రికార్డులే లేవు | Records not found | Sakshi
Sakshi News home page

రికార్డులే లేవు

Published Sat, Feb 15 2014 2:02 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

Records not found

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్‌కు వందల కోట్లంటే లెక్కే లేదు. ఏ పనికి ఎంత ఖర్చు పెడుతున్నామనే దానికి లెక్కా జమా అసలే లేదు. వందల కోట్ల రూపాయలతో పనులు చేసినట్టు చెబుతున్న కార్పొరేషన్ అందుకు తగిన రికార్డులు ఇవ్వమంటే వెనకడుగు వేస్తోంది. వివిధ పనులకు బడ్జెట్‌లో జరిపిన కేటాయింపులకంటే కోట్ల రూపాయలు అధికంగా ఖర్చు చేసినా వాటి తాలూకు రికార్డులు మాత్రం ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని ఆడిట్ శాఖ కడిగి పారేసింది. 2010-11కు సంబంధించి జరిపిన ఆడిట్ వివరాలను గురువారం రాష్ట్ర ఆడిట్ జనరల్ విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందచేశారు.
 రూ.22 కోట్ల పనులకు రికార్డులేవీ?
 నగరంలో సంక్షేమానికి సంబంధించిన వివిధ పథకాల నిర్వహణ కోసం కార్పొరేషన్ ఖర్చు చేసిన  రూ.22 కోట్ల 88 లక్షల 47 వేల 352 కు సంబంధించిన రికార్డులు కార్పొరేషన్ అధికారులు ఆడిట్ అధికారుల ముందు ఉంచలేక పోయారు. అధికార పార్టీ  నేతల కనుసన్నల్లో పనిచేస్తున్న కార్పొరేషన్ ఉన్నతాధికారులు వారు చెప్పిందే తడవుగా అవసరం లేని చోట కూడా కోట్ల రూపాయలు నేల పాలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఆడిట్ శాఖ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం వాటికి మరింత బలం చేకూర్చింది.
 
 అధికార పార్టీ చోటా నాయకులకు ఆదాయం చూపించేందుకే కార్పొరేషన్ నిధులను ఖర్చు చేస్తున్నారన్న విమర్శలకు ఇది అద్దం పట్టింది. అలాగే ఓచర్ల రూపంలో చెల్లింపులు జరిపిన రూ.10 కోట్ల 99 లక్షల 20 వేల 714కు సంబంధించిన రికార్డులు కూడా అధికారులు సమర్పించలేక పోయారని నివేదిక తూర్పారబట్టింది.
 
 పజావసరాల పేరు తో చేసిన నిర్మాణాలు, నిర్వహణ పనులకు ఖర్చు పెట్టిన రూ.7 కోట్ల 35 లక్షల 5 వేల 585కు సంబంధించిన రికార్డులు కూడా తమకు అందించలేక పోయారని తన నివేదికలో పొందు పరచింది. ప్రజారోగ్య పరికరాలు కొనుగోలు చేసినట్టు ఖర్చు చూపిన రూ.19 లక్షల 52 వేల 485కు, పారిశుధ్య కార్మికులకు జరి పిన చెల్లింపులకు సంబంధించిన రూ. 36 లక్షల 26 వేల 371కు కార్పొరేషన్ అధికారులు లెక్కా, పక్కా చూపలేక పోయారని  వెల్లడించింది. డంపర్ బిన్ల కొనుగోలుకు ఖర్చు చేసిన రూ.3 లక్షల 72 వేల 800కు అవి ఎక్కడ కొన్నారు? ఏ ధరకు కొన్నారనే రికార్డులు చూపలేక పోయారని తప్పుబట్టింది.
 
 కేటాయింపుల కన్నా ఖర్చులెక్కువ
 2010-11 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేషన్ వివిధ పనుల కోసం కేటాయించిన బడ్జెట్ కంటే అధికంగా నిధులు ఖర్చు చేసినట్టు ఆడిట్ నివేదిక బయట పెట్టింది. ఇందు కోసం ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకోలేదని స్పష్టం చేసింది. ఆడిట్ నివేదికలోని అభ్యంతరాలు ఇలా ఉన్నాయి.
 
 టెలిఫోన్ బిల్లుల చెల్లింపుల కోసం రూ.9 లక్షలు కేటాయిస్తే రూ.10 లక్షల 14 వేల 975 ఖర్చు చేశారు.
 
