కుర్చీల కోసం కుస్తీపట్లు | కుర్చీల కోసం కుస్తీపట్లు | Sakshi
Sakshi News home page

కుర్చీల కోసం కుస్తీపట్లు

Published Fri, Oct 3 2014 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 PM

కుర్చీల కోసం కుస్తీపట్లు

  • బదిలీలపై రిజిస్ట్రేషన్ల శాఖలో జోరుగా పైరవీలు
  •  మూడు స్థానాలపై కొనసాగుతున్న వివాదం
  • విజయవాడ : కాసులు కురిపించే కుర్చీల కోసం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో కుస్తీపట్లు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సబ్‌రిజిస్ట్రార్ల బదిలీలు జరగటంతో పలువురు మంగళవారం రాత్రికిరాత్రే విధుల్లో చేరిపోయారు. మరికొందరు బుధవారం చేరారు. ప్రధానంగా మూడు సీట్ల విషయంలో వివాదం కొనసాగుతోంది.
     
    సీటు వదిలేది లేదంటూ...

    ఇబ్రహీంపట్నం సబ్-రిజిస్ట్రార్‌ను విజయవాడ ఆడిట్‌కు బదిలీ చేయగా, ఆ స్థానంలో బిక్కవోలు నుంచి వినోదరావును నియమించారు. ఇబ్రహీంపట్నం సీటును వదిలేది లేదంటూ అక్కడ రెండేళ్లుగా పనిచేస్తున్న సబ్-రిజిస్ట్రార్ ప్రసాద్ మంకుపట్టు పట్టినట్లు తెలుస్తోంది. టీడీపీ నేతల సహకారంతో పైరవీలు చేసి బదిలీ నిలుపుదలకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వినోదరావు విధుల్లో చేరేందుకు బుధ, గురువారాల్లో ప్రయత్నించగా, చార్జి కూడా అప్పగించలేదని తెలుస్తోంది. ఈలోగా వినోదరావును ఇబ్రహీంపట్నంలో విధుల్లో చేరొద్దని, ఆగాలని ఉన్నతాధికారులు గురువారం మౌఖిక ఆదేశాలిచ్చినట్లు సమాచారం.
     
    చార్జి అప్పగించకుండానే...

    నందిగామలో కూడా అక్కడ పనిచేస్తున్న సబ్-రిజిస్ట్రార్ రాంబాబు రిలీవ్ అయినా చార్జి అప్పగించలేదు. విజయవాడ నుంచి అక్కడకు బదిలీపై వెళ్లిన రమాదేవి ఆయన చార్జి అప్పగించకుండానే బుధవారం విధుల్లో చేరినట్లు సమాచారం. కంకిపాడు సబ్-రిజిస్ట్రార్ రాఘవరావును అవనిగడ్డకు బదిలీ చేయగా, ఆయన సెలవులో ఉండటంతో చార్జి అప్పగించలేదు. ఈలోగా కంకిపాడుకు బదిలీ అయిన గుణదల సబ్-రిజిస్ట్రార్ ఆర్.కె.నరసింహారావు ఆ స్థానంలో బాధ్యతలు స్వీకరించి కుర్చీలో కూర్చున్నారు.
     
    తిలాపాపం తలాపిడికెడు...

    బదిలీల వ్యవహారం తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు ఉందని పలువురు సబ్-రిజిస్ట్రార్లు వాపోతున్నారు. తెలుగు తమ్ముళ్లు తమకు అనుకూలమైన కొందరికి పోస్టింగ్ ఇప్పించేందుకు తలుపు బార్లా తెరవగా.. కొందరు ఉన్నతాధికారులు ఆదాయం బాగా వచ్చే స్థానాలను వెలకట్టి అమ్మేసినట్లు సమాచారం. మరోపక్క బదిలీల ప్రక్రియ నిలిపివేస్తారని కొందరు ప్రచారం చేస్తున్నారు. జన్మభూమి కార్యక్రమం అయ్యాక బదిలీలు చేయాలని ప్రభుత్వం ఆదే శించగా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో హడావిడిగా బదిలీలు చేయటం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో మరే శాఖలో బదిలీలు జరగలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ జీవో ఉన్నందున బదిలీలు రీకాల్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
     
    రిజిస్ట్రేషన్ల బంద్ పొడిగింపు!

    ఈ నెల ఆరో తేదీ వరకు రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ అధికారులు అవసరమైతే అదనంగా మరో రెండు రోజులు రిజిస్ట్రేషన్లు జరగకపోవచ్చని చెబుతున్నారు. సర్వర్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నందున ఈ ప్రక్రియలో జాప్యం జరిగితే ఈ పరిస్థితి ఉంటుందని పేర్కొంటున్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement