10 ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల సీజ్
Published Sun, Feb 2 2014 2:19 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM
దాచేపల్లి/ నెహ్రూనగర్ (మాచర్ల), న్యూస్‌లైన్ :నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న పది ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ఆర్టీవో అధికారులు సీజ్ చేసిన సంఘటన శక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో చోటుచేసుకుంది. ఆర్టీవో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు రవాణా శాఖ ఉప కమిషనర్ సుందర్ ఆధ్వర్యంలో తెనాలి, నరసరావుపేట, పిడుగురాళ్ల, మాచర్లకు చెందిన ఆర్టీఏ అధికారులు రాత్రి 9 నుంచి నుంచి దాచేపల్లి మండలం పొందుగుల వద్ద ప్రైవేటు బస్సులను తనిఖీలు చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా గుంటూరు, చీరాల, నరసరావుపేట నుంచి హైదరాబాద్ వె ళుతున్న మార్నింగ్ స్టార్ ట్రావెల్స్‌కు చెందిన ఏడు బస్సులు, యామిని, మేఘన, పవన్ ట్రావెల్స్‌కు చెందిన ఒక్కో బస్సును అధికారులు సీజ్ చేశారు. ఈ బస్సులను మాచర్ల ఆర్టీసీ గ్యారేజ్‌కు తరలించారు. అధికారులు ఆర్టీసీ డిపోమేనేజర్ జయశంకర్‌తో మాట్లాడి ప్రత్యేక బస్సుల్లో ప్రయాణికులను హైదరాబాద్ పంపించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 9 ఆటో లు, ఒక లారీని కూడా సీజ్ చేశారు. తనిఖీల్లో ఎంవీఐలు సురేంద్రబాబు, సీహెచ్ రాంబాబు, రామచంద్రరావు, బాలమురళీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
అధికారుల తీరుపై ప్రయాణికుల నిరసన
అర్ధరాత్రి మార్గమధ్యంలో ట్రావెల్స్ బస్సులను నిలిపివేయడంపై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రావెల్స్ కార్యాలయాల వద్ద తగుచర్యలు తీసుకుంటే తాము ఇబ్బం దిపడేవారం కాదని వారు పేర్కొన్నారు. ప్రైవేటు ట్రావెల్స్ ఎక్కడ వున్నాయో మీకు తెలియదా అంటూ అధికారుల తీరుపై ప్రయాణికులు నిరసన వ్యక్తంచేశారు.
264 మంది ప్రయాణికులను తరలించాం..
ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఒక హైటెక్, మూడు డీలక్స్, రెండు ఎక్స్‌ప్రెస్ బస్సులను ఏర్పాటుచేశామని మాచర్ల ఆర్టీసీ డీఎం జయశంకర్ తెలిపారు. 264మంది ప్రయాణికులను ఆరు బస్సుల్లో హైదరాబాద్‌కు పంపిం చినట్లు చెప్పారు. అనుమతుల్లేని బస్సుల్లో ప్రయాణించడం వల్ల ఇబ్బందులు వస్తాయని, అధికారులు నిరంతరం బస్సులను తనిఖీలు చేస్తారని తెలిపారు. సురక్షతమైన ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలని డీఎం కోరారు.
Advertisement
Advertisement