150 ఏళ్ల మహావృక్షమే.. మృత్యుపాశమైంది
తాతపూడి (కపిలేశ్వరపురం) : తరతరాలుగా సేదదీర్చిన మహావృక్షమే మృత్యువులా విరుచుకుపడింది. నీడనిచ్చిన కొమ్మలే మారణాస్త్రాలుగా రెండు నిండుప్రాణాలను బలిగొంది. కపిలేశ్వరపురం మండలం తాతపూడిలో 150 ఏభై ఏళ్ల నాటి రావి చెట్టు విరిగి పడి.. గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ బొక్కా నాగేశ్వరరావు (50), రైతు ఈదర సత్యనారాయణ (70) ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మరో పదిమంది గాయపడ్డారు. వారిలో చెట్టు నీడన ఆడుకునేందుకు వచ్చిన పిల్లలు ఉన్నారు.
తాతపూడిలో గోదావరి గట్టు సమీపంలో కాలువ గట్టుపై భారీ రావిచెట్టు ఉంది. బలమైన మానుతో, గుబురైన ఆకులతో ఉండే ఈ మహావృక్షం కొమ్మల్లో కొన్ని గ్రామం వైపూ, కొన్ని కాలువ వైపూ విస్తరించాయి. చెట్టు చుట్టూ గ్రామస్తులు రచ్చబండతో పాటు చిన్నగుడినీ నిర్మించుకున్నారు. ఆదివారం ఉదయం చెట్టు కాండం మధ్య భాగంలో చీలిక రావడాన్ని గ్రామస్తులు గమనించారు. ఊరి వైపున్న కొమ్మల్లో కొన్నింటిని నరికివేస్తే తలబరువు తగ్గి విరిగిపడే ప్రమాదాన్ని నివారించవచ్చని భావించారు. గ్రామం వైపు విస్తరించిన కొమ్మలను నరికేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన పలువురు నరికే కొమ్మలు ఎక్కడ మీద పడతాయోనని కాలువ వైపు కొమ్మల కిందకు చేరారు. అదే వారి పాలిట మృత్యువుతో చెలగాటమైంది.
అప్పటికే కాండం లోపల డొల్లబారి ఉండడంతో చెట్టు..కాలువ వైపు భాగంగా ఫెళఫెళా విరిగి పడింది. అంత మహావృక్షం అనూహ్యంగా విరుచుకుపడుతుంటే జనం భీతావహులై, తలోదిక్కూ పరిగెత్తబోయారు. భారీ కొమ్మ పడడంతో తలపగిలిన బొక్కా నాగేశ్వరరావు, తలకు తీవ్రగాయమైన ఈదర సత్యనారాయణ అక్కడికక్కడే మరణించారు. యింటూరు వీర్రాజు, కొరిపెల్ల సత్యనారాయణల కాళ్ళు విరిగిపోయాయి. వీరితో గాయపడ్డ యింటూరి పోలయ్య, ఠానేలంక శ్రీనివాస్‌లను రాజమండ్రి లోని ప్రైవేటు ఆస్పత్రికి, గుత్తుల సూర్యనారాయణ, నడిపల్లి సత్యనారాయణ, బాలలైన అంగర మణికంఠస్వామి, కడియాల సాల్మన్‌రాజు, రాపాక వంశీ, రాపాక రాములను మండపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అన్నదమ్ములైన వంశీ, రాము ఆడుకోవడానికి చెట్టు కిందకు వచ్చి గాయాల పాలయ్యారు.
ఊరే నివ్వెరబోయింది..
తాతముత్తాతల నాటి నుంచి చల్లనినీడతో, గాలితో.. అమ్మలా నిమిరిన మహావృక్షమే మహమ్మారిలా ఇద్దరిని పొట్టన పెట్టుకోవడాన్ని తాతపూడి గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిత్యం ఎందరో ముచ్చటించుకునే రచ్చబండే వధ్యశిలగా మారిన చేదు నిజం వారిని విషాదంలో ముంచింది. భారీ కొమ్మల అడుగున విగతజీవులైన వారిని చూసి భీతావహులయ్యారు. గాయాల పాలైన వారిని హుటాహుటిన 108 పైనా, ప్రైవేటు వాహనాలపైనా ఆస్పత్రులకు తరలించడంతో అసలు ఆ సమయంలో చెట్టు వద్ద ఎవరున్నారు, గాయపడి ఆస్పత్రుల పాలైంది ఎవరు అన్నది వెంటనే స్పష్టం కాక కొద్దిసేపు గందరగోళం నెలకొంది.
మృత్యువాత పడిన నాగేశ్వరరావు, సత్యనారాయణల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కూలి చేసి కుటుంబాన్ని పోషించే నాగేశ్వరరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య కన్నుకు సంబంధించిన, కుమార్తె కాలుకు సంబంధించిన వైకల్యంతో బాధ పడుతున్నారు. ‘మమ్మల్ని ఒంటరి చేసి వెళ్లిపోతావా’ అంటూ వారు గుండెలు బాదుకుంటూ రోదించారు. పెద్దదిక్కును కోల్పోయామని సత్యనారాయణ కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
హుటాహుటిన సహాయక చర్యలు..
దుర్ఘటన గురించి తెలియగానే.. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, రామచంద్రపురం ఆర్డీఓ సుబ్బారావు, కపిలేశ్వరపురం, మండపేట తహశీల్దార్లు జి.చిన్నిబాబు, శ్రీనివాస్‌లు, మండపేట సీఐ పీవీ రమణ, అంగర ఎసై్స ఎం.డి.అష్ఫక్ తాతపూడి చేరుకున్నారు. కాకినాడ, రామచంద్రపురం, మండపేట అగ్నిమాపకాధికారులు రామకృష్ణ, బాబూరావు, చిన్నిబాబుల ఆధ్వర్యంలోని సిబ్బంది చెట్టు కొమ్మలను తొలగించి మృతదేహాలను బయటకు తీశారు. వీఆర్వో టి.వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాలకు శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.