
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ చెలరేగిపోయాడు. ఇంగ్లండ్ డొమెస్టిక్ వన్డే కప్‌లో నార్తంప్టన్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న చహల్.. ఈ కౌంటీ తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. కెంట్‌తో ఇవాళ (ఆగస్ట్ 14) జరిగిన మ్యాచ్‌లో చహల్ ఈ ఘనత సాధించాడు. చహల్ మాయాజాలం ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన కెంట్ 35.1 ఓవర్లలో 82 పరుగులకు కుప్పకూలింది.
చహల్ 10 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఐదు మెయిడిన్ ఓవర్లు ఉండటం విశేషం. చహల్‌తో పాటు జస్టిన్ బ్రాడ్ (6.1-1-16-3), లూక్ ప్రోక్టర్ (10-2-25-2) కూడా రాణించడంతో కెంట్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఆ జట్టు తరఫున జేడెన్ డెన్లీ (22), ఏకాంశ్ సింగ్ (10), మ్యాట్ పార్కిన్సన్ (17 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
YUZI CHAHAL SHOW: 10-5-14-5. ⭐ pic.twitter.com/byxSVc404X
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 14, 2024
అనంతర 83 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నార్తంప్టన్‌షైర్ 14 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. పృథ్వీ షా 17 పరుగులు చేసి ఔట్ కాగా.. జేమ్స్ సేల్స్ 33, జార్జ్ బార్లెట్ 31 పరుగులతో అజేయంగా నిలిచారు. బేయర్స్ స్వేన్పోయెల్కు పృథ్వీ షా వికెట్ దక్కింది.
కాగా, చహల్ ఈ మ్యాచ్‌తో పాటు ఐదు కౌంటీ ఛాంపియన్షిప్ మ్యాచ్‌లు ఆడేందుకు నార్తంప్టన్‌షైర్‌తో ఒప్పందం చేసుకున్నాడు. నార్తంప్టన్‌షైర్ ఈ మ్యాచ్‌లో గెలిచినా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించలేదు. ఇంగ్లండ్ డొమెస్టిక్ వన్డే కప్‌లో గ్రూప్ దశ మ్యాచ్‌లు ఇవాల్టితో ముగుస్తాయి. ఆగస్ట్ 16న క్వార్టర్ ఫైనల్స్, 18న సెమీస్, సెప్టెంబర్ 22న ఫైనల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి.