‘104’ రికార్డుల మాయం | 104 'records, missed | Sakshi
Sakshi News home page

‘104’ రికార్డుల మాయం

Published Fri, Dec 20 2013 4:10 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

104 'records, missed

నెల్లూరు(బారకాసు), న్యూస్‌లైన్:  జిల్లా వైద్యారోగ్యశాఖ, జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) అధికారుల నిర్లక్ష్యంతో రెండు నెలల కిందట ‘104’ సేవల రికార్డులు మాయమయ్యాయి. చెక్‌బుక్‌లూ కూడా అదృశ్యమయ్యాయి. ఈ విషయాన్ని సిబ్బంది గోప్యంగా ఉంచారు. రికార్డులు పొరపాటున పోయాయా? లేక  ఎవరైనా కావాలనే చేశారా అనే విషయాలు తెలియడం లేదు. జిల్లా వైద్యారోగ్యశాఖ, ఆ శాఖ కార్యాలయంలో ఉన్న  ఎన్‌ఆర్‌హెచ్‌ఎం విభాగాధికారుల సంయుక్త ఆధ్వర్యంలో 104 వైద్య సేవల నిర్వహణ సాగుతోంది. ఎన్‌ఆర్‌హెచ్‌ఎం విభాగంలో ఆరుగురు పని చేస్తున్నారు. వీరిలో డీపీఎంఓ, డీపీఎం, ఏఓ, సీనియర్ అసిస్టెంట్, ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉన్నారు. జిల్లాలో 104 వైద్య సేవలందించే వాహనాలు 20 ఉన్నాయి.
 
 దాదాపు 80 మందికి పైగా సిబ్బంది పని చేస్తున్నారు. వీరి జీతభత్యాలు, వాహనాలకు అవసరమైన నిధుల రికార్డులన్నీ ఎన్‌ఆర్‌హెచ్‌ఎం సిబ్బంది పర్యవేక్షిస్తుంటారు. 104 సిబ్బంది సర్వీస్ రికార్డులు, బ్యాంక్ అకౌంట్ల నంబర్లు తదితర సమాచారం అంతా ఈవిభాగం వద్దే ఉంటుంది.    ఇటీవల 104 సిబ్బంది జీతభత్యాల రికార్డులు, చెక్‌బుక్‌లు కన్పించకుండా పోయాయి. ఇవి ఏమయ్యాయో తెలియడంలేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు కూడా తెలియకుండా ఆ విభాగ సిబ్బంది గోప్యత పాటించారు. తాము మీటింగ్‌లకు పోయినప్పుడు ఎక్కడైనా పోయి ఉంటాయేమోనన్న ఉద్దేశంతో పలు కార్యాలయాల చుట్టూ సిబ్బంది పరుగులు తీస్తున్నట్టు తెలిసింది.
 
 ‘వెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు’ 104 సిబ్బంది రెండు నెలలుగా జీతాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. అంతకు ముందు సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల జీతాలు ఆలస్యంగా రావడం, ఉద్యమ విరామం తర్వాత కూడా జీతాలు లేకపోవడంతో సిబ్బంది పడరాని పాట్లు పడుతున్నారు.  తమకు జీతాలు ఇప్పించాలని సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఫైళ్లు కన్పించకుండా పోయిన విషయాన్ని దాచిన ఎన్‌ఆర్‌హెచ్‌ఎం సిబ్బంది మాత్రం రేపు ఇస్తాం, మాపు ఇస్తామంటూ మభ్యపెడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు  విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
 
 ఈనెల కూడా జీతాలు లేనట్టే..
 104 సిబ్బందికి ఈనెల కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇందుకు ఎన్‌ఆర్‌హెచ్‌ఎం సిబ్బంది తీరే కారణం. నెలాఖరు దగ్గరకు వచ్చింది. జీతాలు ఇచ్చేందుకు పదిరోజుల సమయం ఉంది. రికార్డులు, చెక్‌బుక్‌లు పోయిన విషయాన్ని ఎన్‌ఆర్‌హెచ్‌ఎం సిబ్బంది ఇప్పుడు తెలియచేసినా పోయిన వాటిని మళ్లీ తయారు చేసేందుకు కలెక్టర్ అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియ జరిగేందుకు దాదాపు 15 నుంచి 20 రోజులు పట్టే అవకాశం ఉంది. దీంతో 104 సిబ్బందికి ఈ నెలకూడా జీతాలు వచ్చే పరిస్థితి కనబడటంలేదు.   104 సిబ్బంది సమస్యలను అధికారులు ఏ విధంగా పరిష్కరిస్తారో వేచి చూడాల్సి ఉంది.
 
 ఎస్‌బీఐకి బదులు  
 ఐసీఐసీఐ బ్యాంకు
 ఇప్పటి వరకు 104 సిబ్బంది జీతభత్యాలు, వాహనాలకు అవసరమైన డీజిల్ కోసం ఎస్‌బీఐ ఖాతాలో దాదాపు రూ.4 కోట్లు నిధులు నిల్వ ఉన్నాయి. అంతేకాకుండా ఇతర ఆరోగ్య కార్యక్రమాలకు వినియోగించేందుకు ఎన్‌ఆర్‌హెచ్‌ఎం నిధులు ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఎస్‌బీఐ చెక్‌బుక్ కన్పించక పోవడం, జీతాలు ఇవ్వాలంటూ సిబ్బంది ఒత్తిడి తేవడంతో తప్పని పరిస్థితిలో   ఐసీఐసీఐ బ్యాంకులో డ్రా చేసి  ఇచ్చేందుకు ఆ విభాగ సిబ్బంది ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ విషయమై డీపీఎంఓ డాక్టర్ పెంచలయ్యను వివరణ కోరగా 104 రికార్డులు పోలేదన్నారు. రెండుమూడు రోజుల్లో జీతాలు ఇస్తామన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement