13 మంది దళ సభ్యుల అరెస్ట్ | 13 gang members arrested | Sakshi
Sakshi News home page

13 మంది దళ సభ్యుల అరెస్ట్

Published Wed, Dec 17 2014 5:01 AM | Last Updated on Wed, Oct 17 2018 3:43 PM

13 మంది దళ సభ్యుల అరెస్ట్ - Sakshi

13 మంది దళ సభ్యుల అరెస్ట్

పట్టుబడిన వారంతా సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ)ని వీడిన చంద్రన్న వర్గం సభ్యులే
9 తుపాకులు, 344 తూటాలు, కారు, మోటార్ సైకిల్ స్వాధీనం

 
జంగారెడ్డిగూడెం/బుట్టాయగూడెం: తుపాకీ గొట్టంతోనే రాజ్యాధికారం అనే నినాదంతో ప్రత్యేక దళంగా ఏర్పాటైన 13 మంది సభ్యులు గల సాయుధ బృందాన్ని పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు మంగళవారం వేకువజామున చాకచక్యంగా పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..  సీపీఐఎంఎల్ (న్యూ డెమోక్రసీ) నుంచి బయటకొచ్చి చంద్రన్న వర్గంగా ఏర్పాటైన అశోక్ దళానికి చెందిన 13 మంది సభ్యులను జంగారెడ్డిగూడెం సమీపంలోని జీలుగులమ్మ గుడి వద్ద స్పెషల్ పార్టీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి 9 తుపాకులు, 344 తూటాలు, విప్లవ సాహిత్యంతోపాటు ఒక టాటా ఏస్ వాహనం, ఒక మోటార్‌సైకిల్  స్వాధీనం చేసుకున్నారు.

వీరందరినీ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ జరిపారు. అరెస్టైన వారిలో పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం యర్రాయిగూడెంకు చెందిన దళ కమాండర్ కుంజా రవి, ఖమ్మం జిల్లా గుండాల మండలం కేశన్నపల్లికి చెందిన డెప్యూటీ దళ కమాండర్ పడిగ సురేష్ అలియాస్ వెంకటేష్, బుట్టాయగూడెం మండలం మంగయ్యపాలెంకు చెందిన కెచ్చెల పండు అలియాస్ ప్రభాకరరావు, వీరమద్దిగూడెంకు చెందిన కరకాల రాము అలియాస్ రామన్న, తూర్పురేగులకుంటకు చెందిన మోకల మురళీకృష్ణ అలియాస్ వెంకటేశ్వరరావు, కైకాల సూర్యనారాయణ, అలివేరుకు చెందిన కొక్కెర వెంకటేష్ అలియాస్ శింగన్న, కామవరపుకోట మండలం జోగడిగూడెంకు చెందిన తలారి ప్రకాష్‌తోపాటు రాములు, ఖమ్మం జిల్లా బయ్యారానికి చెందిన మహ్మద్ అబ్దుల్లా రషీద్, పాల్వంచకు చెందిన అమరాజు గట్టయ్య, పెనుమాక మండలం రేగళ్ల గ్రామానికి చెందిన పాయం వెంకటేష్ అలియాస్ మురళి, కొత్తగూడెంకు చెందిన బడపటి వీరన్న ఉన్నారు.

వీరంతా పశ్చిమగోదావరి జిల్లాలో నూతనంగా దళాన్ని ఏర్పాటు చేసి ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కచ్చితమైన సమాచారం ఉందని ఎస్పీ రఘురామ్‌రెడ్డి చెప్పారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఏవీ సుబ్బరాజు ఆధ్వర్యంలో సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు ఈ దాడులు నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. కాగా, చంద్రన్న వర్గంలోని అశోక్ దళానికి చెందిన 13 మంది సభ్యులను జంగారెడ్డిగూడెం సమీపంలోని జీలుగులమ్మ గుడి వద్ద అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెబుతుండగా, వీరందరినీ బుట్టాయగూడెం మండలం ఇప్పలపాడు గ్రామ సమీపంలోని విప్పలమ్మ కొయ్య వద్ద పోలీసులు కాపుకాసి పట్టుకున్నట్టు తెలిసింది.  దళ సభ్యుల వద్ద తుపాకులు ఉన్నప్పటికీ, వారు వాటిని ధరించకుండా వాహనంలోనే ఉంచుకున్నట్టు సమాచారం.

దళ సభ్యులు అప్రమత్తమయ్యే అవకాశం ఇవ్వకుండా చుట్టుముట్టిన పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకున్నారని భోగట్టా. పోలీసులు తమను ముట్టడించిన సమయంలో దళ సభ్యులు పొగాకు బ్యారన్ల వద్ద గల కర్రలతో వారిపై దాడిగి తెగబడగా, పోలీసులు ప్రతిఘటించి వారందరినీ అరెస్ట్ చేసినట్టు చెబుతున్నారు. తొలుత దళ సభ్యుల్లో కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం వారిచ్చిన సమాచారం మేరకు రేగులకుంట సమీపంలోని వంతెన కింద తలదాచుకుంటున్న మరికొందరిని చాకచక్యంగా పట్టుకున్నట్లు తెలిసింది.  కాగా, వారినుంచి ఆయుధాలు,బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement