మంత్రి ఇంట్లో లక్షలు.. పొంతన లేని మాటలు
రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ఇంట్లో దొరికిన రూ. 10 లక్షల సొమ్ము విషయంలో అందరూ పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. మంత్రి ప్రకటనకు, డబ్బు తెచ్చిన మహిళ ప్రకటనకు తేడా కనిపిస్తోంది. డబ్బులు తెచ్చిన అద్దాల విష్ణువతి అనే మహిళ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. ఆమె మాటలకు, ఆమె కుమార్తె శ్రీలక్ష్మి చెప్పే మాటలకు కూడా సంబంధం ఉండట్లేదు. తన కుమార్తెకు టీచర్ ఉద్యోగం ఇప్పించాలని ఆమె అడిగిందని, అయితే తమ వాళ్లు కష్టపడి చదువుకోవాలని చెప్పి ఇంట్లోకి వెళ్లిపోయారని మంత్రి సుజాత అన్నారు. కూరగాయల సంచి ఒకదాన్ని ఆమె అక్కడ పెట్టి వెళ్లిపోయిందని చెప్పారు.
అయితే, తన తమ్ముడి కూతురు పెళ్లి కోసం పాలకొల్లు స్టేట్ బ్యాంకులో డబ్బులు దాచానని, దాన్ని తీసుకుని మంత్రి సుజాత తండ్రిని కలిసేందుకు వచ్చానని అద్దాల విష్ణువతి పోలీసుల విచారణలో తెలిపారు. అప్పుడే డబ్బు సంచి మర్చిపోయి వెళ్లానన్నారు. కానీ ఆమె కుమార్తె చెప్పే విషయం వేరేలా ఉంది. భూమి కొనుగోలు కోసం పాలకొల్లు బ్యాంకు నుంచి 10 లక్షలు డ్రా చేసినట్లు శ్రీలక్ష్మి చెప్పారు. తన తల్లి ఆ నగదును చర్చిలో ప్రార్థన కోసం తీసుకెళ్లారని, తర్వాత మంత్రిని కలిసేందుకు వెళ్లి అక్కడ నగదు మర్చిపోయిందని అన్నారు.
ఈ మొత్తం వ్యవహారంపై నరసాపురం డీఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ చెప్పారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం పాలకొల్లు స్టేట్ బ్యాంకు నుంచి మంగళవారమే నగదు డ్రా చేసినట్లు తెలిసిందని ఆయన తెలిపారు. 10 లక్షల నగదు లావాదేవీపై ఆదాయపన్ను శాఖ సాయం కూడా తీసుకుంటామని ఎస్పీ వివరించారు. ప్రస్తుతం విష్ణువతిని, ఆమె కుమార్తె శ్రీలక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు.