్చలు

మాస్కో: బాంబులు, తుపాకులు, తూటాల వర్షం నడుమ శాంతి చర్చలు ఎప్పటికీ ఫలప్రదం కాబోవని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌ సమస్యకు పరిష్కారం ఎప్పటికైనా చర్చలతోనే లభిస్తుంది తప్ప యుద్ధ క్షేత్రంలో కాదని కుండబద్దలు కొట్టారు. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో పిల్లల ఆస్పత్రిపై జరిగిన క్షిపణి దాడిపై తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. రెండు రోజుల రష్యా పర్యటనలో భాగంగా మంగళవారం ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో క్రెమ్లిన్‌ భవనంలో మోదీ 22వ ఇండో–రష్యా శిఖరాగ్ర చర్చలు జరిపారు. ముక్కుపచ్చలారని అమాయక చిన్నారులు దాడిలో పదుల సంఖ్యలో బలైన వైనం హృదయాలను తీవ్రంగా కలచివేస్తోందంటూ ఆవేదన వెలిబుచ్చారు.

చర్చల వివరాలను మీడియాతో పంచుకుంటూ విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్‌ క్వాట్రా ఈ మేరకు వెల్లడించారు.  పుతిన్, మోదీ గాఢాలింగనంపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్ర అభ్యంతరం వెలిబుచి్చన నేపథ్యంలో ప్రధాని తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సోమవారం పుతిన్‌తో వ్యక్తిగత సంభాషణ సందర్భంగా ఉక్రెయిన్‌ యుద్ధంపై లోతుగా చర్చించినట్టు మోదీ వెల్లడించారు. ‘‘సమస్యకు చర్చల ద్వారానే ముగింపు పలకాలన్నదే భారత వైఖరి. ఈ విషయాన్ని అంతర్జాతీయ సమాజానికి స్పష్టం చేయదలచా. అందుకు అన్నివిధాలా సాయపడేందుకు భారత్‌ ఎప్పుడూ సిద్ధమే. నేను చెప్పిన అన్ని విషయాలనూ పుతిన్‌ ఓపిగ్గా విన్నారు.

ఉక్రెయిన్‌ సమస్యపై అభిప్రాయాలను పంచుకున్నారు. యుద్ధానికి తెర దించేందుకు ఆసక్తికరమైన మార్గాలు చర్చ సందర్భంగా తెరపైకొచ్చాయి’’ అని ప్రధాని వివరించారు. భారత్‌ను పట్టి పీడిస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని కూడా ప్రస్తావించారు. ఉక్రెయిన్‌ సంక్షోభ నివారణకు మోదీ చేస్తున్న ప్రయత్నాలకు పుతిన్‌ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపినట్టు టాస్‌ వార్తా సంస్థ పేర్కొంది. అన్ని అంశాలపైనా మోదీ, తాను మనసు విప్పి మాట్లాడుకున్నట్టు పుతిన్‌ వెల్లడించారు.

అనంతరం ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ నేతలిద్దరూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మాస్కో సిటీ హాల్‌పై, కశీ్మర్‌లో సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదుల ప్రాణాంతక దాడిని తీవ్రంగా నిరసించారు. ఉగ్రవాదంపై పోరులో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని ఇవి గుర్తు చేశాయన్నారు. ఉక్రెయిన్‌ సమస్య పరిష్కారానికి మోదీ చేసిన శాంతి ప్రతిపాదనలతో నాటో కూటమి ఏకీభవించకపోవచ్చని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ అన్నారు.

ద్వైపాక్షిక బంధం మరింత సుదృఢం
కొన్నేళ్లుగా ప్రపంచాన్ని వేధిస్తున్న ఆహార, ఇంధన, ఎరువుల కొరత భారత్‌లో రైతులకు ఎదురవకుండా రష్యా అందిస్తున్న సహకారం అమూల్యమంటూ మోదీ కొనియాడారు. ‘‘పుతిన్‌తో చర్చలు అత్యంత ఫలప్రదంగా సాగాయి. వర్తకం, వాణిజ్యం, భద్రత, వ్యసాయం, టెక్నాలజీ వంటి పలు రంగాలపై లోతుగా చర్చించాం. పలు రంగాల్లో రష్యాతో బంధాన్ని మరింతగా విస్తరించడమే మా లక్ష్యం’’ అని స్పష్టం చేశారు. ఐరాసతో పాటు పలు అంతర్జాతీయ వేదికలపై పలు అంశాల్లో భారత్, రష్యా సన్నిహితంగా కలిసి పని చేస్తున్నాయని పుతిన్‌ అన్నారు.

‘‘ఇరు దేశాలదీ దశాబ్దాలకు పైబడ్డ సుదృఢమైన బంధం. భారత్‌తో రష్యా వర్తకం గతేడాది ఏకంగా 66 శాతం పెరిగింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే మరో 20 శాతం పెరుగుదల నమోదైంది’’ అని అన్నారు. అక్టోబర్లో రష్యాలోని కజాన్‌లో జరగనున్న బ్రిక్స్‌ శిఖరాగ్రానికి మోదీని ఈ సందర్భంగా పుతిన్‌ ఆహా్వనించారు. అనంతరం మోదీ రష్యా పర్యటన ముగించుకుని ఆస్ట్రియా రాజధాని వియన్నా చేరుకున్నారు. భారత ప్రధాని ఆ దేశంలో పర్యటించనుండటం 41 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.

రష్యా సైన్యంలోని భారతీయులకు విముక్తి!
ఉక్రెయిన్‌ కదనరంగంలో రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను స్వదేశానికి పంపేందుకు రష్యా అంగీకరించింది. పుతిన్‌ వద్ద ఈ అంశాన్ని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారని సబంధిత వర్గాలు వెల్లడించాయి. యుద్ధంలో పని చేస్తున్న భారతీయులను క్షేమంగా స్వదేశానికి పంపిస్తామని పుతిన్‌ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రష్యాలో ఉపాధి కల్పిస్తామంటూ కొందరు భారతీయ యువకులను ఏజెంట్లు రష్యాకు తీసుకెళ్లి అక్కడి సైన్యం సహాయకులుగా నియమించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement