పదకొం‍డు స్థానాలపై స్పష్టత, మూడింటిలో సందిగ్ధత | Clarity On Eleven Positions Three In Ambiguity | Sakshi
Sakshi News home page

పదకొం‍డు స్థానాలపై స్పష్టత, మూడింటిలో సందిగ్ధత

Published Sat, Mar 9 2019 11:35 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

Clarity On Eleven Positions Three In Ambiguity - Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్‌ అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం పార్టీలో సందిగ్ధం కొనసాగుతోంది. 14 అసెంబ్లీ స్థానాల్లో 11 స్థానాలపై స్పష్టత వచ్చినా.. కళ్యాణదుర్గం, శింగనమల, గుంతకల్లు స్థానాల అభ్యర్థులను అధిష్టానం తేల్చలేదు. సిట్టింగ్‌లు, ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తుండటంతో అధిష్టానం కూడా నాన్చుడి ధోరణి అవలంబిస్తోంది. దీంతో పాటు అనంతపురం స్థానానికి ప్రభాకర్‌చౌదరిని ఖరారు చేశారని మీడియాకు లీకులు ఇచ్చినా, చంద్రబాబు నుంచి ఇంకా హామీ దక్కలేదని తెలుస్తోంది. వీటితో పాటు హిందూపురం ఎంపీగా నిమ్మల కిష్టప్పను ప్రకటించారని టీడీపీ నేతలు చెబుతున్నా, వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వలసెళ్లిన చాంద్‌బాషాను మైనార్టీ కోటాలో ఎంపీగా నిలిపితే బాగుంటుందని పార్టీతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు సిఫార్సు చేసినట్లు సమాచారం. ఈ స్థానాలపై ముఖ్యమంత్రితో పాటు ఇన్‌చార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జవహర్, జిల్లా మంత్రి కాలవ శ్రీనివాసులు శుక్రవారం కూడా చర్చలు జరిపారు. అయితే ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

కళ్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరికి టిక్కెట్‌ ఇవ్వకూడదని వ్యతిరేక వర్గీయులైన మల్లిఖార్జున, రామ్మోహన్‌చౌదరి, రమేశ్, నారాయణ, ఉమామహేశ్వరరావు గట్టిగా పట్టుబట్టారు. ఈయనకు టిక్కెట్‌ ఇస్తే పార్టీ కోసం పనిచేసేది లేదని తేల్చిచెప్పారు. తమ ఐదుగురిలో ఒకరికి టిక్కెట్‌ ఇవ్వాలనే ప్రతిపాదనను చంద్రబాబు ముందుంచారు. అయితే అనంతపురం అసెంబ్లీ స్థానం ఆశించిన అమిలినేని సురేంద్రబాబు కూడా కళ్యాణదుర్గం సీటు కోరుతున్నారు. ఈయన ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన వాడని, అతనికి కూడా టిక్కెట్‌ ఇవ్వొద్దని చౌదరి వ్యతిరేకవర్గం గట్టిగా చెబుతోంది. ఇక ఉమామహేశ్వరరావు కూడా ఇదే సీటు ఆశిస్తున్నారు. ఇతనికి వ్యతిరేకవర్గం మద్దతు ఉంది. అయితే ఇతను కూడా స్థానికేతరుడు. ఉరవకొండ నియోజకవర్గవాసే. దీంతో ఇద్దరూ స్థానికేతరులు కాబట్టి మల్లిఖార్జున, రామ్మోహన్‌చౌదరిలో ఒకరికి టిక్కెట్‌ ఖరారు చేయాలని కళ్యాణదుర్గం అసంతృప్తి నేతలు పట్టుబట్టారు. కానీ వీరికి టిక్కెట్‌ ఇచ్చేందుకు అధిష్టానం సుముఖంగా లేదు. చౌదరికి.. లేదంటే సురేంద్రకు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

శుక్రవారం సాయంత్రం సీఎం నివాసం నుంచి హనుమంతరాయ చౌదరి కన్నీళ్లు రాలుస్తూ బయటకు వచ్చినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే చౌదరికి టిక్కెట్‌ లేదనే విషయం స్పష్టమవుతోంది. ఇదిలా ఉండగా వ్యతిరేకవర్గం అసమ్మతి స్వరం విన్పించడం వెనుక మంత్రి పరిటాల సునీత హస్తం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చౌదరికి వ్యతిరేకంగా బలమైనవర్గం ఉందని చూపుతూ ఆ ముసుగులో పరిటాల శ్రీరాంకు టిక్కెట్‌ దక్కించుకోవాలనే ప్రయత్నం సునీత చేస్తున్నట్లు తెలుస్తోంది. జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబానికి రెండు టిక్కెట్లు ఇచ్చారని, తమకూ ఇవ్వాలని టీడీపీ ఒత్తిడి తెచ్చి ఆఖరి నిమిషంలో శ్రీరాంకు ఖరారు చేసుకునే ఎత్తుగడ మంత్రి వేస్తున్నట్లు తెలుస్తోంది.


