పేదోన్నతి.. అందని ద్రాక్షేనా..!
‘నేను మంచి మంచి ఉన్నత చదువులు చదవాలి. అందరిలాగా డాక్టర్‌నో, ఇంజినీర్‌నో కావాలి. కానీ ఇంట్లో పరిస్థితి దీనంగా ఉంది. పాఠ్య పుస్తకాలు కొనడానికే స్థోమత సరిపోదు. ఇక ఫీజులెలా కట్టాలి, కళాశాలకు ఎలా వెళ్లాలి. ఉన్నత చదువు నాలాంటి వాడికి అందని దూరం’. ఇదీ గతంలో ఓ పేద విద్యార్థి సంశయం. ‘నా బిడ్డ అందరిలా పెద్ద చదువు చదవాలి. ఇన్‌షర్ట్,టై, బూట్లు ఏసుకోవాల. నాకేమో కూలి ఆడితే గానీ ఇంట్లో కుండ ఆడదు. ఇక నేనేం చేయగలను. ఆడ్నీ నాలాగే ఏ కూలికోనాలికో పంపేయాల’ ఇదీ గతంలో ఓ పేద విద్యార్థి తండ్రి దయనీయ ఆలోచన. ఇలా పేదలు ఆలోచనల సుడిగుండంలో ఉన్నప్పుడే వారికి వైఎస్ రాజశేఖర రెడ్డి అనే దిక్సూచి ఆశాదీపంలా దర్శనమిచ్చింది. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను ఉచితంగా అందించాలన్న ఉద్దేశ్యంతో మహానేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఫీజు రీ యింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి దిగ్విజయంగా అమలు చేశారు. దీంతో ఎంతో మంది పేద విద్యార్థుల ఉన్నత విద్య కలలు సాకారమయ్యాయి. అయితే ప్రస్తుతం ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం తీరుతెన్నులను పరిశీలిస్తే..
విజయనగరం అర్బన్: ఇంటర్ నుంచి పీజీ, వృత్తి విద్యల వరకు పేద విద్యార్థులు ఏ ప్రైవేటు విద్యాసంస్థలోనైనా చదవగలిగే విధంగా ఫీజులను రీయింబర్స్‌మెంట్ రూపంలో ఆయా విద్యాసంస్థలకు నేరుగా చెల్లించే విధానాన్ని 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టారు. దీని వల్ల గత ఏడాది వరకు సుమారు మూడు లక్షల మంది పేద విద్యార్థులు ఇంజినీరింగ్, మెడిసిన్, ఫార్మసీ వంటి వృత్తి విద్యలతోపాటు వివిధ రకాల ఉన్నత విద్యను చదవగలిగారు. ఫీజు రీ యింబర్స్‌మెంట్ పథకం ఉద్దేశ్యాన్ని అమలు చేయడంలో ప్రస్తుత ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది.
తాజాగా గత విద్యాసంవత్సరాన్ని పూర్తిచేసుకున్న 59,303 మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్‌మెంట్స్ ఇవ్వకపోవడం వల్ల ఇటు విద్యార్థులతో పాటు, అటు విద్యాసంస్థలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. మరో వైపు ఫీజులు చెల్లించలేదని విద్యాసంవత్సరాన్ని పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉత్తీర్ణత ధ్రువపత్రాలను ఇవ్వకుండా పలు విద్యాసంస్థలు ఇబ్బందులు పెడుతున్నాయి. ఆయా కళాశాలల నుంచి ఉన్నత విద్యలకు వెళ్లాల్సిన విద్యార్థులకు మార్కుల మెమోలు తప్ప ప్రొవిజినల్స్ ఇవ్వడం లేదు. విద్యాసంవత్సరం పూర్తయి ఆరు నెలలు దాటుతున్నా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు ప్రభుత్వం చేయకపోవడం వల్ల ప్రొవిజినల్స్ కావాల్సిన పేద విద్యార్థి అప్పులు చేసి కళాశాలలకు చెల్లిస్తున్నాడు.
