
ఆచార్య, ఆర్ఆర్ఆర్ లాంటి పెద్ద చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన ఉదయ్‌రాజ్ ‘మధురం’ మూవీతో హీరోగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి రాజేష్ చికిలే దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో వైష్ణవి సింగ్ హీరోయిన్‌గా నటించింది. శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై బంగార్రాజు నిర్మించారు. ఎ మెమొరబుల్ లవ్ ట్యాగ్ లైన్‌తో టీనేజ్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 18న శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో ఉదయ్ రాజ్ చిత్ర విశేషాలను పంచుకున్నారు.
హీరో ఉదయ్ రాజ్ మాట్లాడుూ..'చిన్నప్పట్నుంచీ చిరంజీవిపై ఇష్టం ఉండేది. ఆయన స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చాను. తర్వాత ఆచార్య షూటింగ్ టైమ్‌లో ఆయనతో మాట్లాడటం గొప్ప అనుభవం. 12 ఏళ్లగా ఇండస్ట్రీలో ఉన్నా. చాలా సినిమాల్లో బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా నటించాను. బంగార్రాజు సపోర్ట్‌తో మధురం చిత్రంలో హీరోగా చేశా. దర్శకుడు రాజేష్ చికిలేతో నాకు ఎప్పట్నుంచో పరిచయం ఉంది. ఆయన ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. నైంటీస్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ ఇది. పదవ తరగతి అమ్మాయి, తొమ్మిదో తరగతి అబ్బాయి మధ్య నడిచే ప్రేమకథ చాలా అందంగా ఉంటుంది. నేను చదువుకుంది జెడ్‌పీహెచ్ స్కూల్‌లోనే కావడంతో అప్పటి విశేషాలను గుర్తు చేసేలా ఈ చిత్రాన్ని రూపొందించాం. 90ల జనరేషన్‌కు పాత విషయాలను గుర్తుచేసేలా సినిమా ఉంటుంది. ఇందులో కథే హీరో అని భావిస్తారు' అని తెలిపారు.
అంతేకాకుడా..'హీరోయిన్‌గా తెలుగమ్మాయిని తీసుకోవాలనుకున్నా.. కొన్ని ప్రయత్నాలు చేశాం కానీ కుదరలేదు. అయితే వైష్ణవి సింగ్ మాత్రం చాలా బాగా చేసింది. మధు, రామ్‌ల ప్రేమాయణమే ఈ మధురం చిత్రం. దర్శకుడు రాజేష్ చికిలే ఈ కథను చాలా అందంగా తీర్చిదిద్దారు. టీజర్, ట్రైలర్ చూసిన వాళ్లు చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇవ్వడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమా విషయంలో చాలా మంది నాకు సపోర్ట్‌గా నిలిచారు. హీరోనే కాకుండా ఎలాంటి పాత్రలు చేయడానికికైనా నేను సిద్ధంగా ఉంటాను' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో బస్ స్టాప్ ఫేం కోటేశ్వర రావు, కిట్టయ్య, ఎఫ్ ఎం బాబాయ్, దివ్య శ్రీ, సమ్యు రెడ్డి, జబర్దస్త్ ఐశ్వర్య, ఉష, అప్పు, రామ్ కీలక పాత్రలు పోషించారు.