మేల్కోండి.. ప్రాణాలు కాపాడండి!
గుండెలు పిండేసే విషాదం. హృదయాలను ద్రవింపచేసే ఘోర ప్రమాదం. పాపపుణ్యమెరుగని పసివాళ్ల ప్రాణాలను మృత్యుశకటం చిదిమేసిన ఘటన అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. చదువుల కోసం బ్యాగులు భుజాన వేసుకుని బస్సు ఎక్కిన చిన్నారులు కానరానిలోకాలకు వెళ్లిపోయారు. వెళ్లొస్తామంటూ ఉత్సాహంగా వెళ్లిన తమ బంగారు కొండలను రైలు రాక్షసుడు కానరాని లోకాలకు ఎత్తుకుపోయాడని తెలియగానే తల్లడిల్లుతున్న తల్లిదండ్రుల శోకాగ్నికి చల్లార్చడం ఎవరి తరం?
తెలుగువారిపై విధి పగబట్టినట్టుగా కన్పిస్తోంది. రెండు నెలల వ్యవధిలో నాలుగు విషాద ఘటనలు దాదాపు వంద మంది తెలుగువారిని పొట్టనపెట్టుకున్నాయి. నీరు, నిప్పుతో పాటు విధి కూడా తెలుగువారిపై కక్ష గట్టినట్టు కనబడుతోంది. మనవారికి జరుగుతున్న వరుస ప్రమాదాలు చూస్తుంటే ఈ భావనే కలుగుతోంది. తెలుగు ప్రజలంటే విధికి ఎందుకంత కోపం?
మెదక్ జిల్లాలో గురువారం(జూలై 24) జరిగిన ఘోర ప్రమాదం 20 మంది పసివాళ్ల ప్రాణాలు తీసింది. నాందేడ్ ప్యాసిజర్ రైలు రూపంలో వచ్చి మృతువు కాటేసింది. స్కూల్కు వెళ్లాల్సిన చిన్నారులను శవాలుగా మార్చింది. తల్లిదండ్రులకు తీరని గర్భశోకం మిగిల్చింది.
విహారయాత్రకు వెళ్లిన 24 మంది ఇంజినీరింగ్ విద్యార్థులను జూన్ 8న బియాస్ నది మింగేసింది. జూన్ 27న తూర్పుగోదావరి జిల్లా నగరం గ్రామంలో చలరేగిన దావాగ్ని 22 మందిని బుగ్గిచేసింది. నగరం ఘటన జరిగిన మరునాడే చెన్నైలో భవనం కూలిన దుర్ఘటనలో 61 మంది శిథిలాల కింద సమాధయ్యారు. మృతుల్లో సగం మందిపైగా తెలుగువారుండడం మరో విషాదం.
ఈ నాలుగు విషాద ఘటనలు- పాలకుల నిష్క్రియ, అధికారుల నిర్లక్ష్యాన్ని సజీవ సాక్ష్యాలు. వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా పాలకులు, అధికారులు మొద్దునిద్ర వదలడం లేదు. ఇంకా ఎంత మందిని బలి తీసుకుంటారు. దయచేసి మేల్కోండి. అమాయకుల ప్రాణాలు కాపాడండి.