ఎకరాకు లక్ష చందా ఇస్తాం
వాటితో ఎక్కడైనా రాజధానికి భూములు
కొనుక్కొని నిర్మించుకోండి
{పభుత్వంపై విరుచుకుపడిన నిడమర్రు రైతులు
మంగళగిరి:రాజధాని నిర్మాణానికి అవసరమైతే మేం ఎకరాకు లక్ష రూపాయలు చొప్పున ప్రభుత్వానికి చందా ఇస్తామని, వాటితో వేరే చోట ఎక్కడైనా భూములు సేకరించి రాజధాని నిర్మించుకోవాలని ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు గ్రామాల రైతులు ప్రభుత్వానికి సూచించారు. తమ భూములను సెంటు కూడా వదులుకోబోమని, ఒకవేళ బలవంతంగా భూములు సేకరించదలచుకుంటే తమ శవాలపై రాజధాని నిర్మించుకోవాల్సి వుంటుందంటూ వారు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ రైతు హక్కుల పరిరక్షణ కమిటీ గురువారం పై మూడు గ్రామాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా ఉండవల్లిలో రైతు కూలీ ధనలక్ష్మి మాట్లాడుతూ రైతుల భూములు ప్రభుత్వం తీసుకుంటే తాము ఎవరి దగ్గర కూలీ పనికి వెళ్లి బతకాలని వారు ప్రశ్నించారు.
రైతు అన్నపురెడ్డి గోవిందరెడ్డి మాట్లాడుతూ తమకు ఎకరంన్నర పొలం వుందని, దానిలో ఎకరం పొలం కూతురుకు కట్నంగా ఇచ్చి వివాహం చేద్దామనుకున్నానని, గత నెల రోజుల నుంచి ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలతో ఆందోళనకు గురవుతున్నామని చెప్పారు. పెనుమాకలో రైతుకూలీ శివ మాట్లాడుతూ తాము అనారోగ్యానికి గురై పనికి వెళ్లలేకపోయినా రైతు దగ్గరకు వెళ్లి రేపు పనికి వస్తామని చెప్పి వంద రూపాయలు తెచ్చుకునే వాళ్లమని, ఇప్పుడు ఆ భూములను ప్రభుత్వం తీసుకుంటే తాము ఎవరి దగ్గరకు వెళ్లాలన్నారు. నిడమర్రులో పంట పొలాల్లో పరిశీలించిన సమయంలో మహిళా రైతు బత్తుల జయమ్మ కమిటీ ఎదుట కన్నీటిపర్యంతమైంది. కూలీ రైతు కె.భారతి,మహిళా రైతులు కె లలిత, ఉషారాణి తదితరులు వారి బాధలను కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం గ్రామంలో జరిగిన సమావేశంలో రైతులు భీమవరపు కృష్ణారెడ్డి, బుర్రముక్క సుందరరెడ్డి, గాదె ప్రకాష్‌రెడ్డి, కంఠం నరేంద్రరెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు ప్రభుత్వానికి చందాలు ఇస్తాం కానీ భూములు మాత్రం ఇవ్వమని తేల్చి చెప్పారు. తాము ఆత్మహత్యలకైనా సిద్ధమేనన్నారు. మహిళా రైతు గుదిబండ చిట్టెమ్మ మాట్లాడుతూ ఎలాగైనా తమ భూములను కాపాడాలని కమిటీని వేడుకున్నారు.