  వాహనాల అద్దెల కోసం రూ.15 లక్షలు కేటాయిస్తే రూ.22 లక్షల 47 వేల 607 చెల్లించారు.
  ప్రకటనల కోసం రూ.40 లక్షలు కేటాయించి రూ.48 లక్షల 96 వేల 745 ఖర్చు చేశారు.
  నగరంలో జాతీయ నాయకుల విగ్రహాల నిర్వహణకు రూ.3 లక్షలు కేటాయించి రూ.4 లక్షల 1 వెయ్యి 240 ఖర్చు పెట్టారు.
  లైమ్ సరఫరా కోసం రూ.10 లక్షలు కేటాయిస్తే రూ.46 లక్షల 72 వేల 622 ఖర్చు పెట్టినట్టు చూపారు.
 
  బ్లీచింగ్ సరఫరాకు రూ.8 లక్షలు బడ్జెట్‌లో కేటాయించగా రూ.9 లక్షల 45 వేల 744 ఖర్చు చేశారు.
 
 కంపోస్ట్ యార్డ్ నిర్వహణకు రూ.5 లక్షలు కేటాయిస్తే రూ.7 లక్షల 56 వేల 544 ఖర్చు చేశారు.
 
  మురుగు నీటి కాల్వల్లో షిల్ట్ (బురద) తొలగింపు కోసం రూ.15 లక్షలు కేటాయించి ఏకంగా రూ.46 లక్షల 52 వేల 519 ఖర్చు చేశారు.
 
  పారిశుధ్య పరికరాల కొనుగోలు కోసం  రూ.40 లక్షలు కేటాయిస్తే  రూ.79 లక్షల 58 వేల 150 ఖర్చు పెట్టడం, ఇందుకు సంబంధించిన రికార్డులు ఇవ్వక పోవడాన్ని ఆడిట్ తీవ్ర అభ్యంతరం చెప్పింది.
 
 టౌన్ ప్లానింగ్ నిధుల మళ్లింపు
 భవనాలు, వాణిజ్య సముదాయాల అనుమతులు, క్రమబద్ధీకరణ ద్వారా టౌన్ ప్లానింగ్ విభాగానికి వచ్చిన నిధులను కార్పొరేషన్ అధికారులు ఇతర పనులకు మళ్లించారు.  ఈ రకంగా 2010-11లో  రూ.29 లక్షల 48 వేల 963 ఇతర పనులకు వాడారు. జనరల్ ఫండ్ నుంచి మళ్లించిన ఈ నిధులను టౌన్ ప్లానింగ్ విభాగానికి చెల్లించాలని ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్‌చెప్పినా కార్పొరేషన్ అధికారులు పట్టించుకోలేదని ఆడిట్ నివేదిక వెల్లడించింది.
 
  లెసైన్సులు రెన్యువల్ చేసుకోని ప్రైవేట్ బిల్డింగ్ సర్వేయర్లు తయారు చేసి సమర్పించిన భవన నిర్మాణాల ప్లాన్‌లకు టౌన్ ప్లానింగ్ విభాగం గుడ్డిగా అనుమతులు మంజూరు చేసింది.  నగరంలో 10 మంది ప్లానర్ల విషయంలో ఇలా జరిగిందని ఆడిట్ ఎత్తి చూపింది.
  విద్యుత్ చార్జీల కింద చెల్లించాల్సిన బిల్లుల కంటే అదనంగా రూ.3 లక్షలు చెల్లించినట్లు ఆడిట్ అధికారులు తేల్చారు.
 
 కావలిలో రూ.3 కోట్ల
 పనులకు రికార్డులు లేవు
 కావలి మున్సిపాలిటీలో 2010-11 సంవత్సరంలో రాజీవ్ నగర బాట పథకం, చెత్తా చెదారాల వినియోగ పథకం, రోడ్లు, కాల్వల నిర్మాణం, నిర్వహణ కోసం ఖర్చు చేసిన రూ.3 కోట్ల 70 లక్షల 9 వేల 999కి సంబంధించిన ఏ రికార్డులు సమర్పించలేక పోయారని ఆడిట్ వెల్లడించింది. ఈ పనులకు సంబంధించిన ఎం బుక్కులు, అగ్రిమెంట్లు, , అంచనాలు, టెండర్లు పిలిచిన రికార్డులు, ఇతర ఫైళ్లు అందించలేదని ఆడిట్ అభ్యంతరం తెలిపింది.
 
  గూడూరు మున్సిపాలిటీలో కార్మికులు, ఉద్యోగులకు  భవిష్య నిధి ( పీఎఫ్)చెల్లించిన రికార్డులు అధికారులు తమకు అందించలేక పోయారని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement