17 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం
Published Thu, Dec 5 2013 3:10 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
ఏటీఅగ్రహారం (గుంటూరు), న్యూస్‌లైన్: ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ పథకం ప్రకారం అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు బుధవారం సీజ్‌చేశారు. లారీలో ఉన్న 17 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీకి తోడుగా ముందు వెళుతున్న కారును కూడా సీజ్‌చేశారు. బాధ్యులైన ఆరుగురిపై 6ఏ, క్రిమినల్‌కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి విజిలెన్స్ ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి తన కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల సరిహద్దు ప్రాంతమైన చిలకలూరిపేట, మార్టూరు సమీప గ్రామాల్లో రేషన్ బియ్యాన్ని సేకరించి తూర్పుగోదావరి జిల్లా మండపేటకు తరలించేందుకు లారీ బుధవారం తెల్లవారుజామున చిలకలూరిపేట నుంచి బయలుదేరింది.
ఉదయం మంగళగిరి మండలం కాజ టోల్‌ప్లాజా వద్ద విజిలెన్స్ అధికారులు వాహనాలను తనిఖీచేశారు. లారీలో రేషన్ బియ్యం తరలి వెళుతున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. లారీ ముందు దీనికి అనుబంధంగా వెళుతున్న కారును గుర్తించి సీజ్‌చేశారు. రెండు వాహనాలను గుంటూరు విజిలెన్స్ కార్యాలయానికి తరలించారు. 17టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ళకు చెందిన దర్శి సుధీర్, చిలకలూరిపేటకు చెందిన ఏరువ సుబ్బారావు, లారీ డ్రైవర్ చిలకాబత్తిని పూర్ణచంద్రరావు, క్లీనర్ ఆరికట్ల చంద్రమౌళి, లారీ యజమాని ప్రసాద్‌లపై 6 ఏ, క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ ఎస్పీ తెలిపారు. తనిఖీల్లో సీఐ కిషోర్‌బాబు, తహశీల్దార్ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.
రెండిళ్లలో 35 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
రవ్వారం(నూజెండ్ల): రెండు నివాస గృహాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 70 బస్తాల రేషన్ బియ్యాన్ని రవ్వారం గ్రామంలో రెవెన్యూ అధికారులు బుధవారం పట్టుకున్నారు. గ్రామంలోని రెండిళ్లలో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారని స్థానికులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఆదేశాలమేరకు తహశీల్దార్ పి.నాగేశ్వరరావు, సీఎస్‌డీటీ జాన్‌కుమార్‌లు అక్కడకు వెళ్లి నిల్వ ఉంచిన బియ్యాని స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన భవనాశి నాగయ్య ఇంటిలో 40 టిక్కీలు, కందుల రాంబాబు ఇంటిలో 30 టిక్కీలు నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడిన బియ్యం 35 క్వింటాళ్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బియ్యం నిల్వ ఉంచిన ఇళ్ల యజమానులపై 6ఏ కేసులు నమోదుచేసినట్లు చెప్పారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం వివరాలు తెలియజేస్తామన్నారు. సీజ్ చేసిన బియ్యాన్ని వీఆర్వో భుజంగరావుకు అప్పగించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ నరసింహారావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement