ఉక్కరి బక్కిరి | In addition to the unusual weather conditions | Sakshi
Sakshi News home page

ఉక్కరి బక్కిరి

Published Sun, Jun 15 2014 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 8:51 AM

ఉక్కరి బక్కిరి

ఉక్కరి బక్కిరి

అసాధారణ వాతావరణ పరిస్థితులతో జిల్లా వాసులు అల్లాడుతుంటే దానికి తోడు విద్యుత్ కోతలు మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గాలి పంఖాలు తిరగక ఉక్కపోతతో చిన్నారులు, వృద్ధులు, ఆస్పత్రుల్లో రోగులు అవస్థలు పడుతున్నారు. పనివేళల్లో కరెంటు కోతలతో కార్మికులు ఉపాధి కోల్పోయి ఉసూరుమంటున్నారు. స్వశక్తితో చిన్న పరిశ్రమలు నెలకొల్పుకుని జీవనం సాగిస్తున్న యువత భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. గ్రామాల్లో తాగునీరు కూడా సక్రమంగా అందక ప్రజలు నానా పాట్లు పడుతున్నారు.
 
 నెహ్రూనగర్(మాచర్ల)/రేపల్లె/మంగళగిరి రూరల్: పట్టణాల్లో ఆరు గంటల పాటు ఉదయం 9 గంటల నుంచి 12, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సరఫరా నిలిచి పోతోంది. పల్లెల్లో 10 గంటల పాటు కోత విధిస్తున్నారు. ఇవి కాక అప్రకటిత కోతలు అదనం. వేసవి ఎండల తీవ్రత తగ్గి వర్షాలు కురిసే వరకు పరిస్థితి మారే అవకాశం కనిపించడం లేదని, వినియోగం తగ్గిన్నప్పటికీ బిల్లులు ఇంచుమించు అదే స్థాయిలో వస్తున్నాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
 
 ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల అవస్థలు..
 కరెంటు కోత ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు అవస్థలు పడుతున్నారు. ఉక్కపోతతో గుక్కపెట్టి ఏడుస్తున్న శిశువులను సముదాయించలేక బాలింతలు, వారి బంధువులు విసనకర్రలతో విసురుతూ గాలి అందించే ప్రయత్నం చేస్తున్నారు. మాచర్ల ప్రభుత్వాస్పత్రిలోని బాలింతల వార్డులో కనీసం జనరేటర్ కూడా పనిచేయడం లేదు. ఇక రాత్రి వేళల్లో రోగుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంటోంది.
 
 మాచర్ల చుట్లు పక్కల ప్రాంతాల్లో ఇదే పెద్ద ఆసుపత్రి కావడంతో నిత్యం ఇక్కడికి 200 మంది రోగులు వస్తుంటారు. 30 పడకల ఈ వైద్యశాలలో రక్తనిధి కేంద్రానికి ఒక జనరేటర్ ఉండగా వైద్యులు దానికి ఆపరేషన్లు సమయంలో మాత్రమే వాడుకుంటున్నారు. కరెంటు లేక పోవటంతో ల్యాబ్, ఎక్స్‌రే యూనిట్లు సరిగ్గా పనిచేయడంలేదు. శుక్రవారం రాత్రి తలలకు గాయాలతో ఆస్పత్రికి వచ్చిన ఇద్దరికి టార్చిలైట్, సెల్‌ఫోన్ వెలుతురులో వైద్యులు కుట్లు వేశారు. కొవ్వొత్తి వెలుతురులోనే వైద్యురాలు పనులు చేసుకుంటూ కనపడ్డారు.

 కేటగిరి, అదనపు చార్జిల పేరుతో బిల్లుల మోత
 ఇప్పటికే గృహ వినియోగ విద్యుత్‌ను ఆరు కేటగిరీలుగా నిర్ణయించి బిల్లులు వసూలు చేస్తున్నారు. వాటికి అదనంగా కస్టమర్ చార్జీలు, విద్యుత్ సాధారణ సరఫరా చార్జి, ఇంధన సర్‌చార్జిలు వసూలు చేస్తున్నారు. ఈ బిల్లుల చెల్లింపు వినియోగదారులకు పెనుభారంగా మారింది. బిల్లులు చెల్లింపు కోసం మీ సేవ కార్యాలయాల్లోనూ సర్వీస్ చార్జీలు వసూలు చేస్తున్నారు. రూ.200 బిల్లుకు రూ.2, రూ.200 నుంచి రూ.1000 వరకు రూ.5 , రూ.1000 నుంచి రూ.2500 వరకు రూ.10, రూ.2500 నుంచి ఆపై బిల్లులకు రూ.25లు వినియోగదారులే చెల్లించాల్సి వస్తోంది.
 
 కుళాయిల నుంచి అందని నీరు..
 ఎప్పుడంటే అప్పుడు విద్యుత్ సరఫరా నిలిచిపోతుండటంలో గ్రామాల్లోని రక్షిత మంచినీటి ట్యాంకులు కూడా నిండటం లేదు. దీంతో కుళాయిల ద్వారా ప్రజలకు తాగునీరు అందించేందుకు పంచాయతీ పాలకులు సతమతమవుతున్నారు. మంగళగిరి సబ్ డివిజన్ పరిధిలోని పగటి వేళల్లో అధిక సమయం విద్యుత్ కోతలు విధిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
 
 నాలుగైదు రోజులుగా పరిస్థితి మరింత దిగజారిపోయింది. అసలే మండుతున్న ఎండలు, ఆపై వడగాడ్పులతో హడలెత్తుతున్న ప్రజలు పది గంటలకు పైగా విద్యుత్ కోతలు విధిస్తుండటంతో ఇళ్లలో కనీసం ఫ్యాన్లు కూడా తిరగకపోవడంతో నరకయాతన అనుభవిస్తున్నారు. తాగునీటితో ఇబ్బంది పడుతున్న గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా అయినా తాగునీరు సరఫరా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
 
 
 కార్మికుల పరిస్థితి అగమ్యగోచరం..
 కరెంటు కోతలతో ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పనివేళల్లో విద్యుత్ కోతలతో పనులు తగ్గిపోవటంతో పూటగడవటమే కష్టమవుతోంది. రేపల్లె విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో గృహ వినియోగానికి 41,082 కనెక్షన్లు, వ్యాపార సంస్థలకు 3,584, పరిశ్రమలకు 683, వ్యవసాయానికి 2,280, ప్రభుత్వ రంగసంస్థలు, దేవాలయాలు, చర్చిలు, మసీదులకు 800ల కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి నెల రూ.1.3 కోట్లు రెవెన్యూ వసూలవుతోంది. విద్యుత్ కోతలు పెరిగిపోయినా రెవెన్యూ రాబడిలో మాత్రం తగ్గుదల కనిపించడం లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement