TSRTC: ఆర్టీసీ సరికొత్త ప్రయోగం.. 286 మందికి అవార్డులు.. | Presentation Of Awards To TSRTC Employees | Sakshi
Sakshi News home page

TSRTC: ఆర్టీసీ సరికొత్త ప్రయోగం.. 286 మందికి అవార్డులు..

Oct 7 2023 8:34 PM | Updated on Oct 7 2023 8:38 PM

Presentation Of Awards To TSRTC Employees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు అవార్డులు అందజేశారు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌. వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు మరింతగా చేరువై దేశానికే #TSRTC మోడల్‌గా నిలిచిందన్నారు. టీఎస్‌ఆర్టీసీ ముందు 100 రోజుల గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్ ఉందని తెలిపారు. 

ఈ క్రమంలో ట్విట్టర్‌ వేదికగా సజ్జనార్‌.. వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు మరింతగా చేరువై దేశానికే #TSRTC మోడల్‌గా నిలిచింది. ప్రయాణికుల ఆదరణ, ఉద్యోగుల సమిష్టి కృషి, అధికారుల ప్రణాళిక వల్ల సంస్థకు సత్పలితాలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ లోని టీఎస్ఆర్టీసీ కళాభవన్ లో శనివారం శ్రావణమాసం, రాఖీ పౌర్ణమి ఛాలెంజ్ లతో పాటు జోనల్ స్థాయి ఉత్తమ ఉద్యోగులు, ఎక్స్ ట్రా మైల్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు హాజరయ్యారు. ఉన్నతాధికారులతో కలిసి ఆయన ఉత్తమ ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. రాఖీ పౌర్ణమి ఛాలెంజ్, శ్రావణ మాసం ఛాలెంజ్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రీజయన్లకు ట్రోఫీలను అందజేశారు. 

మొత్తం 286 మందికి అవార్డులు వరించగా.. వారిలో రాఖీ పౌర్ణమి ఛాలెంజ్ కు 36, శ్రావణ మాసం ఛాలెంజ్ కు 30, జోనల్ స్థాయి ఉద్యోగులకు 180, ఎక్స్ ట్రా మైల్ లో 25, లాజిస్టిక్స్ విభాగంలో 15 మంది ఉన్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్స్, హెల్పర్స్, శ్రామిక్ ల‌తో పాటు సూప‌ర్‌వైజ‌ర్స్‌, డిపో మేనేజ‌ర్స్‌, డిప్యూటీ ఆర్ఎంలు, ఆర్ఎంలు.. ఇలా అన్ని విభాగాల వారు పుర‌స్కారాల‌ను అందుకున్నారు. 

ఈ అవార్డుల ప్రదానోత్సవంలో సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ గారు మాట్లాడుతూ.. గత రెండేళ్లలో సంస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. క్లిష్ట పరిస్థితులను త‌ట్టుకుని తన కాళ్ల మీద తాను నిల‌బ‌డ‌గ‌లిగే స్థాయికి సంస్థ ఎద‌గ‌డం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రస్థానంలో సిబ్బంది కృషి ఎనలేనిదని వివరించారు. సంస్థ విసిరిన ప్రతి ఛాలెంజ్ ను సిబ్బంది విజయవంతం చేశారని చెప్పారు. రాఖీ పౌర్ణమికి రికార్డుస్థాయిలో ఒక్క రోజులో రూ.22.65 కోట్ల రాబడి రావడం గొప్ప విషయమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ ఇంతమొత్తంలో ఆదాయం రాలేదన్నారు. శ్రావణ మాసంలో ఛాలెంజ్ లోనూ గత ఏడాదితో పోల్చితే అదనపు ఆదాయం వచ్చిందన్నారు. ఈ రికార్డుల్లో భాగమైన సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. నిజాయతీగా, నిబద్దతతో ఉత్తమ సేవలందించే అధికారులు, ఉద్యోగులే సంస్థకు నిజమైన బ్రాండ్ అంబాసిండర్లని పేర్కొన్నారు.

100 రోజుల గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్
“రాబోయే 100 రోజులు సంస్థకు ఎంతో కీలకం. దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతితో పాటు శుభముహుర్తాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు మెరుగైన నాణ్యమైన సేవలందించాలనే ఉద్దేశంతో.. 100 రోజుల గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్ ను నిర్వహించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించడం జరిగింది. ఈ నెల 15 నుంచి వచ్చే ఏడాది జనవరి 22 వరకు ఈ ఛాలెంజ్ అమల్లో ఉంటుంది. గత ఛాలెంజ్ ల మాదిరిగానే పనిచేసి..ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేయాలి.” అని సజ్జనర్ కోరారు. పండుగలకు సిబ్బంది చేస్తోన్న త్యాగం గొప్పదని, ఇంట్లో కుటుంబసభ్యులను, బంధుమిత్రులను విడిచి విధులు నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. పండగ సమయాల్లో పోలీస్, రవాణా శాఖలు సంస్థకు ఎంతగానో సహకరిస్తున్నాయని గుర్తుచేశారు. 

“టీఎస్ఆర్టీసీ కష్టకాలంలో ఉన్నప్పటికీ 2017 నుంచి విడతల వారీగా పెండింగ్ లో ఉన్న 9 డీఏలను ఉద్యోగులకు సంస్థ మంజూరు చేసింది. బకాయిల విషయంలో ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవ్వాల్సిన ఉన్న అరియర్స్, సీసీఎస్ నిధులు, బాండ్లకు సంబంధించిన ప్రతి రూపాయిను కూడా చెల్లిస్తాం. బకాయిలు చెల్లింపు విషయంలో ఒక ప్రణాళికను సంస్థ రూపొందించింది.” అని సజ్జనర్ తెలిపారు.  ఒకవైపు ప్ర‌యాణికుల‌కు మెరుగైన స‌దుపాయాలు కల్పిస్తూనే.. సిబ్బంది సంక్షేమానికి కూడా సంస్థ  కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ఈ నవంబర్, డిసెంబర్ నుండి 1000 కొత్త డీజిల్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులో తీసుకువస్తున్నామని తెలిపారు. రాబోయే కాలంలో హైదరాబాద్ లో పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ప్లాన్ చేసినట్లు వివరించారు. 

ఛాలెంజ్‌లో అత్యుత్తమ ప్రదర్శనకు నగదు పురస్కారాలు
- రాఖీ పౌర్ణమి ఛాలెంజ్: పస్ట్ బెస్ట్ రీజియన్ వరంగల్(రూ.లక్ష) సెకండ్ బెస్ట్ రీజియన్ నల్లగొండ(రూ.75 వేలు), థర్డ్ బెస్ట్ రీజియన్ కరీంనగర్(రూ.50 వేలు).
- శ్రావణ మాసం ఛాలెంజ్: పస్ట్ బెస్ట్ రీజియన్ వరంగల్(రూ.లక్ష), సెకండ్ బెస్ట్ రీజియన్ నల్లగొండ (రూ.75 వేలు), థర్డ్ బెస్ట్ రీజియన్ ఆదిలాబాద్(రూ.50 వేలు).

ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, వినోద్ కుమార్, సీఎంఈ రఘునాథరావు, సీఎఫ్ఎం విజయ పుష్ఫ, సీసీవోఎస్ విజయ భాస్కర్, సీసీఈ రాంప్రసాద్, సీటీఎం(కమర్షియల్) సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all

Video

View all
Advertisement