సాక్షి, హైదరాబాద్: శాసనసభ సమావేశాల ఒకరోజు నిర్వహణ ఖర్చు అక్షరాలా రూ.30 లక్షలు. అదీ.. రోజూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ జరిగి.. వాయిదా పడినపుడే. ఆ గడువునే సభకు ఒక రోజుగా పరిగణిస్తారు. ఒకరోజులో సభ జరిగేది సగటున అయిదు గంటలే. ఈ లెక్కన శాసనసభ సమావేశాల ఖర్చు నిమిషానికి రూ. 10 వేలు. ఈ నెల 12 నుంచి 19 వరకూ తొలివిడత సమావేశాల ఖర్చు అక్షరాలా కోటీ 80 లక్షల రూపాయలు. తొలి విడత ఆరు రోజులూ రోజూ సగటున ఐదు గంటల చొప్పున సభ జరగాల్సి ఉంది. తొలిరోజు మండేలాకు సంతాపం తెలిపి సభ వాయిదా పడింది. మిగిలిన 5 రోజుల సభ వ్యవధి పూర్తిగా వృధా అయినట్టు రికార్డులు చెబుతున్నాయి. సంతాప తీర్మానంపై సభ గంటా 51 నిమిషాలు జరిగింది. మిగిలిన 5 రోజులు గందరగోళంతో వాయిదా పడడంతో గంటకు రూ. 30 లక్షల చొప్పున మొత్తం రూ. కోటిన్నర ప్రజాధనం వృధా అయినట్టేనని అసెంబ్లీ వర్గాలు అంచనా వేశాయి.