
మృత్యుకీలలు
కోనసీమవాసులకు సుఖసంతోషాలను ఇవ్వకపోగా వారి పాలిట ఇప్పుడు పెనుగండంగా మారింది ఆ గడ్డ గర్భంలోని సంపద. కలుగుల్లోని కాలనాగుల్లా ఆ గడ్డ పొరల్లో విస్తరించిన గ్యాస్ పైపులైన్లలో ఒకటి విస్ఫోటించి 15 నిండు ప్రాణాలను బలి తీసుకుంది. మరో 27 మందిని మృత్యువు పిడికిట్లో ఇరికించింది.
- నేలలోని గొట్టాలే.. కాలయముని హస్తాలు
- తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో విరుచుకుపడ్డ చిచ్చు
- 15 మంది సజీవ దహనం
- మరో 27 మందికి గాయాలు
- 15 మంది పరిస్థితి విషమం
సాక్షి, కాకినాడ/ మామిడికుదురు : చెలరేగిన అగ్నికీలల నడుమ చిక్కుకున్న అమాయకులు కార్చిచ్చులో మొలకల్లా మాడిపోయారు. మాంసపు ముద్దల్లా మిగిలారు. కొందరు.. జరుగుతున్నది నిజమో, పీడకలో తెలియకుండా నిద్రలోనే కన్నుమూశారు. మామిడికుదురు మండలం నగరం గ్రామంలో శుక్రవారం ఉదయం 5.10 గంటల సమయంలో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్)కు చెందిన ట్రంక్ పైపులైన్ పేలిన ఘటనలో గతంలో ఎన్నడూలేని రీతిలో భారీగా ప్రాణనష్టం సంభవిం చింది.
చమురు సంస్థల తీరుపై ఆగ్రహోదగ్రులైన బాధితులు గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్‌ను ముట్టడించి వాహనాలను ధ్వంసం చేశారు. పరామర్శకు వచ్చిన కేంద్ర పెట్రోలియం శాఖ సహాయమం త్రి ధర్మేంద్ర, ముఖ్యమంత్రి చంద్రబాబు , హోం మంత్రి చినరాజప్పను చుట్టుముట్టి చమురు సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అధికారుల నిర్లక్ష్యానికి ప్రాణాలు మూల్యం
గెయిల్ నుంచి విజయవాడ ల్యాంకో విద్యుత్ ప్రాజెక్టుకు గ్యాస్ సరఫరా చేసే ట్రంక్ పైపులైన్ నగరం సమీపంలో వాడ్రేవుపల్లి మీడియం డ్రైన్‌ను ఆనుకుని పైపులైన్ జాయింట్ వద్ద జరిగిన ఈ విస్ఫోటం పెను విధ్వంసాన్ని సృష్టించింది. పైపులైన్ పేలడంతో ఎగసిపడిన గ్యాస్ ఆ ప్రాంతమంతా ఆవరించింది. నిద్రలో ఉన్న జనం ఏం జరిగిందో గ్రహించేలోపే అగ్నికీలలు విరుచుకు పడ్డాయి.
జాయింట్ వద్ద పైపులైన్‌లీకైన సమయంలో గ్యాస్ మాత్రమే ఎగజిమ్మిందని, వరుసగా రెండుసార్లు సంభవించిన పేలుడుతో గ్యాస్ రాపిడికి గురై మంటలు వ్యాపిం చాయని స్థానికులు చెబుతున్నారు. లీకై న గ్యాస్ ఎగజిమ్ముతూ, పరిసరాల్లో కమ్ముకుంటున్న సమయంలోనే స్థానికులెవరో పొయ్యి వెలిగించడం వల్ల ఈ ప్రమాదం సంభవించి ఉంటుందనే వా దన కూడా వినిపిస్తోంది. పేలుడుతో మంటలు బ్లో అవుట్ సంభవించినప్పటి లా 30 నుంచి 40 మీటర్ల ఎత్తున ఎగసి పడ్డాయి.
మూడు నెలల క్రితం ఇదే ప్రాంతంలో పైపులైన్ లీకైనా అధికారులు మొక్కుబడి చర్యలు మాత్రమే చేపట్టడంతో.. అందుకు మూల్యాన్ని అమాయకులు చెల్లించాల్సి వచ్చింది. పేలుడు ధాటికి పది అడుగుల గొయ్యి ఏర్పడగా పైపులైన్‌పై కప్పిన గ్రావెల్ 200 మీటర్ల మేర చెల్లాచెదురుగా పడింది. పదికి పైగా అగ్నిమాపక శకటాలు 3 గంటల పాటు శ్రమించడంతో మంటలు అదుపులోకి వచ్చినా.. రాత్రి వరకూ భూమిలోం చి పొగలు, వేడిగాలులు వస్తూనే ఉన్నా యి. అధికారులు స్పందించకపోయినా గ్రామస్తులే సహాయ, పునరావాస చర్య ల్లో నిమగ్నమయ్యారు. మంటలను అదుపు చేయడంతో పాటు మృతులను, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడంలో చురుగ్గా పాల్గొన్నారు.