మధుసూదన్‌ గుప్తా పేరే ఖరారయ్యే అవకాశం
గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌ను చంద్రబాబు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. సర్వేలో పరిస్థితి బాగోలేదని, ఓడిపోయే అవకాశం ఉందని, కాబట్టి గుప్తాకు టిక్కెట్‌ ఇస్తున్నామని.. సహకరించాలని గౌడ్‌కు చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. సర్వేలో తాను బలహీనంగా ఉన్నారనే కారణంతో గుప్తాకు టిక్కెట్‌ ఇస్తే మంచి మెజార్టీతో ప్రత్యర్థి గెలిచే అవకాశం ఉందని, గుప్తాకు నియోజకవర్గంలో మంచిపేరు లేదని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే జేసీ దివాకర్‌రెడ్డి, గుప్తా కోసం పట్టుబట్టడంతో చంద్రబాబు కూడా అతనిపేరు ఖరారు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. శింగనమల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ శమంతకమణిని తిరిగి ఎమ్మెల్సీగా కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడంతో యామినీబాలకు ఇవ్వరనేది తేలింది.

అయితే అంతా శైలజానాథ్‌ టీడీపీలోకి వస్తారని ప్రచారం చేసినా, టీడీపీలో చేరేందుకు ఆయన విముఖత ప్రదర్శించారని తెలుస్తోంది. టీడీపీ అధికారంలోకి రావడం లేదని, అలాంటి పార్టీలోకి నేనెందుకు వెళతానని, కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగానే బరిలో ఉంటానని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ప్రస్తావనకు తెరపడినట్లే. ఇకపోతే బండారు శ్రావణి, యామినీబాల మధ్య పోటీ ఉంది. వీరిలో ఓ వర్గం శ్రావణికి, మరోవర్గం యామినీకి గట్టిగా మద్దతు ఇస్తున్నారు. శ్రావణితో పోల్చితే యామినీ బాలకు ఇవ్వడమే మంచిదని.. శమంతకమణి ఎన్నికలు చేసుకోగలదని, శ్రావణి అయితే కష్టమని ఓ వర్గం చెప్పినట్లు చర్చ జరుగుతోంది. దీనికి తోడు శ్రావణి అయితే శమంతకమణి కూడా సహకారం అందించరని చెప్పినట్లు సమాచారం. దీనిపై కూడా టీడీపీ అధిష్టానం లాభనష్టాలను బేరీజు వేసి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.


ఎంపీ రేసులో నిమ్మల, అత్తార్‌
కదిరి నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని తాకట్టుపెట్టి టీడీపీలో చేరిన అత్తార్‌ చాంద్‌బాషాకు చంద్రబాబు అసెంబ్లీ అభ్యర్థిగా పరిగణనలోకి తీసుకోలేదు. మైనార్టీ కోటాలో చాంద్‌బాషాకు ఇవ్వాలని లోకేశ్‌ సిఫార్సు చేసినా కదిరిలో వైఎస్సార్‌సీపీ గెలుస్తోందని, చాంద్‌బాషా అభ్యర్థి అయితే గెలిచే ఓట్ల శాతం భారీగా ఉంటుందని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. కనీస పోటీ ఇవ్వాలంటే చాంద్‌బాషా కంటే ప్రసాద్‌ కాస్త మేలని చెప్పినట్లు సమాచారం. దీంతో కదిరిపై టీడీపీ ఆశలు వదులకుని అభ్యర్థిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే టీడీపీతో పాటు హిందూపురం పార్లమెంట్‌ పరిధిలోని కొంతమంది ఎమ్మెల్యేలు కూడా చాంద్‌బాషాకు టిక్కెట్‌ ఇస్తే మైనార్టీ ఓట్లు కొద్దిమేర అయిన కలిసొస్తాయని, ఎంపీగా అతను గెలవలేకపోయినా ఆ ప్రభావం రెండుమూడు అసెంబ్లీ నియోజకవర్గాలపై ఉన్నా పార్టీకి మేలవుతుందని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో నిమ్మల అభ్యర్థిత్వంపై స్పష్టత వచ్చినా, చాంద్‌బాషాను కూడా ఆప్షన్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా టిక్కెట్ల కేటాయింపుల్లో పీఠముడి వీడాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement