103 మంది ‘ఎర్ర’ దొంగలకు రిమాండ్
తిరుపతి లీగల్, న్యూస్‌లైన్: తిరుమల శేషాచల అడవుల్లో ఇద్దరు అటవీ అధికారుల హత్య కేసులో తమిళనాడుకు చెందిన 103 మందికి ఈ నెల 31వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తిరుపతి 5వ అదనపు జూనియర్ జడ్జి నాగ వెంకటలక్ష్మి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. వారిపై ఐపీసీ 302,307,147,148,341,396,397,332,333,120(6) సెక్షన్లతో పాటు ఫారెస్ట్ చట్టం సెక్షన్ 149,20 కింద రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేశారు.
శేషాచల అడవుల్లో రెండు రోజుల క్రితం తిమ్మినాయుడు పాళెం బీట్ డెప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీధర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ డేవిడ్ కరుణాకర్ హత్యకు 103 మంది కారకులని, వీరు 300 ఎర్రచందనం దుంగలను వాహనాల్లో తరలిస్తూ పట్టుబడ్డారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. హత్య చేయడంతో పాటు అధికారుల వద్ద ఉన్న బంగారు నగలు, సొమ్ము, సెల్‌ఫోన్లను దోచుకున్నారని తెలిపారు. పెద్దచేనుబండ, మామండూరు అటవీప్రాంతం వద్ద పోలీసులు 103 మందిని అరెస్ట్ చేసి 3 ఆర్టీసీ బస్సుల్లో కోర్టు వద్దకు తీసుకుని వచ్చారు. రిమాండ్ అనంతరం వీరందరినీ కడప జైలుకు తరలించారు.
తమిళ లాయర్ల ప్రవేశం
ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసుల్లో అధికంగా తమిళనాడుకు చెందిన వారే అరెస్ట్ అవుతుండడంతో వారిని బెయిల్‌పై విడుదల చేయించుకోవడానికి తమిళనాడు నుంచి న్యాయవాదులు కొంతమంది తిరుపతికి వస్తున్నారు. కొద్దిమంది మాత్రం తిరుపతిలోని న్యాయవాదుల సాయంతో బెయిల్ పొందుతున్నారు. ఇద్దరు న్యాయవాదులు తమిళనాడు నుంచి వచ్చి ఏకంగా తిరుపతిలోనే కాపురం పెట్టినట్లు తెలిసింది. కాగా తమకు పరిచయం ఉన్న న్యాయవాది దగ్గరకు మాత్రమే వెళ్లాలంటూ కొంతమంది పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది ఎర్రదొంగలకు సూచిస్తునట్లు ఆరోపణలు వస్తున్నాయి.
రిమాండ్ రిపోర్టు కాపీలను కూడా సదరు పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది తమకు కావలసిన న్యాయవాదులకు ముందుగానే అందిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆ న్యాయవాదులు ఎర్రచందనం దొంగల చిరునామాకు వెళ్లి వారి బంధువులు లేదా యజమానులతో సంప్రదింపులు జరిపి తిరుపతి కోర్టులలో బెయిల్ పిటీషన్లను దాఖలు చేస్తున్నట్లు సమాచారం. ఈ బెయిల్ డీల్ కుదిర్చిందానికి సదరు పోలీసులకు, ఫారెస్ట్ సిబ్బందికి సొమ్ము ముడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
పోలీసు కస్టడీకి తీసుకోవచ్చు కదా!
వందల మందిని ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసుల్లో పోలీసులు, ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేసి కోర్టులకు తరలిస్తున్నారు. వారిని పోలీసు కస్టడీకి తీసుకొని విచారిస్తే నిజానిజాలు బయటకు వస్తాయని న్యాయవాదులు అంటున్నారు. ఫారెస్ట్, పోలీసు అధికారులు తమిళనాడుకు చెందిన ఎర్రచందనం దుంగలను చూసీ చూడనట్లు వదిలివేయడం వల్లనే వారు రెచ్చిపోయి ఫారెస్ట్ అధికారుల ప్రాణాలు తీస్తున్నారని న్యాయవాదులు అంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం ఫారెస్ట్ చట్టంలో కొన్ని సవరణలు తీసుకొని రావాలని న్యాయవాదులు కోరుతున్నారు.