ఇంకెన్నాళ్లీ నిరీక్షణ
హుద్‌హుద్ తుఫాన్ వచ్చి ఎనిమిది నెలలు దాటుతోంది.. ఇంకా వేలాది మందికి సాయం అందని పరిస్థితి . నెలల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నా సాయం అందని ద్రాక్షగా మారింది. చిరునామాలు దొరకడం లేదనే సాకుతో వేలాది మందిని జాబితాల నుంచి తొలగించారు. చిరునామాలు దొరికిన వారికి చెక్కుల రూపంలో పంపిణీ చేయాలని తలపోసినా శాఖల మధ్య సమన్వయలోపం శాపంగా తయారైంది.
- ఇంకా అందని హుద్‌హుద్ సాయం
- 40 వేల మంది పేర్లు తొలగింపు
- మరో 23వేలమందికి తప్పని నిరీక్షణ
సాక్షి విశాఖపట్నం: హుద్‌హుద్ వల్ల నిరుపేదలు, మధ్య తరగతి నిలువనీడ లేక అల్లాడిపోయారు. లక్షలాది ఎకరాల్లో పంటలుదెబ్బతిన రైతులు, జీవనోపాదిలేక మత్స్యకారులు తల్లడిల్లిపోయారు. ఏడేసిలక్షల రూపాయలకు చొప్పున చనిపోయిన 45 మందికి పంపిణీ చేశారు. తుఫాన్ తర్వాత మరో ఎనిమిది మంది మృతి కేసులు నమోదైనా నలుగురు తుఫాన్ వల్ల చనిపోయినట్టుగా నిర్ధారించారు. వారికి పరిహారం ఇంతవరకూ రాలేదు. 1.18 లక్షల మందికి ఇళ్లు దెబ్బతినగా బట్టలు, సామాన్లు, పెట్టీషాపులు కోల్పోయిన మరో 37వేల మందికి రూ.82.44కోట్లు విడుదలైతే 1,18,499 మందికి రూ.64.05 కోట్ల జమ చేశారు.
వ్యవసాయ పంటలు దెబ్బతిన్న 1,52,806 మంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద 46.46కోట్లు విడుదలైతే 1,28,271 మందికి మాత్రమే రూ.40.42కోట్ల మేర జమచేసామన్నారు. బాధిత ఉద్యానవన రైతులకు రూ.161.56కోట్లు విడుదల కాగా రూ.101. 29కోట్లు, పాడి రైతులకు రూ.19.22కోట్లు విడుదల కాగా, రూ.15.51 కోట్లు అకౌంట్లలో జమ చేశారు. వలలు,బోట్లు దెబ్బతిన్న 3993మంది మత్స్యకారులకు రూ.8.07 కోట్లు విడుదల కాగా రూ.3.50కోట్లు పంపిణీ చేశారు. ఈవిధంగా జిల్లా వ్యాప్తంగా 4.80 లక్షల మంది బాధితులకు 3.70లక్షల మందికి రూ.249.20కోట్ల మేర పంపిణీ చేశారు. పేర్లు, అకౌంట్.. ఆధార్ నెంబర్ల నమోదులో దొర్లిన పొరపాట్ల వల్ల కొంతమందైతే..ఎన్యుమరేషన్ సమయంలో గుర్తించిన లబ్ధిదారులు ఆతర్వాత వేరే చిరునామాలకు మారిపోవడం లేదా వేరే ప్రాంతాలకు తరలిపోవడం వంటి ఘటనల వల్ల మరికొంతమందికి సాయం అందలేదు .
ఈ విధంగా సుమారు లక్షా 3వేల మంది బాధితులకు పరిహారం పంపిణీలో తీవ్ర జాప్యం నెలకొంది. జాబితాలో ఉన్న ప్పటికీ ఎవరూ తమకు పరిహారం అందలేదని క్లైయిమ్ చేయని వారు, ఎన్నిసార్లు వెతికినా చిరునామాలుదొరకని వారి పేర్లను గుర్తించి జాబితాల నుంచి తొలగించారు. ఇప్పటి వరకు అన్ని శాఖలు కలిపి సుమారు 43వేల మంది పేర్లను తొలగించారు. వీరిలో గృహ లబ్ధిదారులు 6వేలుండగా,సుమారు 19వేల మంది రైతులు, మరో 15వేలమంది హార్టికల్చర్ రైతులు, ఇతర లబ్దిదారుల మరో మూడువేల మంది వరకు ఉన్నారు.
గడిచిన నాలుగునెలల్లో క్షేత్ర స్థాయి పరిశీలనలో గుర్తించిన లబ్దిదారులకు దశలవారీగా పంపిణీ చేస్తున్నారు.అకౌంట్ నెంబర్లు, ఆధార్ కార్డుల్లేక కొంతమంది..వివరాలు సరిపోక అర్హులైన లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇటువంటి వారికి చెక్కుల ద్వారా పంపిణీ చేయాలని ఇటీవలే జిల్లా కలెక్టర్ యువరాజ్ నిర్ణయం తీసుకుని ఆ మేరకు పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు సుమారు 40వేల మంది వరకు ఈ విధంగా పంపిణీచేయగా మరో 23వేలమందికి పంపిణీ చేయాల్సిఉంది. వీరిలో 7766మంది గృహలబ్దిదారులకు రూ.4.50కోట్లు 4,300మందికి రూ.1.10 కోట్లు, 2,200 మందికి రూ.2.50కోట్ల పంపిణీ చేయాల్సి ఉంది. మిగిలిన శాఖలకు సంబంధించి మరో రెండుకోట్ల వరకు పంపిణీ చేయాల్సి ఉందని తెలుస్తోంది.