ఏలూరు : ఆంధ్రప్రదేశ్ మహిళ, శిశుసంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ...టీడీపీ పార్టీలో ఒంటరి అయ్యారు. నోట్ల కట్ల వ్యవహారంపై పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు పెదవి విప్పటం లేదు. ఈ విషయంలో పీతల సుజాతకు మద్దతుగా నిలిచేందుకు ఎమ్మెల్యేలు వెనకంజు వేస్తున్నారు. మరోవైపు టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. తణుకు మండలం వేల్పూరులో జన్మభూమి కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పీతల సుజాత ఎపిసోడ్పై చంద్రబాబు స్పందన ఎలా ఉంటుందో అనే దానిపై జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది.
కాగా నోట్ల కట్టల వ్యవహారంలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. మంత్రి పీతల సుజాత చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. మంత్రి తండ్రి బాబ్జీ సొమ్ము తీసుకుంటుండగా సెల్ఫోన్లో చిత్రీకరించారనే ప్రచారం జరుగుతోంది. ఆ విషయం గుర్తించే నోట్ల కట్టలను బయటకు విసిరేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ హడావుడి తర్వతే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వీడియో ఎపిసోడ్లో సొంత పార్టీ నేతలపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యవహారంపై చంద్రబాబుకు పార్టీనేతలే సీడీ పంపించారనే ప్రచారం జరుగుతోంది. దాంతో మంత్రి నోట్ల కట్టల వ్యవహారం జిల్లాలో టీడీపీకి తలనొప్పిగా మారటంతో పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీలో గంభీరమైన వాతావరణం నెలకొంది.
సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన పూర్వ ఉద్యోగి అర్దాల విష్ణువతి దత్తు కుమార్తె కార్నె శ్రీలక్ష్మి తన కుమార్తెకు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేపట్టారు. గతంలో ఆచంట ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి సుజాతతో ఆమెకు స్నేహ సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఆ స్నేహంతోనే తమ దత్తు కుమార్తెకు డీఎస్సీలో ఉద్యోగం ఇప్పించాలని రూ.10 లక్షలకు మంత్రితో డీల్ కుదుర్చుకున్నట్టు సమాచారం. అయితే మంత్రి మంగళవారం రాత్రి ఇంటికి చేరుకునేందుకు ఆలస్యం కావడంతో తండ్రి బాబ్జీకి ఈ డబ్బు వ్యవహారం అప్పగించినట్టు తెలుస్తోంది.
టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కూడా అయిన బాబ్జీ తన కూతురి తరఫున అన్ని వ్యవహారాలు చక్కబెడుతుంటారు. ఒప్పందం మేరకు డబ్బు అందజేసేందుకు విష్ణువతి మంగళవారం సాయంత్రం వీరవాసరంలోని మంత్రి నివాసానికి వచ్చారు. ఆమె డబ్బు అందజేస్తుండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చాటుగా వీడియో తీసినట్టు మంత్రి తండ్రి గుర్తించారు. అంతే... వెంటనే ఆయన సీన్ మార్చేశారు. నోట్ల కట్టల సంచీని బయట పెట్టించి... మతిస్థిమితం లేని మహిళ డబ్బు సంచితో తన ఇంటి ఆవరణలోకి వస్తే ఏం చేస్తున్నారంటూ బందోబస్తు పోలీసులను, టీడీపీ కార్యకర్తలను దబాయించారు.
టీడీపీలో ఒంటరిగా మిగిలిపోయిన పీతల!
Published Thu, Jun 4 2015 9:29 AM | Last Updated on Tue, Nov 6 2018 8:50 PM
Advertisement
Advertisement