దుబారా ఖర్చులు..బీద అరుపులు
-
రాష్ట్రంలో పాలకుల తీరిదీ
-
పుష్కరాలకు ఎక్కువ ఖర్చు చేశామన్న మంత్రి యనమల
-
లక్షల వాటర్, మజ్జిగ ప్యాకెట్లు వృథా
-
రూపురేఖలు కోల్పోయిన రోడ్లు
-
నిరుపయోగంగా సీసీ కెమెరాలు
‘ఆదాయం లేదు. ఖర్చులు పెరిగిపోయాయి. జీతాలు ఇవ్వడం కూడా కష్టమవుతోంది.. ఏరోజుకు ఆరోజు నెట్టుకొస్తున్నాం’ అంటూ బీద అరుపులు అరుస్తున్న పాలకులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఎవరైనా ఆదాయం తగ్గినప్పుడు దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సొంత జిల్లా అయిన తూర్పుగోదావరిలో గతేడాది నిర్వహించిన గోదావరి పుష్కరాలు. పుష్కరాలకు ప్రచారం, ఆహ్వానాలు, పనులు, సౌకర్యాల పేరిట వందల కోట్ల రూపాయల దుబారా జరిగింది.
సాక్షి, రాజమహేంద్రవరం:
గతేడాది గోదావరి పుష్కరాలకు రూ. 1600 కోట్లు ఖర్చు పెట్టినట్టు పాలకులు ఘనంగా చెప్పుకున్నారు. కానీ అందులో అధిక భాగం దుబారా జరిగిందనడానికి ప్రత్యక్ష సాక్ష్యాలెన్నో ఉన్నాయి. గోదావరి మహాపుష్కరాలు అంటూ ప్రచారానికి వందల కోట్ల రూపాయలు వెచ్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పట్టణాల్లో హోర్డింగ్‌లు పెట్టారు. వార్త చానెళ్లలో ప్రకటనలిచ్చారు. ప్రముఖులకు ఆహ్వానాల పేరిట ఖరీదైన ఆహ్వాన పత్రికలు వేయించారు. ప్రధాని, ఇతర ముఖ్య నాయకులను ఆహ్వానించేందుకు ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ వెళ్లారు. అయితే వారెవరూ రాకపోవడం గమనార్హం. పుష్కరాలను డాక్యుమెంటరీ ఫిల్‌్మ గా తీసేందుకు నేషనల్ జియోగ్రఫి చానల్‌కు కోట్లాది రూపాయలు చెల్లించారు. పుష్కరాలు ముగిసి ఏడాది గడచినా ఆ డాక్యుమెంటరీ ఇప్పటికీ బయటకు రాలేదు.
కానరాని సుందరీకరణ ఆనవాళు
పుష్కరాలకు ముఖ్య కేంద్రమైన రాజమహేంద్రవరం నగరాన్ని సుందరంగా తీర్చిద్దేందుకు లక్షలాది రూపాయలు వెచ్చించారు. విమానాశ్రయం రోడ్దు, 216 నంబర్ జాతీయ రహదారి వెంబడి మొక్కలు నాటించారు. అయితే ఇప్పుడవి మచ్చుకు కూడా కనపించడం లేదు.
ఎందుకూ పనికి రాని సీసీ కెమెరాలు...
పుష్కరాల సందర్భంగా రాజమహేద్రవరం నగరం, ఘాట్ల వద్ద 171 సీసీ కెమెరాలు అమర్చారు. పుష్కరాలు ముగిసిన వెంటనే అవి ఎందుకూ పనికి రాకుండా పోయాయి. మొదటి రోజు జరిగిన తొక్కిసలాటతోపాటు అనేక దొంగతనాలు జరిగాయి. సీసీ కెమెరాల నిఘాతో దొంగలను గుర్తించవచ్చు. అయితే గోదావరి పుష్కరాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు దృశ్యాలను రికార్డ్ చేసేవి కావని, కేవలం పర్యవేక్షణ కోసమేనని అధికారులు చెప్పడం విశేషం.
లక్షలాది మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు వృథా
పుష్కర భక్తులకు అందజేసేందుకు వాటర్ ప్యాకెట్లు, బాటిల్స్ లక్షలాది రూపాయలతో కొనుగోలు చేశారు. ముఖ్యమంత్రి కంపెనీ అయిన హెరిటేజ్ నుంచి మజ్జిగ ప్యాకెట్లు బస్తాల కొద్దీ తెప్పించారు. అవసరానికి మించి కొనడం, వాటిని సరిగా పంపిణీ చేయకపోవడంతో లక్షలాది ప్యాకెట్లు మిగిలిపోయాయి. లాలా చెరువు ఎఫ్‌సీఐ గోదాముల్లో నిల్వ చేసిన ఈ ప్యాకెట్లను పుష్కరాలు ముగిన ఐదు రోజుల తర్వాత రోడ్డు రోలర్‌తో తొక్కించారు. తాత్కాలికం పేరుతో వృథాపుష్కరాలకు ప్రతి పని తాత్కాలిక పద్ధతిలో చేశారు. అద్దె ప్రాతిపదికన ప్రతి ఘాట్ వద్ద మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. 12 రోజుల పాటు వాటికి చెల్లించిన అద్దెతో కొత్తవి కొనుగోలు చేయవచ్చని అధికారులే వ్యాఖ్యానించడం గమనార్హం.