వసూళ్లు ఫుల్‌.. వసతులు నిల్‌ | - | Sakshi
Sakshi News home page

వసూళ్లు ఫుల్‌.. వసతులు నిల్‌

Published Wed, Apr 2 2025 7:34 AM | Last Updated on Wed, Apr 2 2025 7:34 AM

వసూళ్లు ఫుల్‌.. వసతులు నిల్‌

వసూళ్లు ఫుల్‌.. వసతులు నిల్‌

మెదక్‌జోన్‌: తైబజార్‌ పేరుతో జోరుగా వసూళ్ల దందా సాగుతోంది. వారాంతపు సంతల్లో ఉత్పత్తులను విక్రయించేందుకు వెళితే రూ.50 నుంచి రూ.100 వరకు చెల్లిస్తేనే అనుమతిస్తున్నారు. జిల్లాలోని ఒక్కో వారాంతపు సంత వేలం పాట ద్వారా రూ. 2 లక్షల నుంచి మొదలుకొని రూ. 40 లక్షల వరకు పలుకుతోంది. టెండర్‌ దక్కించుకున్న గుత్తేదారు రెండింతలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. కానీ సంతల్లో వసతులు మాత్రం కల్పించడం లేదని విక్రయదారులు, ప్రజలు వాపోతున్నారు.

తైబజార్‌ వేలం రూ. 42 లక్షలు

మెదక్‌ జిల్లాలోని టేక్మాల్‌ మండల కేంద్రంలో ప్రతి శనివారం పశువులు, గొర్రెలు, మేకలతో పాటు కూరగాయల సంత కూడా నిర్వహిస్తారు. మేకలు, గొర్రెలు , పాడి గేదెలు, పశువులు కావాలన్నా టేక్మాల్‌ అంగడికి వెళ్లాలి. ఇటీవల ఇక్కడ నిర్వహించే పశువుల సంతకు రూ.12 లక్షలు, కూరగాయల సంతకు(తైబజార్‌)రూ.10 లక్షల వేలం పాట ద్వారా ఆదాయం వచ్చింది. త్వరలో మేకలు, గొర్రెల సంతలను సైతం వేలం వేయనున్నారు. వాటికి మరో రూ. 20 లక్షల పైచిలుకు ఆదాయం వేలం ద్వారా రానుంది. మొత్తం రూ.42 లక్షల ఆదాయం ఈ సంతకు వచ్చే అవకాశం ఉంది. కానీ సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. తాగునీటిని రెండు చోట్ల ఏర్పాటు చేసినా ఎవరికి సరిపోవడం లేదు. అలాగే మూత్రశాలలు ఉన్నా, నిర్వహణ లోపభూయిష్టంగా ఉంది. మరుగుదొడ్లు అసలే లేవు. లక్షల ఆదాయం వస్తున్నా సౌకర్యాల కల్పనను మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు మండి పడుతున్నారు.

మెదక్‌ జిల్లాలో 21 మండలాలతో పాటు నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో 120 పైచిలుకు వారాంతపు సంతలు నిర్వహిస్తుండగా.. కనీసం మూత్రశాలలు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు లేవు. వర్షంలో తడుస్తూ, ఎండలో ఎండుతూ, చలిలో వణకాల్సిందే. సంత నిర్వహణకు స్థలం కూడా లేక రోడ్లపైనే నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించే సంతల్లో 110 పై చిలుకు కూరగాయల విక్రయాలు జరుగుతుంటే, మరో 10 సంతల్లో మాత్రం పశువులు, మేకల విక్రయాలు జరుగుతున్నాయి.

కనీస సౌకర్యాలు లేవు..

కొల్చారం మండలం రంగపేట తైబజార్‌ వేలంను ఇటీవల నిర్వహించగా రూ. 2 లక్షల ఆదాయం వచ్చింది. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో తైబజార్‌ను రూ. 10 లక్షలకు వేలం పాటలో పాడారు. మండలంలోని గవ్వలపల్లిలో రూ. 3 లక్షలు, నిజాంపేట, హవేళిఘణాపూర్‌తో పాటు మెదక్‌, నర్సాపూర్‌, తూప్రాన్‌, రామాయంపేట, మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున సంతలు జరుగుతున్నాయి. మెదక్‌ జిల్లా కేంద్రంలో రెతు బజార్‌ను రూ. 6 కోట్ల పైచిలుకు నిధులు కేటాయించినా అర్ధంతరంగా ఆగిపోయింది. ఫలితంగా రోడ్లపైనే కూర్చొని కూరగాయలు విక్రయిస్తుండటంతో పెద్ద బజారుకు వెళ్లేవారు ట్రాఫిక్‌ జామ్‌తో ఇబ్బందులు పడుతున్నారు. రామాయంపేట సంతలోనూ సౌకర్యాలు లేవు. ఇక్కడ వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ అర్ధంతరంగా ఆగిపోవటంతో రోడ్లపైనే సంత సాగుతోంది. ఇంచు మించు అన్ని మున్సిపాలిటీల్లో ఇదే తంతు జరుగుతోంది. కనీస సౌకర్యాలు లేక పోవటంతో ప్రజలు, విక్రయదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు, పాలకులు పట్టించుకొని వసతులు కల్పించాలని వారు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement