2న మంథన్ సంవాద్
మేధోమథన సదస్సును విజయవంతం చేయండి
ఫౌండేషన్ ప్రతినిధుల పిలుపు
హైదరాబాద్: మంథన్ ఫౌండేషన్ సామాజిక సంస్థ ఆధ్యర్యంలో ‘మంథన్ సంవాద్ - 2014’ పేరిట అక్టోబరు రెండున గాంధీ జయంతిని పురస్కరించుకొని మేధోమథన సదస్సును నిర్వహించనుంది. మంథన్ ఫౌండేషన్ సామాజిక సంస్థ ప్రతినిధులు, విశాంత్ర ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, అజయ్‌గాంధీ, చందనా చక్రబట్టిలు ఈ మేరకు తెలిపారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. నగరంలోని విస్పర్ వ్యాలీ రోడ్‌లోని జేఆర్సీ కన్వెక్షన్ సెంటర్‌లో సదస్సు ఆ రోజు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 వరకు జరుగుతుందన్నారు. ఈ వేదిక దేశంలోని సమస్యల గురించి విపులంగా - సూక్ష్మంగా విశ్లేషించేందుకు ఉపకరిస్తుందన్నారు. సదస్సుకు అన్ని ప్రాంతాల నుంచి 1,500 మంది హాజరు కావచ్చన్నారు. గత ఏడాది తాము నిర్వహించిన సదస్సు బాగా జరిగిందనీ ఈసారీ జయప్రదమవుతుందని మాధవరావు ఆశాభావం వ్యక్తపరిచారు.
కార్యక్రమంలో ప్రముఖ వక్త అరుణ్ మైరా ‘మంథన్ సంవాద్ కార్యక్రమాల’ గురించి, ప్రఖ్యాత అర్కిటెక్ట్ అండ్ అర్బన్ డిజైనర్ కేటీ రవీంద్రన్ ‘భవిష్యత్తు అవసరాలు’, కల్పనా కన్నాభిరన్ ‘మహిళల హక్కులు- చట్టాలు’, ప్రముఖ జర్నలిస్టు శేఖర్ గుప్తా ‘దేశాభివృద్ధిలో సమానత్వం’, వందనాశివ ‘వ్యవసాయం... భవిష్యత్తు’, రాజకీయ ప్రముఖుడు యోగేంద్ర యాదవ్ ‘భవిష్యత్తు రాజకీయ ప్రత్యామ్నాయాలు’ అనే అంశాలపై మాట్లాడతారని చెప్పారు. ఈ సంవాద్‌లో పాల్గొనాలనుకునే వారు తమ పేర్లను ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ మంథన్‌సంవాద్ డాట్ కామ్ వెబ్‌సైట్’లో నమోదు చేసుకోవాలన్నారు. ప్రవేశం ఉచితమన్నారు. తొమ్మిదేళ్లుగా నిర్వహిస్తున్న తమ సంస్థ అనేక సామాజిక అంశాలపై విసృ్తత చర్చలు జరిపిందన్నారు. 9 మందితో ప్రారంభించిన ఈ సంస్థలో ఇప్పుడు ఆరువేలమంది సభ్యులుగా ఉన్నారన్నారు.