జిల్లా వ్యాప్తంగా గడచిన ఏడాదికి 59,450 మంది విద్యార్థుల వరకు మంజూరైతే 59,303 మంది బీసీ విద్యార్థులు మాత్రమే రిజిస్టర్ అయ్యారు. అదనంగా మరో 4,577 మంది ఈబీసీలు కూడా రిజిస్టర్ చేసుకున్నారు. వీరికి రీయింబర్స్ మెంట్ నిధుల(ఆర్‌టీఎఫ్) రూపంలో సుమారు రూ.45 కోట్లు రాష్ట్రబడ్జెట్ నుంచి జిల్లాకు అనుమతి లభించింది. గత ఏడాది చివరిలో మరో రూ.9.91 కోట్ల నిధులు అవసరమని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. అయితే దానికి అనుమతి రాలేదు. విద్యాసంస్థలకు నేరుగా ఇచ్చే రీయింబర్స్‌మెంట్ జిల్లాలోని ఇంజినీరింగ్, ఫార్మశీ, పీజీ వంటి వృత్తి కోర్సుల డిగ్రీ విద్యాసంస్థలకు ఇవ్వాల్సిన నిధులు ఇప్పటికే పంపిణీ చేశారు. అయితే ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలకు ఇంకా రూ.12 కోట్ల వరకు నిధులు విడుదల కాలేదు. దీంతో ఇటు విద్యాసంస్థలు, అటు విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
నిధుల జాప్యంతో మానసిక ఆందోళన
అమ్మా, నాన్నా లేరు. పెదనాన్న చదివిస్తున్నారు. ఫీజురీయింబర్స్‌మెంటు వస్తుందనే ఆశతో ఇంటర్మీడియట్‌లో జాయిన్ అయ్యా ను. ద్వితీయ ఇంటర్మీడియట్‌లోకి వచ్చి ఆరు నెలలు దాటుతోంది. ఇంతవరకు ఫీజు చెల్లించ కపోవడం వల్ల మానసికంగా ఆందోళన పడుతున్నాం. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే ఎలా చదవాలో ఆర్థం కావడం లేదు.
-కే.సురేష్,
ద్వితీయ ఇంటర్, అన్నంరాజుపేట, జామి.
పేద విద్యార్థులకు అన్యాయం చేయొద్దు
ఉన్నత చదువులు చదవడానికి అవకాశం కల్పిస్తున్న ఫీజు రీయింబర్సుమెంట్ పథకాన్ని నీరుగార్చడానికి ప్రయత్నించి పేద విద్యార్థులకు అన్యాయం చేయొద్దు. గతంలో మాది రిగా ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేసి ఇటు విద్యాసంస్థల యాజమాన్యాలు, అటు విద్యార్థులు ఇబ్బంది పడకుండా చూడాలి. పేద విద్యార్థులను ప్రోత్సహించాలి.
-కె.చలపతిరావు, ద్వితీయ ఇంటర్,
విలాస్కన్ పాలెం, పద్మనాభం.
పథకాన్ని నీరుగార్చడానికే జాప్యం
పేద విద్యార్థులను పైచదువులకు ప్రోత్సహించేందుకు దోహదపడే ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగార్చవద్దు. ప్రభుత్వ కళాశాలలను విస్తరించకుండా ఇలా మధ్యంతరంగా వదిలేస్తే భారీ ఫీజులతో ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుకోలేక ఉన్నత విద్యకు పేద విద్యార్థి దూరమవుతాడు. ప్రభుత్వ వ్యవహారం మారకపోతే ఉద్యమాలు తప్పదు.
-ఎస్.గణేష్,
ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ నాయకుడు
ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం అమలైనప్పటి నుంచి కేటాయించిన నిధులు- సద్వినియోగించుకున్న విద్యార్థుల వివరాలు
సంవత్సరం నిధులు విద్యార్థులు
2008-09 18కోట్లు 28,570
2009-10 21కోట్లు 50,400
2010-11 52.5కోట్లు 61,401
2011-12 60.9 కోటు 71,278
2012-13 65.1కోట్లు 83,188
2013-14 45.9 కోట్లు 64,180