బీసీలకు 150 ఎమ్మెల్యే, 22 ఎంపీ స్థానాలు కేటాయించాలి
మోత్కూరు, న్యూస్‌లైన్: వచ్చే సాధారణ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు 150 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాలు బీసీలకు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా మోత్కూరులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
జనాభా ప్రాతిపదికన బీసీలకు సీట్లివ్వని పార్టీలను బీసీ వ్యతిరేక పార్టీలుగా గుర్తించి, వారి ఓటమికి ప్రచారం చేస్తామన్నారు. నల్లగొండ జిల్లా కమ్యూనిస్టులతో ఎంతో చైతన్యవంతమైనప్పటికీ 12 ఎమ్మెల్యేల స్థానాల్లో ఓకే ఒక్క స్థానం బీసీలకు కేటాయించడం, 2 పార్లమెంట్ స్థానాల్లో అగ్రవర్ణాలను, దొరలను ఎన్నుకోవడం ఏమిటని ప్రశ్నించారు.
జిల్లాలో 12 ఎమ్మెల్యే స్థానాల్లో 6 బీసీలకు, 2 ఎంపీ స్థానాల్లో బీసీలకు ఒక్కటి కేటాయించాలని డిమాండ్ చేశారు. రూ. 20వేల కోట్లతో బీసీలకు సబ్‌ప్లాన్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. సోలార్ పంపుసెట్‌లు 100 శాతం సబ్సిడీతో, ఉద్యానవన శాఖలో 50 శాతం సబ్సిడీతో బీసీ రైతులకు సదుపాయాలు అందించాలన్నారు.