
శ్రీలంకతో జరుగుతున్న మహిళల ముక్కోణపు వన్డే సిరీస్-2025లో భారత్ ఇవాళ (ఏప్రిల్ 29) సౌతాఫ్రికాతో తలపడుతుంది (కొలొంబో వేదికగా). ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ప్రతిక రావల్ (78) అర్ద సెంచరీతో.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (41), జెమీమా రోడ్రిగెజ్ (41), స్మృతి మంధన (36), హర్లీన్ డియోల్ (29), రిచా ఘోష్ (24) ఓ మోస్తరు స్కోర్లతో రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది.
భారత ఇన్నింగ్స్‌లో దీప్తి శర్మ (9) ఒక్కరే సింగిల్ డిజిట్ స్కోర్‌కు ఔట్ కాగా.. కశ్వీ గౌతమ్ 5 పరుగులతో అజేయంగా నిలిచింది. సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా 2, ఖాకాచ, క్లాస్, డి క్లెర్క్, డెర్క్‌సెన్ తలో వికెట్ పడగొట్టారు.
కాగా, ఈ ట్రై నేషన్ సిరీస్‌లో భారత్, సౌతాఫ్రికాతో పాటు శ్రీలంకు కూడా పాల్గొంటుంది. ఈ టోర్నీ ఏప్రిల్ 27న ప్రారంభం కాగా.. తొలి మ్యాచ్‌లో భారత్, శ్రీలంక తలపడ్డాయి. వర్షం కారణంగా 39 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను భారత బౌలర్లు 147 పరుగులకే ఆలౌట్ (38.1 ఓవర్లలో) చేశారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా 3, నల్లపురెడ్డి చరణి, దీప్తి శర్మ తలో 2, అరుంధతి రెడ్డి ఓ వికెట్ పడగొట్టారు. శ్రీలంక ఇన్నింగ్స్‌లో హాసిని పెరీరా (30) టాప్ స్కోరర్‌గా నిలిచింది.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. 29.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఆ మ్యాచ్‌లో కూడా ప్రతిక రావల్ (50 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించింది. స్మృతి మంధన 43, హర్లీన్ డియోల్ 48 (నాటౌట్) పరుగులతో సత్తా చాటారు.
ఈ టోర్నీలో భారత్ సౌతాఫ్రికా, శ్రీలంకతో మరో మ్యాచ్ ఆడుతుంది. అన్ని మ్యాచ్‌ల తర్వాత మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు మే 11న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.