తుపాన్ సహాయక చర్యల్లో 19 బృందాలు
కాకినాడ: హుదూద్ తుఫాన్ సహాయకచర్యల్లో పాల్గొనేందుకు 19 బృందాలు సిద్ధమయ్యాయి. శనివారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయకచర్యల్లో పాల్గొనేందుకు సన్నద్ధమవుతున్నాయి. శ్రీకాకుళంలో రెండు, విజయనగరంలో ఒక బృందం , విశాఖలో 6, తూర్పు గోదావరి జిల్లాలో 6 బృందాలు ఉన్నట్లు ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ ప్రశాంత్ దార్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మరో 4 బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు.
విశాఖ, విజయనగరం, తూ.గో జిల్లాలోని ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు శాటిలైట్ ఫోన్లు ఇచ్చామని ప్రశాంత్ తెలిపారు. ఇదిలా ఉండగా తుపాన్ తీరం దాటే సమయంలో ఇళ్ల నుంచి ఎవరు కూడా బయటకు రావొద్దని జిల్లా కలెక్టర్ నీతూకుమార్ ప్రసాద్ హెచ్చరించారు. ప్రయాణాలు చేసే వారు వాటిని వాయిదా వేసుకోవాలని విజ్క్షప్తి చేశారు. ఆదివారం ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలతో పాటు, కాలేజీలకు సెలవు ప్రకటించామన్నారు. ప్రజలను తరలించేందుకు 72 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. తీర ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వేగంగా తరలిస్తున్నట్లు తెలిపారు.
కొంత మంది ప్రజలు తమ ప్రాంతం నుంచి వెళ్లేందుకు నిరాకరిస్తున్నారని వారి బలవంతంగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. రేపు సాయంత్రానికల్లా మరో 50 వేల మందిని తరలిస్తామన్నారు. తుపాన్ తీరం దాటాకా 12 గంటలపాటు ప్రభావం ఉండటం చేత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకూ ఐదు జిల్లాల నుంచి 5 లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇచ్చాపురం-పాయకరావు పేట ఎన్ హెచ్-5 రహదారిని తాత్కాలికంగా మూసివేశారు.