వాటిని ఎందుకు వదిలేశారు? | Compensation for damages caused by natural disasters | Sakshi
Sakshi News home page

వాటిని ఎందుకు వదిలేశారు?

Published Sun, Apr 24 2016 1:54 AM | Last Updated on Sun, Sep 3 2017 10:35 PM

Compensation for damages caused by natural disasters



 2014 అక్టోబర్ 12... ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పటికీ మరచిపోలేని రోజు. నాడు హుద్‌హుద్  సృష్టించిన విలయం అలాంటిది మరి. చెట్లు కూలాయి. ఇళ్లు నేలమట్టమయ్యాయి. పంటలు జలమయమయ్యాయి. రహదారులు ఛిద్రమయ్యాయి. జనజీవనం అతలాకుతలమైంది. ఆ పరిస్థితినుంచి తేరుకునేందుకు ఎన్నో రోజులు పట్టింది. నాడు ఎంతోమంది తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికీ ఎంతోమంది ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోయారు. సర్కారు పరిహారం మాత్రం కొందరికే అందింది. చాలా ఇళ్లను అధికారులు పట్టించుకోలేదు. దీనిని మానవహక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణించింది.
 
 విజయనగరం కంటోన్మెంట్: ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించిన నష్టాలకు ఇచ్చే పరిహారాన్ని అందించడంలోనూ... బాధితులను గుర్తించడంలోనూ జరిగిన అన్యాయానికి అధికారులు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. బాధితులు పదేపదే తమకు న్యాయం చేయాలని వేడుకున్నా పట్టించుకోని అధికారుల తీరుపై అందిన ఫిర్యాదు మేరకు మానవ హక్కుల సంఘం రంగంలోకి దిగింది. తుఫాన్ బాధితులను గుర్తించడంలో ఎందుకు అలసత్వం వహించారంటూ జిల్లా అధికారులకు నోటీసులు అందడంతో ఇప్పుడు ఆయా మండలాల తహసీల్దార్లకు ఆయా నోటీసులను పంపించి రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరుతున్నారు.
 
 అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన హెచ్‌ఆర్‌సీ
 జిల్లాలో 2014 అక్టోబర్ 12న సంభవించిన పెనుతుఫాన్ వల్ల జిల్లా ప్రజలు ఇళ్లను కోల్పోయారు. కూలిన ఇళ్లను గుర్తించడంలో అధికారుల నిర్లక్ష్యాన్ని మానవ హక్కుల సంఘం(హెచ్‌ఆర్‌సీ) తీవ్రంగా ప్రశ్నించింది. జిల్లా వ్యాప్తంగా వేలాది ఇళ్లు నేలమట్టమయితే కేవలం ఉద్దేశపూర్వకంగా కొన్ని ఇళ్లను చేర్చలేదని జిల్లా నుంచి వెళ్లిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసింది. డి లెస్లీ మార్టిన్ కేసును స్వీకరించారు. దీనికి సంబంధించి జిల్లా అధికారులకు నోటీసు ఇచ్చారు. గతంలో ఈ కేసుపై పూర్తిగా స్పందించని అధికారులకు రెండు రోజుల్లో పూర్తి వివరణ ఇవ్వాలని కోరుతూ ఎన్యూమరేషన్‌పై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలంటూ నోటీసు ఇచ్చారు.
 
 రాజకీయ కారణాలేనా?
 జిల్లాలో సుమారు 18వేల ఇళ్లకు పైగా నేలమట్టమయినట్టు గుర్తించి పరిహారాన్ని పంపిణీ చేసిన యంత్రాంగం ఐదు మండలాల్లో వందలాది ఇళ్లు కూలినా రాజకీయంగా వాటిని పక్కన పెట్టేశారని జిల్లాకు చెందిన వారు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ, గంట్యాడ, విజయనగరం మండలాల్లోని 652 ఇళ్లను గుర్తించలేదని సంబంధిత వ్యక్తులు ఫిర్యాదు చేశారు. దానిని స్వీకరించిన మానవ హక్కుల సంఘం పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని కలెక్టర్ కార్యాలయానికి నోటీసు పంపించింది. గతంలోనూ ఒకసారి వివరణ ఇవ్వాలని కోరినప్పుడు ఈ ఎన్యుమరేషన్‌ను ఇతర జిల్లాలకు చెందిన వారు చేపట్టారని సూత్రప్రాయంగా తెలియజేసి ఊరుకున్నారు. అయినా పూర్తి వివరాలను ఇవ్వనందున మళ్లీ నోటీసు పంపించడంతో అధికారుల్లో చలనం వచ్చింది. ప్రస్తుతం ఈ నోటీసును ఆయా మండలాల్లోని తహసీల్దార్లకు పంపించారు.
 
 కుప్పలు తెప్పలుగా గ్రీవెన్స్‌సెల్‌కు ఫిర్యాదులు
 జిల్లాలోని పూసపాటిరేగలో 166, భోగాపురంలో 144, డెంకాడలో 189, గంట్యాడలో 88, విజయనగరంలో 95 ఇళ్లు హుద్‌హుద్ తుఫాన్‌కు దెబ్బతిన్నా గుర్తించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. కూలిన ఇళ్లకు పరిహారాలు పంపిణీ చేసిన సమయంలోనే జిల్లా కేంద్రంలో నిర్వహించే గ్రీవెన్స్‌సెల్‌కు వందలాది ఫిర్యాదులు వచ్చాయి. పశువుల శాలలు కూలిపోయిన వారికి కూడా ఇళ్లు కూలిపోయినట్టు ఇచ్చారనీ, పశువుల శాలలు లేనివారికి కూడా కూలిపోయినట్టు రాసేశారనీ, ప్రజా ప్రతినిధుల ఇళ్ల వద్ద కూర్చుని ఎన్యూమరేషన్ చేశారనీ ఫిర్యాదులు అందాయి.

అప్పట్లో ఓ సంస్థ దీనికి సంబంధించి పైన ఉదహరించిన మండలాల్లో పర్యటించి అర్హులయిన వారికి ఏ విధంగా పక్కన పెట్టారో ఓ నివేదికను కలెక్టర్ కార్యాలయానికి ఇచ్చింది. అయితే అర్హులను గుర్తించడంలో అధికారులు స్పందించకపోవడంతో వారు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. ఇప్పుడు మానవ హక్కుల సంఘం ఈ నోటీసును కలెక్టర్ కార్యాలయానికి పంపించింది.  డీఆర్వో మారిశెట్టి జితేంద్ర పేరుతో జిల్లా కలెక్టర్ ఆయా మండలాలకు ఈ నోటీసులను పంపించారు. రెండు రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. లేకుంటే మానవ హక్కుల సంఘం ఎదుట హాజరు కావాల్సి ఉంటుందని ఆ నోటీసుల్లో హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement