హుద్‌హుద్ నిధులు వారికి కలిసొచ్చాయి... తోటపల్లి కాలువ ఎలాగూ ఉండనేఉంది... అధికారం అండగా నిలిచింది... నామినేటెడ్ పనులు కావడంతో ఆడిట్ భయం లేదు. ఇంకెందుకాలస్యం... ఒక్క పనికి రెండేసిబిల్లులు చేసేసుకుంటున్నారు... హాయిగా నిధులు కొల్లగొట్టేస్తున్నారు.
పాలకొండ: తోటపల్లి ఎడమ కాలువ పరిధిలో వీరఘట్టం, పాలకొండ, బూర్జ మండలాల్లో 60వేల ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది. కాలువను నిర్లక్ష్యంగా వదిలేయడంతో శివారు భూములకు నీరందక రైతులు అవస్థలు పడుతున్నారు. కాలువ ఆధునికీకరణ చేస్తామంటూ హామీ ఇచ్చిన నేతలు అధికారంలోకి వచ్చినా దానిని పట్టించుకోలేదు. ఇంతలో హుద్‌హుద్ వచ్చింది. దీనిపేరుతో దండిగా నిధులు మంజూరయ్యాయి. ఈఅవకాశాన్ని అధికార పార్టీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. హుద్‌హుద్ వల్ల కాలువలు పాడయ్యాయని, నిధులు మంజూరు చేయాలని నీటి పారుదల శాఖ ద్వారా ప్రతిపాదనలు చేశారు. ఇటీవల కాలువ మరమ్మతుల కోసం రూ.43 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులను 12 పనులకు కేటాయించి కాలువల్లో పూడికతీత పనులు జరిపిస్తున్నారు.
పనులు పంచుకున్నారు...
వాస్తవానికి విడుదలైన నిధులతో పనులు టెండరు విధానం ద్వారా చేపడితే పర్యవేక్షణ ఉండేది. అలా కాకుండా కాలువను భాగాలుగా విభజించారు. ఒకే కాలువపై జరుగుతున్న పనులను హద్దులుగా విభజించి పనులు పంచి పెట్టారు. ప్రతిపనీ రూ.5 లక్షలలోపు ఉండేలా చూసుకుని అధికార పార్టీకి చెందిన నాయకులకు గుత్తాధిపత్యం అప్పగించారు. జేసీబీతో నామ మాత్రంగా పనులు జరిపించి నిధులు కాజేసేలా పక్కా ఏర్పాట్లు చేశారు. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు ఉన్నత స్థాయి నాయకుల ఆదేశాలకు తలొగ్గి పనులు పంపకానికి పచ్చ జెండా ఊపారు. పనులపై పర్యవేక్షణ కూడా లేకుండా నిధులు చెల్లించే పనిలో నిమగ్నమయ్యారు.
పని ఒకటే... బిల్లులు రెండు
తోటపల్లి కాలువలపై నవగాం నుంచి ఆట్టలి వరకు మూడు కిలో మీటర్ల పరిధిలో ఇటీవల ఉపాధి హామీ పనులు జరిపించారు. ఇందు కోసం రూ.2.83 లక్షలు వేతనాలుగా కూలీలకు చెల్లించినట్టు ఉపాధి రికార్డులు తెలియజేస్తున్నాయి. ఆదే చోట నీరు - చెట్టు కార్యక్రమం పేరుతో కాలువ మరమ్మతుల కోసం నీటి పారుదలశాఖ రూ.4.70 లక్షలు నిధులు కేటాయించింది. పనులు జరిగిన చోటే నిధులు కేటాయించటం వెనుక అంతర్యమేమిటన్నది అధికారులకే తెలియాలి. ఓ వైపు ప్రభుత్వం నిధులే ఖర్చు చేసి పనులు జరిపిస్తే ఆదే చోట నీరు - చెట్టు కార్యక్రమం ద్వారా పనులు జరిపించినట్టు చూపిస్తున్నారు. ఇదే కాలువపై హుద్‌హుద్ తుపాన్ నిధులతో కూడా పనులు జరుగుతున్నాయి. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. కేవలం అదికార పార్టీ నేతలు జేబులు నింపేందుకు ఈ నిధులు కేటాయించారని బహిరంగంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై నీటి పారుదలశాఖ డీఈఈ గనిరాజు వద్ద ప్రస్తావిస్తే ఉపాధి పనులు కూలీలు జరిపారని, తాము యంత్రాలతో పని చేయిస్తామని చెబుతుండటం గమనార్హం.
అడ్డగోలు దోపిడీ
Published Wed, May 20 2015 1:07 AM | Last Updated on Sun, Sep 3 2017 2:19 AM
Advertisement
Advertisement