ఇంకెంత కాలం నిరీక్షించాలి?
హుద్‌హుద్ తుపాన్ వచ్చి అక్టోబర్ 12కి ఏడాది కావస్తుంది. ఉత్తరాంధ్రనూ, ప్రధానంగా విశాఖ నగరాన్నీ రూపు రేఖలు లేకుండా చేసిన ప్రకృతి వైపరీత్య మిది. కానీ సంవత్సరం గడిచిపోయినా విశాఖ నగరంలోని ఒక్క మురికివాడలో కానీ, మత్స్యకారులున్న ప్రాంతంలో కానీ పూర్తిస్థాయి సహాయం ప్రభుత్వం నుంచి అందలేదు. ప్రజల పక్షాన పాలన నిర్వహించే ప్రభుత్వాలు ముందు ప్రజల దగ్గరకు వెళ్లి, సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలి. కాని అలాంటిదేమీ జరగలేదు. ఇప్పటికైనా ఈవెంట్లూ, ఉత్సవాలూ ఆపి విశాఖనగరంలోని మురికివాడల్లో నివసిస్తున్న ప్రజల, మత్స్య కారుల బాధలూ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో హుద్‌హుద్ వల్ల నష్టపోయిన ప్రజల సమస్యలూ తెలుసుకోవడానికి వారి వద్దకు వెళ్లాలి. తుపాను తర్వాత సర్వేలు నిర్వహించిన ప్రభుత్వం ఇప్పటి వరకూ తమకు సరిగ్గా నష్టపరిహారం అందజేయలేదని ప్రజలు రోదిస్తుంటే వారి సమస్యల గురించి పట్టించుకోకుండా వేడుకలు నిర్వహించు కోవడం సబబుకాదు.
హుద్‌హుద్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటా యించిన కోట్లాది రూపాయలూ, దేశ విదేశాల్లోని దాతలు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసిన కోట్లాది నిధులూ దేనికి వెచ్చించారు? ఆ మొత్తాలేవీ నగరంలోని పేదలకు మాత్రం అందలేదు. ఆ సహా యక నిధుల పద్దుల మీద అకౌంటెంట్ జనరల్ చేత ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలి. దీని మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. అసెంబ్లీలో, ప్రజల మధ్య చర్చకు పెట్టాలి. హుద్‌హుద్‌లో ఒక్క ఎలక్ట్రిసిటీ విభాగం తప్ప మరే ఇతర శాఖలూ ప్రజలకు సేవ చేయడం కనిపించలేదు. పైగా తుపాను వల్ల ప్రజలు బాధపడుతుంటే మురికివాడల్లో ఇళ్లను అధికారులు పీకేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇది అప్రజాస్వామికం.
హుద్‌హుద్‌ను మించిన తుపానులు వచ్చినా తట్టుకునే స్థాయిలో పేదలకూ, మత్స్యకారులకూ, మురికివాడలలోని ప్రజ లకూ వారు ప్రస్తుతం నివసిస్తున్న చోటే పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. ఇంతవరకూ అనేక పర్యాయాలు ప్రజలు వినతి పత్రాలు అందజేసినా, ధర్నాలు నిర్వహించినా ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పటికైనా స్పందించి పక్కాఇళ్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజనా పథకంలో స్థానికంగా వ్యక్తిగత పక్కా గృహాలు నిర్మించాలి.
హుద్‌హుద్ సంభవించిన సమయంలో ప్రభుత్వం అందించే సహాయం కంటే అనేక స్వచ్ఛంద సంస్థలూ, వ్యక్తులూ ప్రభుత్వా నికి రూ. 260 కోట్ల మేర సహాయ నిధి అందించారు. ఈ నిధులతో ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు ప్రభుత్వమే ప్రకటించింది. కాని అమలు జరపకపోవడం అన్యాయం. నగరంలో లక్ష ఇళ్లకు పైగా ధ్వంసం అయినట్లు అధికారులు సర్వే చేశారు. కానీ నష్టపరిహారం అందించలేదు. తోపుడుబండ్లు, ఆటోలు నడిపేవారికీ, ఇతర వృత్తులు చేసే వారికీ కూడా ఇంకా నష్టపరిహారం చెల్లించలేదు. తుపానులో నష్టపోయిన కొద్ది మంది బోటు యజమానులకు మినహా అత్యధికంగా మత్స్యకారులకు నేటికీ పరిహారం చెల్లించ లేదు. చేపలు అమ్ముకునే చాలా మంది మహిళలకు సొసైటీల రిజిస్ట్రేషన్ లేదన్న మిషతో నష్టపరిహారం చెల్లించలేదు. గ్రామీణ ప్రాంతంలోని రైతులు, గిరిజన ప్రాంతంలో పంటలు కోల్పోయిన వారిలో సగానికి పైగా ఇప్పటికీ నష్టపరిహారానికి నోచుకోలేదు.
ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరగడం వలన, సముద్రం ఇంకా ముందుకు వచ్చే అవకాశం ఉంది. అది దృష్టిలో పెట్టుకుని సముద్రం దగ్గర సీఆర్‌జెడ్ పరిధిని 500 మీటర్ల నుంచి, ఒక కిలో మీటరుకు పైగా పెంచవలసి వస్తుంది. ఆ పరిధిలో కట్టడాలకు అనుమతులు ఇవ్వకూడదు. సీఆర్‌జెడ్ పరిధిలో బోర్ బావులు తవ్వడం చట్టాన్ని ఉల్లంఘించడమే. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా అటువంటి బోర్ బావులను మూసివేయాలని జిల్లా యంత్రాం గాన్ని ఆదేశించారు. కాని చాలా 5-స్టార్ హోటళ్లు ఈ ఆదేశాన్ని ఉల్లంఘించడం వలన సముద్రంలోని ఉప్పదనం భూగర్భ జలా లలోకి ప్రవేశించింది. హుద్‌హుద్ తరువాత, మునిసిపల్ నీళ్లకు అంతరాయం వచ్చినప్పుడు, ప్రజలకు భూగర్భ జలాలను విని యోగించే అవకాశం లేకపోయింది. సీఆర్‌జెడ్ నిబంధనలను పూర్తిగా అమలు చేయడం తక్షణ అవసరం.
విశాఖ తీరప్రాంతంలో ఉన్న 146 సైక్లోను షెల్టర్లను పునరు ద్ధరించే పనిని కూడా వెంటనే చేపట్టాలి. అంతేకాక అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం సైక్లోను షెల్టర్లను తీర్చిదిద్దాలి.
ఆంధ్ర కోస్తా తీరమంతా ఒకప్పుడు దట్టమైన అడవులతో నిండి ఉండేది. అలాగే మేఘాద్రిగెడ్డ సముద్రంలో కలిసే ప్రాంతం నుంచి ఎగువన మన జాతీయ రహదారి వరకూ మడ అడవులు ఉండేవి. ప్రస్తుతం వాటిని తొలగించుకుంటూ పోతున్నారు. అది ఆపాలి. 1977లో దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు, ఈ మడ అడ వులే ఎన్నో గ్రామాలకు రక్షణ కవచాలుగా నిలిచాయి. అభివృద్ధి పేరుతో జరుగుతున్న ధ్వంస రచనలో ఈ మడ అడవులు రూపురేఖలు లేకుండా ధ్వంసం అయ్యాయి. హుద్‌హుద్‌ను దృష్టిలో పెట్టుకొని మిగిలి ఉన్న మడ అడవులను కాపాడుకోవడం, అక్కడ మిగిలిన చిత్తడి భూములలో మడ అడవులను పెంచడం, తీర ప్రాంతాలలో సరుగుడు, మొగలి వంటి చెట్లను పెంచడం, అభి వృద్ధి ప్రణాళికలో ఒక ముఖ్య అంశంగా చేసుకోవాలి.
అలాగే ఇప్ప టికైనా విశాఖ నగరంలో సర్వే చేస్తే హుద్‌హుద్ ధాటికి తట్టుకొని ఏయే వృక్షాలు నిలిచి ఉన్నాయో అటువంటి వృక్షాలనే సిటీ పరి ధిలో నాటాలి. ఒక్కొక్కదానికి వేల రూపాయల వంతున వెచ్చించి రాయల్ ఫామ్ వంటి మొక్కలు తెచ్చి వేయడం వల్ల ఏ మాత్రం ఉపయోగం ఉండదు. జీవిఎంసీ నుంచి యూసీడీ నిధులు 40 శాతం వెచ్చించి అన్ని మురికివాడల్లోనూ, మత్స్యకారులు నివసిస్తున్న గ్రామాల్లోనూ అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలూ కల్పించాలి. ఒకే చోట ఎన్నో పరిశ్రమలు పెట్టడం వలన వాతావరణంలో పెరిగే ఉష్ణోగ్రతల వలన హుద్‌హుద్‌ను మించి తుపానులు ఆ ప్రాంతానికి వచ్చే ప్రమాదం బాగా పెరుగుతుందని శాస్త్ర పరిశోధ నలు చెబుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని పారిశ్రామిక విధా నంలో మార్పుతేవాలి.
(వ్యాసకర్త భారత ఆర్థిక, ఇంధన వనరుల శాఖ
విశ్రాంత కార్యదర్శి) మొబైల్: 98660 21646
- ఇ.ఎ.ఎస్.శర్మ