
సాక్షి, అమరావతి: ప్రపంచ ఆర్థిక వేదిక ప్రత్యేక ఆహ్వానం మేరకు సీఎం చంద్రబాబు సోమవారం తెల్లవారుజామున దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. శనివారం ఆయన తాత్కాలిక సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. దావోస్ పర్యటనలో ఈసారి బాబు 25 ద్వైపాక్షిక సమావేశాలతో పాటు ఐదు సమావేశాల్లో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గాను మూడు ఒప్పందాలపై సంతకాలు చేస్తారన్నారు.
మన ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా ప్రారంభ ప్లీనరీలో పాల్గొంటారని వివరించారు. రెండో రోజు ఏపీ లాంజ్‌లో జరిగే ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారని, అదేరోజు మధ్యాహ్నం నుంచి స్థానిక ప్రముఖులు, అంతర్జాతీయ సంస్థల సీఈవోతో సమావేశమవుతారని తెలిపారు. సీఐఐ రౌండ్‌టేబుల్ సమావేశంతో పాటు పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతారని చెప్పారు. ఈనెల 25 వరకు ఈ పర్యటన కొనసాగుతుందని చెప్పారు. సీఎం వెంట తనతో పాటు మంత్రులు యనమల, లోకేశ్, వ్యవసాయ సలహాదారుడు విజయకుమార్, ఈడీబీ సీఈవో జె.కృష్ణ్ణకిశోర్, సీఎం ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఆరోఖ్యరాజ్ తదితరులుంటారని తెలిపారు.