తప్పెవరిది?
అధికారుల నిర్లక్ష్యం.. పట్టించుకోని వైఖరి.. నిధులలేమితో ప్రభుత్వాస్పత్రిలో రోగుల ప్రాణాలు పోతున్నాయి. రోజూ వందల సంఖ్యలో రోగులు వస్తున్నా సౌకర్యాలపై సీరియస్‌గా ఉండే అధికారే కనిపించడంలేదు. శుక్రవారం రాత్రి జరిగిన విద్యుత్ అంతరాయం వెనుక కథను పరిశీలిస్తే.. అధికారుల నిర్లక్ష్యమే కనిపిస్తుంది. కేబుల్ సమస్యపై వారం కిందటే ఎలక్ట్రీషియన్ లేఖ ఇచ్చినా పట్టించుకోని డొల్లతనమే స్పష్టమవుతుంది.
- ప్రభుత్వాస్పత్రిలో పవర్ కట్ వివాదాస్పదం
- వారం రోజుల కిందటే కేబుల్‌లో లోపాలు
- వెంటనే చేయించాలని ఎలక్ట్రీషియన్ లేఖ
- అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోని వైనం
లబ్బీపేట : ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం రాత్రి మూడు గంటల విద్యుత్ అంతరాయానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమా? ఈ సమస్యపై వారం రోజుల కిందట ఎలక్ట్రీషియన్ ఇచ్చిన లేఖను పక్కన పెట్టడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందా..? అంటే అవునని సమాధానమే వస్తుంది. అయితే, తమకు లేఖ అందిన వెంటనే వైద్య ఆరోగ్యశాఖ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీహెచ్‌ఎంఐడీసీ) అధికారులతో మాట్లాడామని ప్రభుత్వాస్పత్రి అధికారులు చెబుతున్నారు. మరమ్మతులు చేసే బాధ్యత వారిదేనంటున్నారు. కాగా, ఆస్పత్రిలో 24 గంటల విద్యుత్ సరఫరాకు ప్రత్యేక సబ్‌స్టేషన్ ఉన్నా కేవలం కేబుల్‌లో తలెత్తిన లోపం వల్లే సరఫరా నిలిచిపోవడంపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తప్పెవరిది, విచారణ అనంతరం ఎవరిని బాధ్యులను చేస్తారనే దానిపై ఉద్యోగులు, అధికారులు ఆందోళన చెందుతున్నారు.
వారం కిందటే సమస్య
మెడికల్ బ్లాక్‌కు వచ్చే కేబుల్‌లో ఈనెల 17వ తేదీనే సమస్య ఏర్పడింది. మూడు ఫేస్‌లలో ఒక ఫేస్ కేబుల్ కాలిపోవడంతో బ్లాక్‌లోని కొన్ని విభాగాల్లో విద్యుత్ నిలిచిపోయింది. దీంతో ఎలక్ట్రికల్ సిబ్బంది మూడు ఫేస్‌ల లోడ్‌ను రెండుఫేస్‌లపై సర్దుబాటు చేశారు. అనంతరం ఈనెల 18న.. కేబుల్‌ను తక్షణమే మార్చాలని, లేకుంటే విద్యుత్ సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉందంటూ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్‌కు లేఖ రాశారు. ఆమె ఏపీహెచ్‌ఎంఐడీసీ ఇంజినీర్లకు రిఫర్ చేస్తూ డిస్పాచ్‌లో ఇచ్చారు. ఇదే అంశాన్ని సూపరింటెండెంట్‌కు సైతం ఎలక్ట్రీషియన్ చెప్పడంతో ఆమె అప్పుడే ఫోన్‌లో ఇంజినీర్లతో మాట్లాడినట్టు తెలిసింది. ఎలక్ట్రీషియన్ లేఖ మాత్రం ఇంజినీర్లకు చేరకపోవడంతో వాళ్లు మరమ్మతుల విషయం పట్టించుకోలేదని సమాచారం. దీంతో శుక్రవారం రాత్రి కేబుల్‌లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మూడు గంటల కరెంటు సరఫరా నిలిచిపోవడం, రోగులు ఇబ్బందులు పడటం వివాదాస్పదమైంది. అత్యవసర సర్వీసులకు సంబంధించి బ్యాకప్ కేబుల్ మెయింటైన్ చేయాల్సి ఉన్నా ప్రభుత్వాస్పత్రిలో అలాంటి పరిస్థితి లేదు.
నిర్లక్ష్యం ఎవరిది?
ఈ విషయంలో నిర్లక్ష్యం ఎవరిదనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఆస్పత్రిలో అత్యవసరంగా చేయాల్సిన అనేక పనులకు ఏపీహెచ్‌ఎంఐడీసీ ఇంజినీర్లు అంచనాలు రూపొందించినా నిధుల లేమితో పరిష్కరించలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కేబుల్‌ను ఏ నిధులు వెచ్చించి చేపడతారనే వాదన వినిపిస్తోంది. ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు రోజుకు రూ.వెయ్యి మాత్రమే ఖర్చుచేసే అధికారం ఉంది. అంతకుమించి ఖర్చు చేయాలంటే కలెక్టర్ అనుమతి తీసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో కేబుల్‌ను రూ.15వేలు ఏ నిధులు కేటాయించి చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
బ్యాకప్ కేబుల్స్‌కు రంగంసిద్ధం
ఆస్పత్రిలో బ్యాకప్ కేబుల్స్ తప్పనిసరిగా ఉండాలని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ మోహనకృష్ణ సూచించడంతో తక్షణమే వాటిని ఏర్పాటు చేయాలని మంత్రి కామినేని శ్రీనివాస్‌తో పాటు ఎంపీ కేశినేని నాని ఆదేశించారు. దీంతో మూడు బ్లాక్‌లకు ఆల్టర్‌నేటివ్‌గా రెండో కేబుల్స్‌ను ఏర్పాటు చేసేందుకు ఇంజినీర్లు చర్యలు చేపట్టారు. దీంతో ఒక కేబుల్‌లో లోపం తలెత్తినా, మరో కేబుల్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఆస్పత్రి లోపల కేబుల్స్ కాలిన ఘటనపై తమకు సంబంధం లేకున్నా రోగులు ఇబ్బంది పడతారనే తమ సిబ్బందిని రిపేరుకు పంపించామని మోహనకృష్ణ తెలిపారు. ఇక్కడ 24 గంటల విద్యుత్ సరఫరాకు ప్రత్యేక సబ్‌స్టేషన్ ఉందని పేర్కొన్నారు.