చిలకలపూడి(మచిలీపట్నం): దేశవ్యాప్తంగా మహిళలను చైతన్యపరచటమే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఉద్దేశమని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా మోర్చ కేంద్ర నాయకురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి చెప్పారు. అంబేడ్కర్ భవన్‌లో బీజేపీ జిల్లా మహిళా మోర్చ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి మహిళా చైతన్య సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పురంధరేశ్వరి మాట్లాడుతూ దేశంలో మహిళలు విలక్షణమైన జీవితం గడిపేందుకు ప్రధాన మంత్రి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. మహిళల్లో ఆత్మగౌరవాన్ని నింపేందుకు స్వచ్ఛభారత్ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రివర్గంలో ఆరుగురు మహిళలకు చోటు కల్పిస్తే వీరిలో ఐదుగురికి కేబినెట్ హోదా ఇవ్వడం పట్ల ప్రధాన మంత్రికి మహిళలపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారని వెల్లడించారు. దేశ జనాభాకు రక్షణగా నిలిచే రక్షణ మంత్రిని మహిళకు కేటాయించారన్నారు. పొత్తులపై బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. సమావేశంలో మహిళా మోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు మాలతీరాణి, అనంతపురం జిల్లా అధ్యక్షురాలు దేవినేని హంస, చిత్తూరు అధ్యక్షురాలు సీకె లావణ్య, బోగాధి రమాదేవి, యెర్నేని సీతాదేవి, రవీంద్రరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి, జిల్లా మహిళా మోర్చ అధ్యక్షురాలు కరెడ్ల సుశీల, పోలే శాంతి, బీజేపీ నాయకులు పంతం గజేంద్ర, కూనపరెడ్డి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment