బూర్గంపల్లి : కొన్ని నిమిషాల కిందట పుష్కర స్నానాలు ముగించుకుని అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్న ఇద్దరు మహిళలు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా బూర్గంపల్లి వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. చిత్తూరు జిల్లా సోమల మండల కేంద్రానికి చెందిన వెంకటలక్ష్మి కుటుంబసభ్యులు గోదావరి పుష్కర స్నానాల కోసం కుటుంబంతో సహా టవేరా వాహనంలో బయలుదేరారు. రాజమండ్రిలో పుణ్యస్నానాలు ముగించుకొని అటునుంచి అటు అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో బూర్గంపల్లి వద్ద టీ తాగడం కోసం వాహనాన్ని రహదారి పక్కన ఆపి అందులోంచి వెంకటలక్ష్మి(49), కుమారి(44), నాగయ్య(40) ముగ్గురు కిందికి దిగారు.
అదే సమయంలో ఈ వాహనం వెనక ఒక తుఫాన్ వాహనం నిలిపి ఉంది. దాని వెనక ఉన్న లారీ(ఐచర్) ఈ వాహనాన్ని ఢీ కొనడంతో.. ముందుకు దూసుకొచ్చిన తుఫాన్... వెంకటలక్ష్మి సహా ముగ్గురిని ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటలక్ష్మి, కుమారి అక్కడికక్కడే మృతిచెందగా.. నాగయ్య తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ నాగయ్యను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అప్పుడే పుణ్యస్నానం.. అంతలోనే విషాదం
Published Wed, Jul 22 2015 1:59 PM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM
Advertisement