ముక్కాంలో పాడైన తుపాను షెల్టర్
తుఫాన్ వస్తే అంతే!
Published Thu, Sep 8 2016 12:05 AM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM
వెక్కిరిస్తున్న వ్యవస్థలో లోపాలు
పాడైన తుఫాన్ షెల్టర్లు
నిధులివ్వని ప్రభుత్వం
అండర్‌గ్రౌండ్ విద్యుత్ లైన్లు ఊసేలేదు
మెరుగుపడని సమాచార వ్యవస్థ
విజయనగరం గంటస్తంభం:
తుఫాన్లు సంభవిస్తే మనకు రక్షణ కల్పించే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. హుద్‌హుద్‌లాంటి పెనువిపత్తు సంభవించి జిల్లా అతలాకుతలమైనా మనం ఇంకా గుణం పాఠం నేర్వలేదు. అందుకు తగ్గ వ్యవస్థను రూపొందించుకోలేదు. దీనిపై సర్కారు దష్టిసారించలేదు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల ప్రభావం జిల్లాపై ఉంది. ఈ నెలతో వర్షాకాలం ముగుస్తుంది. ఈశాన్య రుతుపవనాలు వస్తాయి. ఈ క్రమంలో ఆక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు తుఫాన్లు రావడం పరపాటి. గత అనుభవాలు పరిశీలిస్తే ఈ మూడు నెలల్లో పదులసంఖ్యలో తుఫాన్లు వచ్చాయి. ఇందులో భీకరమైనవీ ఉన్నాయి. హుద్‌హుద్ కూడా 2014 ఆక్టోబర్‌లో వచ్చిందే. మళ్లీ అలాంటివి సంభవిస్తే మనం తట్టుకునే స్థితిలో లేమన్నది స్థానికుల భావం.
తుఫాన్ షెల్టర్లు ఆధునీకరణ ఏదీ?
తుఫాన్లు వస్తే తొలుత తీరప్రాంత వాసుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ఇందుకు తుఫాన్ షెల్టర్లు అవసరం. ప్రస్తుతం తీరప్రాంతమైన భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో సరైన షెల్టర్లు లేవు. జిల్లాలో 14 శాశ్వత తుపాను షెల్టర్లు ఉన్నా... దాదాపు అన్నీ శిధిలావస్థకు చేరుకున్నాయి. గత ప్రభుత్వం ఏడు బహుళ ప్రయోజన తుపాను షెల్టర్లు నిర్మించింది. ఇందులో నాలుగు పూర్తికాగా మరో మూడు నిర్మాణంలో ఉన్నాయి. మిగతా ఏడు శిధిలాలుగా ఉన్నాయి. వీటికోసం ప్రతిపాదనలు పంపినా ప్రస్తుత ప్రభుత్వం స్పందించనే లేదు. ఇప్పుడు జిల్లాలోని 31 తాత్కాలిక భవనాలైన పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో తుపాను షెల్టర్లు నడుస్తున్నాయి. వీటికీ తలుపులు, కిటికీలు లేకపోవడం, విద్యుత్, తాగునీరు సక్రమంగా లేకపోవడంతో మరమ్మతులకు రూ.6.83కోట్లుతో అధికారులు ప్రతిపాదనలు పంపారు. దానికీ గతి లేదు.]
సమాచార వ్యవస్థ లోపభూయిష్టం
జిల్లాలో సమాచార వ్యవస్థ లోపభూయిష్టంగా ఉంది. హుద్‌హుద్ సమయంలో అంత చేస్తాం... ఇంత చేసేస్తాం అని ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రుల వరకూ చేసిన హామీలు అమలు కాలేదు. సమర్థంగా పని చేసే వైర్‌లెస్ నెట్‌వర్కు తీరప్రాంతంలో పూర్తిగా విస్తరించలేదు. విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఈదురు గాలుల్ని తట్టుకునే విద్యుత్ వైర్లు, స్తంభాలు ఇంకా వేయలేదు. అండర్ గ్రౌండు విద్యుత్ లైన్లు వేస్తామని అప్పట్లో ప్రకటించినా జిల్లాలో అమలు జరగలేదు. నెలకోసారైనా జిల్లా విపత్తుల నిర్వహణ కమిటీ సమావేశం కావాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనల్లో ఆచరణ లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే మళ్లీ ఇబ్బందులు తప్పవని అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.
Advertisement
Advertisement