జిల్లాలో 153 కాంట్రాక్ట్ కార్యదర్శుల పోస్టుల క్రమబద్ధీకరణ
Published Thu, Aug 15 2013 2:03 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీ ఎట్టకేలకు నెరవేరింది. పదేళ్లుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన గ్రామాల్లో సేవలందిస్తున్న కార్యదర్శులను క్రమబద్ధీకరిస్తూ పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వి.నాగిరెడ్డి జీఓ నంబర్ 379ను జారీ చేశారు. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు అందినట్లు జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ వి.సత్యసాయిశ్రీనివాస్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 2,261 మంది, జిల్లాలో 153 మంది కాంట్రాక్ట్ కార్యదర్శుల పోరాటం, నిరీక్షణ ఫలించింది. తమను రెగ్యులరైజ్ చేయటం పట్ల జిల్లా కాంట్రాక్ట్ కార్యదర్శుల సంఘం అధ్యక్ష, కార్యదర్శ, కోశాధికారులు వై.రమణ, సీహెచ్ అప్పలనాయుడు, కె.తౌడుబాబు సంఘం తరఫున హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో ప్రస్తుతం 921 పంచాయతీలున్నాయి.
ఈ మొత్తం పంచాయతీలకు 328 మంది కార్యదర్శులు ఉండగా అందులో 175 మంది రెగ్యులర్ పోస్టుల్లో, 153 మంది కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న వారు 2003 లో విధుల్లో చేరారు. కాంట్రాక్టు కార్యదర్శులను రెగ్యులర్ చేస్తామని 2009లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. అయితే దురదృష్టవశాత్తు వైఎస్ మరణంతో వారి క్రమబద్ధీకరణ విషయం అక్కడితో ఆగిపోయింది. 2012లో కాంట్రాక్ట్ కార్యదర్శులను తొల గించి, వారి స్థానంలో కొత్తవారిని నియమించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో పంచాయతీ రాజ్ శాఖలో 2,677పోస్టుల భర్తీకి గత ఏడాది ఏప్రిల్ 2న అప్పటి పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిత్తరంజన్ బిస్వాల్ ఉత్తర్వులు జారీచేశారు.
ఈ ప్రకటన ద్వారా పంచాయతీ కార్యదర్శుల నియామకాలు నేరుగా జిల్లా ఎంపిక కమిటీ ద్వారా భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈక్రమంలో జిల్లాకు సుమారు 201పోస్టులు మంజూ రు చేశారు. దీంతో గత తొమ్మిదేళ్లుగా పని చేస్తున్న 153 మంది కాంట్రాక్ట్ కార్యదర్శులు కాం ట్రాక్టు ఉద్యోగులుగానే మిగిలి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వారంతా ఉద్య మ బాట పట్టి పాలన స్తం భింపజేశారు. చివరికి ప్రభుత్వం దిగి వచ్చి రెండు నెలల్లో రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చింది. ఎట్టకేలకు ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయడంతో వారు హర్షం వ్యక్తం చేశారు.
Advertisement