సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కలిపేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నాలుగు వరుసల రహదారి ప్రాజెక్టు అది. ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్‌డీసీ) సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించింది. నిర్మించు–నిర్వహించు–బదలాయించు(బీవోటీ) విధానం కింద నిధులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. ఏపీఆర్‌డీసీ రూపొందించిన డీపీఆర్‌ను సైతం ఆమోదించింది. కానీ, అధికార పార్టీ ముఖ్య నేతలు మాత్రం ఒప్పుకోలేదు. అంచనా వ్యయాన్ని మూడు రెట్లు పెంచాల్సిందేనని పట్టుబడుతున్నారు. లేకుంటే టెండర్ల ప్రక్రియ జరగనివ్వబోమని తేల్చిచెబుతున్నారు. వారి బెదిరింపుల వల్ల కాంట్రాక్టర్లు ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఆరు నెలలు దాటుతున్నా టెండర్ల ప్రక్రియ ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు.
51 కిలోమీటర్లు.. రూ.505 కోట్లు
హైదరాబాద్–గుంటూరు మార్గంలో నార్కట్‌పల్లి నుంచి అద్దంకి వరకు రహదారిని గతంలోనే అభివృద్ధి చేశారు. ఈ మార్గంలో కొండమోడు–పేరేచర్ల మధ్య నాలుగు వరుసల రహదారిని ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించాలని 2016లో నిర్ణయించారు. దీనిద్వారా హైదరాబాద్–విజయవాడ రహదారికి ప్రత్యామ్నాయంగా నాలుగు లేన్ల రోడ్డు సౌకర్యం ఏర్పడుతుంది. ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణ, టోల్ వసూలు, బదిలీ (డీబీఎఫ్‌ఓటీ) కింద ఈ రహదారిని నిర్మించేందుకు ఏపీఆర్‌డీసీ కేంద్రం నుంచి అనుమతి పొందింది. ఏపీఆర్‌డీసీ రెండు చోట్ల హై లెవల్ వంతెనలతో 51 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేసింది. జాతీయ రహదారుల ప్రమాణాల ప్రకారం కిలోమీటర్‌కు రూ.10 కోట్ల చొప్పున 51 కిలోమీటర్లకు రూ.505 కోట్ల వ్యయం అవుతుందని తేల్చింది. ఈ డీపీఆర్‌ను కేంద్రం ఆమోదించి అనుమతులు జారీ చేసింది. దీంతో టెండర్ల ప్రక్రియలో మొదటి అంకంగా అర్హత గల కంపెనీలు రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్(ఆర్‌ఎఫ్‌క్యూ) టెండర్లలో పాల్గొనాలని గతేడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
రూ.20 కోట్లు అదనంగా ఇచ్చిన ప్రభుత్వం
రహదారి నిర్మాణానికి రూ.505 కోట్లు అవసరమని ఏపీఆర్‌డీసీ పేర్కొంది. రెండు హైలెవల్ వంతెనల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో రూ.20 కోట్లు అదనంగా మంజూరు చేసింది. హైదరాబాద్–గుంటూరు మధ్య హైలెవల్ బ్రిడ్జికి రూ.15 కోట్లు, సత్తెనపల్లి–అమరావతి మార్గంలో హైలెవల్ బ్రిడ్జికి రూ.5 కోట్లకు పరిపాలన అనుమతులు కూడా ఇచ్చింది.
మూడు నియోజకవర్గాలు
కొండమోడు–పేరేచర్ల మధ్య నాలుగు వరుసల రహదారిని గురజాల, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల మీదుగా నిర్మించాలి. అయితే ఈ రోడ్డును నిర్మించాలంటే అంచనాలు పెంచాల్సిందేనని ఆయా నియోజకవర్గాల పరిధిలోని అధికార పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. లేకుంటే పనులు జరగనిచ్చేది లేదని చెబుతుండడంతో టెండర్ల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. అంచనా వ్యయాన్ని పెంచితేనే భూ సేకరణ ప్రక్రియ సాఫీగా జరగనిస్తామని హెచ్చరించడం గమనార్హం. పెంచిన అంచనా వ్యయాన్ని దోచుకోవడానికి స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.
నాలుగుసార్లు టెండర్లు వాయిదా
అంచనా వ్యయాన్ని డీపీఆర్ అంచనా కంటే మూడు రెట్లు.. అంటే రూ.1,500 కోట్లకు పైగా పెంచాలని అధికార పార్టీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. గతేడాది సెప్టెంబర్ నుంచి టెండర్లలో పాల్గొనాలంటూ ఆహ్వానిస్తున్నా.. కాంట్రాక్టు సంస్థలేవీ ముందుకు రావడం లేదు. ఇప్పటివరకు ఏపీఆర్‌డీసీ నాలుగుసార్లు టెండర్ల ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ చేసింది. రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ టెండర్లలో కాంట్రాక్టు సంస్థలు పాల్గొనకుండా అధికార పార్టీ నేతలు అడ్డుపడుతున్నట్లు ఆర్‌అండ్‌బీ వర్గాలు వెల్లడించాయి. చివరగా మార్చి 9న తుది గడువుగా మరో టెండర్ నోటిఫికేషన్‌ను ఏపీఆర్‌డీసీ జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment